చంద్రబాబు డూప్‌ దొరికాడోచ్‌! | Ram Gopal Varma find A Man Who Alike Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు డూప్‌ దొరికాడోచ్‌!

Published Sun, Oct 14 2018 8:39 PM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

Ram Gopal Varma find A Man Who Alike Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రంలో ఆయన అల్లుడు, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడు పాత్రధారి కోసం సరిగ్గా ఆయన్ను పోలిన వ్యక్తి ఆచూకీని కనుగొనేందుకు ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ ప్రారంభించిన వేట ఫలించింది. ఎక్కడో గుర్తు తెలియని ఓ ప్రాంతంలోని హోటల్‌లో సరిగ్గా చంద్రబాబును పోలిన ఓ వెయిటర్‌ హాఫ్‌ బనియన్, నిక్కర్‌ ధరించి వినియోగదారులకు ఆహారం వడ్డిస్తున్న వీడియో గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వ్యక్తి ముఖం, గడ్డం కూడా దాదాపు చంద్రబాబును పోలి ఉండటంతో సామాజిక మాధ్యమాల్లో వేల మంది సరదాగా షేర్‌ చేశారు. ఈ వీడియోను చూసి ఆకర్షితుడైన రాంగోపాల్‌ వర్మ సదరు వ్యక్తి ఆచూకీని కనుక్కోవడంలో సహకరించినవారికి రూ.లక్ష అందజేస్తానని శనివారం ఫేస్‌బుక్‌లో ప్రకటన చేశారు.

అతడే కాకపోయినా, అతడి(చంద్రబాబు)ని పోలిన మరో వ్యక్తి ఆచూకీ తెలిపినా ఈ బహుబమతి అందజేస్తానని వెల్లడించారు. ఆర్జీవీ ఇచ్చిన ఆఫర్‌ సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ న్యూస్‌ చానల్‌లో పనిచేసే ముత్యాల రోహిత్‌ చంద్రబాబును పోలిన వెయిటర్‌ ఆచూకీని ఆర్జీవీకి పంపారు. ఈ విషయాన్ని శనివారం రాత్రి 10 గంటల తర్వాత ఆర్జీవీ ఫేస్‌బుక్‌ ద్వారా ధ్రువీకరించారు. ‘‘హే రోహిత్, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా యూనిట్‌కు సీబీఎన్‌(చంద్రబాబు)ను బహుకరించినందుకు కృతజ్ఞతలు. సినిమా ప్రారంభంలో తెరపైకి నీ పేరు వేసి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నీ బ్యాంకు ఖాతా నంబర్‌ పంపించు లక్ష రూపాయల బహుమతి కోసం..’’అని ఆర్జీవీ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు.

ఇదిలా ఉండగా, చంద్ర బాబును పోలిన హోటల్‌ వెయిటర్‌ వివరాలను ఆర్జీవీ ఇంకా బహిర్గతం చేయలేదు. అయితే, ఈ వ్యక్తి పేరు ప్రభు అని, గతంలో అతడు త్రయంబకేశ్వర్‌లోని హోటల్‌లో పనిచేసేవాడని, ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాడని ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పేర్కొన్నాడు. ఈ వ్యక్తికి సంబంధించి ఇటీవల వైరల్‌ అయిన వీడియో ఏడాది క్రితం తీసిందని అతడు వెల్లడించారు. ఈ వివరాలను ధ్రువీకరించాల్సి ఉంది. వచ్చే జనవరి చివరి వారంలో విడుదల కావాల్సిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంలో నటించేందుకు చంద్రబాబును పోలిన వ్యక్తి అంగీకరిస్తాడా? లేదా ? అన్నది వేచిచూడాలి.

చదవండి : ఈ వ్యక్తిని పట్టిస్తే వర్మ నజరానా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement