
భీమవరం: ఏపీ మహిళలు పసుపు–కుంకుమ తీసుకుని టీడీపీకి ఉప్పు–కారం ఇచ్చారని ప్రముఖ సినీదర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చెప్పారు. ఈ నెల 31న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా విడుదలకు సంబంధించి విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటుచేయగా కొంతమంది అడ్డుకున్నారని.. అందువల్లనే ఎన్టీరామారావు ఆగ్రహించి చంద్రబాబును చిత్తుగా ఓడించారని తెలిపారు.
ఏపీలో సైకిల్‌కు పంక్చరైనందునే తాను కారులో వచ్చినట్టు చమత్కరించారు. ఎన్టీఆర్ జీవితం చివరి అంకంలో జరిగిన ఘటనలను ప్రజలకు తెలియజేసేందుకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీశాను తప్ప తనకు ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. త్వరలో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రాన్ని తీయనున్నట్టు ప్రకటించారు. తనకు రాజకీయాల్లోకొచ్చే ఆలోచన లేదని వర్మ స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఏనాడూ తనకున్న పవర్‌ను దుర్వినియోగం చేసి సొంతానికి వాడుకోలేదన్నారు.