బాబూ.. ఎక్కడ ప్రజాస్వామ్యం? | Ram Gopal Varma Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

బాబూ.. ఎక్కడ ప్రజాస్వామ్యం?

Published Mon, Apr 29 2019 3:38 AM | Last Updated on Mon, Apr 29 2019 7:47 AM

Ram Gopal Varma Fires On Chandrababu - Sakshi

గన్నవరం ఎయిర్‌పోర్టులో రామ్‌గోపాల్‌ వర్మను అడ్డుకుంటున్న పోలీసులు

నిజం చెప్పేందుకు ప్రయత్నించినందుకు ఇప్పుడు నేను పోలీసు కస్టడీలో ఉన్నా. విజయవాడకు రాకూడదా? ఎవరితోనూ మాట్లాడకూడదా?  హే.. చంద్రబాబూ.. ఎక్కడ ప్రజాస్వామ్యం?
– ట్విటర్‌లో రామ్‌గోపాల్‌ వర్మ

సాక్షి, అమరావతి బ్యూరో, హైదరాబాద్‌ : బెజవాడలో ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అక్రమ నిర్బంధ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అన్న చర్చ తీవ్రంగా జరుగుతోంది. సర్కారు తీరును చూసి సామాన్యులు సైతం ముక్కున వేలేసుకొనే పరిస్థితి నెలకొంది. రామ్‌గోపాల్, అగస్త్య మంజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. ‘అసలు కథ’ అనేది ఉప శీర్షిక. రాకేశ్‌ రెడ్డి, దీప్తీ బాలగిరి నిర్మించారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌ మినహా ప్రపంచవ్యాప్తంగా మార్చి 29న రిలీజ్‌ అయింది. అంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. న్యాయస్థానం, ఎన్నికల కమిషన్‌ అనుమతితో తాజాగా ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్‌లో మే1న రిలీజ్‌ చేయాలనుకున్నారు. ప్రమోషన్‌లో భాగంగా విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌లో ఆదివారం ప్రెస్‌మీట్‌ నిర్వహించాలనుకున్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, నిర్మాత రాకేశ్‌ రెడ్డి.

హైదరాబాద్‌ నుంచి స్పైస్‌ జెట్‌ విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు గన్నవరం చేరుకున్నారు. అంతలోనే నోవాటెల్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించేందుకు అనుమతి నిరాకరించారన్న విషయం తెలిసింది. దీంతో హోటల్‌ ఐలాపురంలో ప్రెస్‌మీట్‌కు ఏర్పాట్లు చేయబోగా.. అక్కడ కూడా నిరాకరిస్తూ సమాధానం వచ్చింది. ఈ నేపథ్యంలో ‘మా చిత్ర బృందంతో నోవాటెల్‌లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్ర ప్రెస్‌మీట్‌ నిర్వహించాలని నిర్ణయించాం. కానీ ఆ హోటల్‌ వాళ్లు, ఎవరో వార్నింగ్‌ ఇవ్వడం వల్ల భయంతో అనుమతి నిరాకరించారు. మిగతా చోట్ల ప్రయత్నించినా అన్ని హోటళ్లు, క్లబ్బుల మేనేజ్‌మెంట్లు మనందరికీ తెలిసిన ఓ వ్యక్తి భయంతో జడిసి పారిపోయారు. దీంతో పైపుల రోడ్డులోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ దగ్గర నడిరోడ్డు మీద ప్రెస్‌మీట్‌ నిర్వహించబోతున్నాం. ఎన్టీఆర్‌ అభిమానులు, నా అభిమానులు, మీడియాను కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నా’ అని వర్మ ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు. 

రామవరప్పాడు రింగ్‌ రోడ్డు వద్ద అడ్డగింపు
గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దర్మక నిర్మాతలు వర్మ, రాకేష్‌రెడ్డి అతని స్నేహితులు పైపుల రోడ్డు వైపు మధ్యాహ్నం 12.20 గంటలకు కారులో బయలుదేరారు. రామవరప్పాడు రింగ్‌ రోడ్డు సమీపంలోకి చేరుకోగానే బెజవాడ పోలీసులు వారు ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్నారు. పైపుల రోడ్డులో ప్రెస్‌మీట్‌ పెట్టడానికి వీల్లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలున్నందున తిరిగి హైదరాబాద్‌కు వెళ్లాలని కోరారు. అందుకు వర్మ ససేమిరా అన్నారు. తాను ప్రెస్‌మీట్‌ నిర్వహించి తీరుతానని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా మరో కారులో ఎక్కించుకుని మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో గన్నవరం విమానాశ్రయానికి తీసుకెళ్లి అక్కడి లాంజ్‌లో ఉంచారు. అక్కడ ఆయన ఎవరితోనూ మాట్లాడకుండా కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్‌కు విమానంలో పంపించే ప్రయత్నం చేయగా, అందులో టికెట్లు దొరక్కపోవడంతో రోడ్డు మార్గంలో తరలించాలని చూశారు. తాను రోడ్డు మార్గంలో ప్రయాణం చేయనని వర్మ తేల్చి చెప్పడంతో రాత్రి 7.20 గంటలకు ఇండిగో విమానంలో వారిని హైదరాబాద్‌కు పంపించారు.  

ప్రజాస్వామ్యానికి ఇది బ్లాక్‌డే 
విమానాశ్రయం లాంజ్‌లో పోలీసుల అక్రమ నిర్బంధంలో ఉన్న వర్మ స్వయంగా ట్విటర్‌లో తన వీడియోను షేర్‌ చేశారు. ‘నిజం చెప్పేందుకు ప్రయత్నించినందుకు ఇప్పుడు నేను పోలీసు కస్టడీలో ఉన్నా. మా కార్లను ఆపి, మమ్మల్ని బలవంతంగా వేరే కార్లలో ఎక్కించారు. విజయవాడకు రావడానికి వీలులేదు అని వార్నింగ్‌ ఇచ్చి మమ్మల్ని తీసుకొచ్చి విమానాశ్రయంలో పడేశారు. ఎందుకు ఇలా చేశారు? పోలీసులు చట్టపరంగా వ్యవహరించరా? వారికి బాధ్యత లేదా? విజయవాడకు రావడానికి వీలులేదు, ఏ హోటల్‌లోనూ ఉండటానికి వీలు లేదు.. అని చెప్పడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నేను, నా నిర్మాత ఎంత అడిగినా పోలీసులు సమాధానం చెప్పకుండా ఇలా మమ్మల్ని విమానాశ్రయంలో పడేశారు. హే.. చంద్రబాబూ.. ఎక్కడ ప్రజాస్వామ్యం.. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేదే లేదు. అప్‌డేట్స్‌ చెప్పడానికి ప్రయత్నిస్తా’ అని వర్మ ట్వీట్‌ చేశారు. రాత్రి హైదరాబాద్‌ చేరుకున్న అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యానికి ఇది బ్లాక్‌డే అని నా అభిప్రాయం. కోర్ట్, ఎలక్షన్‌ కమిషన్‌ వల్ల మా సినిమాను ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేయడం కుదర్లేదు. అన్నీ అయిపోయి సినిమా రిలీజ్‌ చేయడానికి ప్రెస్‌మీట్‌ పెట్టడానికి విజయవాడ వెళ్తే మమ్మల్ని అడ్డుకుంటున్నారు.

ఈవెంట్‌ కోసం నిర్మాత రాకేశ్‌ రెడ్డి నోవాటెల్‌ హోటల్‌ బుక్‌ చేశారు. వాళ్లు చివరి నిమిషంలో వీలు లేదని క్యాన్సిల్‌ చేశారు. తర్వాత ఐలాపురంలో చేద్దామనుకుంటే వాళ్లూ అడ్వాన్సు తీసుకొని క్యాన్సిల్‌ చేశారు. ‘ఎన్టీఆర్‌ సర్కిల్‌ రోడ్డు మీద ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తాను’ అంటూ నేనో ట్వీట్‌ పెట్టాను. మేం ఎయిర్‌పోర్ట్‌ నుంచి వెళ్తుంటే పోలీసులు దార్లో మమ్మల్ని ఆపేసి, బయటకు లాగి వేరే కార్లో బలవంతంగా ఎక్కించి ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లారు. ‘రోడ్డు మీద ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేస్తే శాంతి భద్రతలకు ఇబ్బంది కలుగుతుంది’ అని చెప్పారు. అప్పుడు ఆ ప్రెస్‌మీట్‌ను అనుమతించకూడదు. అంతేకానీ మమ్మల్ని కార్లో ఎక్కించి ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లడమేంటి? విజయవాడ రాకూడదు.. ఎక్కడా ఏ హోటల్‌లో ఉండకూడదు.. హైదరాబాద్‌ వెళ్లి తీరాలి.. అనేలా బలవంతం చేశారు. 7 గంటల పాటు మమ్మల్ని బయటకు రాకుండా ఓ గదిలో కూర్చోబెట్టారు. ఎవ్వర్నీ కలవనీకుండా చేశారు.

తర్వాత విమానం ఎక్కించి హైదరాబాద్‌ పంపించేశారు. దీనికి అర్థమేంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మిమ్మల్ని అలా చేయమని ఎవరు చెప్పారు? ఎవరి ఆదేశాలివి? మాకిచ్చిన నోట్‌లో కేవలం ప్రెస్‌ మీట్‌ ఎందుకు క్యాన్సిల్‌ చేయాల్సి వచ్చిందని వివరించారు తప్పితే, మమ్మల్ని ఎందుకు పంపించేస్తున్నారన్న విషయం ఎక్కడా ఇవ్వలేదు. ఇదంతా రివేంజ్‌ డ్రామాలా ఉంది. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది? అందరూ సినిమా చూశారు. చాలా మంది పైరసీలో చూశారు. నేనంత కన్నా చెప్పడానికి ఏమీ లేదు. ‘ప్రెస్‌ మీట్‌ పెట్టడానికి వీలులేదు, విజయవాడ రావడానికి వీలులేదు’ ఈ విషయం అంతు చూడాలనుకుంటున్నాను. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నాం. ఏ కారణంతో నన్ను ఆపుతున్నారు అన్నది లీగల్‌గా ప్రశ్నించదలుచుకున్నాను. ఏ గ్రౌండ్స్‌ మీద మమ్మల్ని వెనక్కు పంపించారు? ఓ పౌరుడిగా వీటిని ప్రశ్నించే హక్కు నాకుంది. ఇవాళంతా (ఆదివారం) ప్లాన్‌ చేసి ఎలా ముందుకు వెళ్తాం అనే విషయాన్ని రేపు (సోమవారం) డీటైల్స్‌తో సహా ఇస్తాను’’ అని వర్మ చెప్పారు. 

శాంతిభద్రలకు విఘాతమని అదుపులోకి తీసుకున్నాం
ప్రస్తుతం విజయవాడ నగర పరిధిలో సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్, సెక్షన్‌ 114 సీఆర్‌పీసీ, ఎలక్షన్‌ కోడ్‌ అమల్లో ఉన్నాయి. అందువల్ల ప్రెస్‌మీట్‌ నిర్వహించేందుకు ముందస్తుగా పోలీసుల అనుమతి తప్పనిసరి. నిత్యం రద్దీగా ఉండే విజయవాడలోని పైపులరోడ్డు, ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగి ప్రజలకు అసౌక్యం ఏర్పడే అవకాశం ఉంది. ఆ ప్రాంతంలోని ఐబీఎం కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయి. అందువల్ల అక్కడ ప్రెస్‌మీట్‌ ప్రయత్నం విరమించి శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులకు సహకరించాలని కోరాం. అందుకు ఆయన ససేమిరా అనడంతో అదుపులోకి తీసుకున్నాం.
– ద్వారక తిరుమలరావు, పోలీసు కమిషనర్, విజయవాడ
 
వర్మను నిర్బంధించడం ప్రభుత్వ పిరికిపంద చర్య 
గన్నవరం: లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్ర దర్శక, నిర్మాతలు రాంగోపాల్‌వర్మ, రాకేష్‌రెడ్డిలను పోలీసులు అడ్డుకుని ఎయిర్‌పోర్టులో నిర్భందించడం టీడీపీ ప్రభుత్వ పిరికిపంద చర్య అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. గన్నవరం విమానాశ్రయంలో ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విషయంలో టీడీపీ ఎందుకు ఇంతగా భయపడుతోంది? అంత పిరికితనమా? పోలీసులు కూడా భారీ బందోబస్తుతో ఇలా నిర్భంధించాలా? చట్టానికి వ్యతిరేకంగా ఇలా వ్యవహరించడం సబబేనా? సెన్సార్‌ బోర్డు సినిమా రిలీజ్‌కు అంగీకరించాక ప్రమోషన్‌ను అడ్డుకోవడం చట్ట వ్యతిరేకం. అప్పుడే ఇక్కడ ఈ సినిమా విడుదలైంటే చంద్రబాబు థియేటర్లు దొరక్కుండా చేసేవారు’ అన్నారు. అంబటితో పాటు వైఎస్సార్‌సీపీ గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు.

వర్మ గొంతు నొక్కేసింది ప్రభుత్వమే 
– ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ట్వీట్‌
సాక్షి, అమరావతి: ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యహరించిన తీరును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. విజయవాడలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కూడా పోలీసులు అనుమతి నిరాకరించి బలవంతంగా హైదరాబాద్‌ పంపడం ద్వారా వర్మను మాట్లాడనీయకుండా ప్రభుత్వమే ఆయన గొంతు నొక్కేసిందని ఆరోపించారు. ఇలాంటి సంఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలిపోతుందని, ఇలాంటి వైఖరి గర్హనీయమని పేర్కొంటూ ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement