వర్మ చిత్రానికి బాబు ‘బర్మా’?! | Chandrababu Naidu Try To Stop Release Laxmis NTR Movie In AP | Sakshi
Sakshi News home page

వర్మ చిత్రానికి బాబు ‘బర్మా’?!

Published Tue, Apr 30 2019 12:37 AM | Last Updated on Tue, Apr 30 2019 12:37 AM

Chandrababu Naidu Try To Stop Release Laxmis NTR Movie In AP - Sakshi

వర్మ తీసిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ను ఆంధ్రలో విడుదల కాకుండా చంద్రబాబు చేస్తున్న ‘చీకటి’ ప్రయత్నం.. పత్రికా మాధ్యమాలపైన, ప్రతిపక్ష చానళ్లపైన ప్రభుత్వాధినేత విరుచుకుపడుతూ వాటిని అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడనేందుకు నిదర్శనం. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్ర దర్శకుడి పత్రికా గోష్టిని అడ్డుకోవటం ఎన్టీఆర్‌కు బాబు వెన్ను పోటు పొడిచినందుకా లేక ఆ విషయాన్ని వెండితెరకు వర్మ ఎక్కించినందుకా?! వెన్నుపోటు పొడిస్తే భయంగానీ, పొడవకపోతే భయం దేనికి? తన కంట్లో దూలం ఉందని గుర్తించగలిగినప్పుడే.. ఎదుటివాళ్ల కళ్లల్లో నలుసులున్నాయని వేదికలెక్కి బాబు అరవటం మానేస్తాడు. పాత్రపోషణ చాలా కష్టం. అందులోనూ రాజకీయాల్లో మరీ కష్టం!

ప్రాచీన కవి పిడపర్తి బసవనారాధ్యుడు ‘అహంకారం’ అనే మృగాన్ని నాయకుడనే వాడు ఎలా తొలగించుకుంటే సుఖపడతాడో లేదా ప్రజల మన్ననకు ఎలా పాత్రుడవుతాడో ‘ప్రభులింగలీల’లో వేదాంత సారాన్ని విప్పి చెప్పాడు. ఇంతకూ పాలకుడనేవాడు తన శరీరంలోనే తన మనస్సు పొరలలోనే గూడుకట్టుకుని జీవిస్తున్న ‘అహంకార’మనే మృగాన్ని ఎలా తొలగించుకోవాల్సి ఉంటుందో ఇలా చెప్పాడు: ‘‘అయ్యా, ఈ శరీరం అనే అడవిలో ఒక మృగం ఎప్పుడూ దాక్కునే ఉంటుంది. దాని పేరే అహంకారం (తనువను కానలో తావ లంబైయుండు/అరయ అహంకారమను మృగంబు)’’ అన్నాడు. మరి దాన్ని సాగనంపడం ఎలా అని ప్రశ్నించుకున్న పిడపర్తి కవికి ఒక ఆలో చన, ఒక పరిష్కారం దొరికిందట. అహంకారం తొలగించుకోవాలంటే ఒక ‘మందు’ కనిపెట్టాడాయన. ఆ మందు ఏది, ఎక్కడ దొరుకుతుంది అంటే ‘వివేకం’ అనే వేటగాడి వద్ద ఉంటుందట.  వేటగాడి వద్ద ఉండాల్సింది ‘కత్తి’ కదా ‘వివేకం’ అంటాడేమిటి అనుకుంటున్నారా? పొరపడకండి, ఆ వేటగాడు ఎలాగూ వివేకి కాబట్టి ‘జ్ఞానం’ అనే అగ్నిలో వండి ‘అహంకార’ మృగాన్ని కూల్చి మరీ వివేకం ప్రదర్శిస్తాడట! ఇంతకీ ఆ వేటగాడు ఈ విద్యను తన గురువైన శివుడి వద్ద నేర్చుకున్నాడట. తన మూడు కన్నుల్లో (ముక్కంటి) శివుడు ఏ కన్ను విప్పాడో గానీ శివుడి శిష్యుడైన వేటగాడు ఎలాంటి జంకూ లేకుండా మూడో కన్ను విప్పి ఆ అహంకార మృగాన్ని కాస్తా కూల్చేశాడు.

అలాంటి వేటగాళ్లు దుష్టపాలకుల విషయంలో మనకూ అవసరమే కదా! భారత, రామాయణాదులన్నీ దుష్ట శిక్షణ గురించి, శిష్ట రక్షణ గురించి వేల సంవత్సరాలుగా విసుగు లేకుండా బోధిస్తున్నవే, తల మొత్తేలా మొత్తుకుంటున్నవే! కథల్లో, కళల్లో, చిత్రాల్లో, వ్యంగ్య చిత్రాల్లో, చలన చిత్రాల్లో, వీధి నాటకాల్లో, బుర్రకథల్లో వీర గాధల ద్వారా అనాదిగా మనం వింటూ వస్తున్న ప్రబోధ రచనలే. మానవుడి లోని ఈ అహంకార, దురహంకార లక్షణాలన్నీ పలువురు చిత్రనిర్మా తలు, చిత్రదర్శకులు, స్త్రీ, పురుష నటులూ ఎండగడుతూ అసంఖ్యాక ప్రేక్షకులకు విజ్ఞాన ప్రబోధం చేసి కర్తవ్యాన్ని కళ్లముందుంచుతున్నవే.  భారత రామాయణ, భాగవత పురాణ గాథలకు కొంత మసాలా కలిపి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా కీర్తి ప్రతిష్టలు పొంది, తుదకు తెలుగు ప్రజల ఆత్మగౌరవ పతాకను ప్రజాకంటక పాలకులకు వ్యతి రేకంగా ఎత్తి సమున్నత విజయాన్ని సాధించినవారు ఎన్టీ రామారావు! అంతవరకూ కాంగ్రెస్‌ ‘తెర’లో ఉన్న బాబు ఎవరి ప్రోత్సాహకంతోనో, మరెవరి ప్రోద్బలంతోనో ఎన్టీఆర్‌ దగ్గరకు జరిగి, ఆ ఇంటిలోనే ఓ ఇంటి వాడై, మామ అయిన ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి సీటు నుంచి కూలదోసి వెన్నుపోటు రాజకీయం ద్వారా అందలమెక్కిన గాథ అంతా లోకవి దితం. లోకానికి తెలిసిన ఈ బాబు బాగోతాన్ని తెరకెక్కించిన ప్రసిద్ధ దర్శకుడు రాం గోపాల్‌ వర్మ, నిర్మాత రాకేష్‌ రెడ్డి ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రంతో ముందుకు వచ్చారు. ఈ బయోపిక్‌ వెలుగు చూడటానికి ముందు ఎన్టీఆర్‌ కొడుకు, ప్రసిద్ధ నటుడు, చంద్రబాబు బావమరిది బాలకృష్ణ ‘కథా నాయకుడు’, ‘మహానాయకుడు’ అని రెండు బయో పిక్కులు తీశారు. ఈ రెండు చిత్రాలలోనూ ఏదీ ‘పిక్క’ లేదని ప్రేక్షకులు తీర్పు ఇవ్వడం ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు తల వంపులు తెచ్చినంత పనైంది. ఎన్టీఆర్‌ మొదటి భార్య బసవతారకం దివంగతురాలైన పిమ్మట ఆయన విద్యావంతురాలైన లక్ష్మీపార్వతిని లక్షలాదిమంది తిరుపతి ప్రేక్షకుల సమక్షంలో పెళ్లాడింది మొదలు ఎన్టీఆర్‌పై చంద్రబాబు సాగిం చిన కుట్రలకు హద్దూపద్దూ లేదు.

ఈ మొత్తం పూర్వ రంగం నుంచి కథా గమనాన్ని ఎంపిక చేసుకుని ఎన్టీఆర్‌ మరణానికి పూర్వం, ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండగా, పదవినుంచి త్రోసిరాజని తాను పదవిలోకి రావడానికి అల్లిన అబద్ధ ప్రచారాలు, ఎన్టీఆర్‌ను వెన్నుపోటు ద్వారా పదవీచ్యుతుడిని చేయడానికి చంద్రబాబు పన్నిన కుట్రలు, అందుకు పార్వతి వ్యక్తిత్వాన్ని కించపరచ డానికి బాబు చేసిన కుట్రలు, కుహకాలు రాంగోపాల్‌ వర్మ చిత్రానికి పోపు అందించాయి. ఈ పురాగాథ చలన చిత్రం రూపంలో బయోపిక్‌గా బట్టబయలయితే బాలకృష్ణ రెండు బయోపిక్‌ పరువుప్రతిష్టలు (ఎన్టీఆర్‌ చరిత్రలో ఖూనీ అయిన సత్యాలు) గంగలో కలిసిపోతాయన్న భీతి ఆందోళన చంద్రబాబు మనస్సును ముప్పెరగొని, కకావికలు చేసి ఉంటుంది. బహుశా బాబులో చల్లారని అంతరంగ సంక్షోభమే ఆంధ్ర ప్రాంతంలో వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విడుదల కాకుండా అడ్డుకోడానికి కారణం అని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇంకో ముఖ్యాంశం– ఫిలిం సెన్సార్‌ బోర్డు ఆటంకాలు లేవు, ఎలెMý‡్షన్‌ కమిషన్‌ అయినా వర్మ తీసిన చిత్రం విడుదలను ఈ ఉద్రేక వాతావరణం మధ్య తాత్కాలికంగా నిలుపు చేసిందేగానీ అధికారికంగా నిషేధించలేదు. అయినా తెలుగు ప్రజలలో దాదాపు సగంమంది తెలంగాణలో వర్మ తీసిన బయోపిక్‌కు ఆనందాతిశయంతో ఆమోద ముద్ర వేశారు. ప్రజాముద్ర అన్నా, ప్రజా తీర్పు అన్నా అలా ఉండాలి. ప్రజల ఓటింగ్‌ ఫలితాలు ఏ ఎన్నికల సంఘ నిబంధనలకూ, ఏ సెన్సార్‌ నిబంధనలకూ అందేవి కావు, కట్టుబడేవీ కావు. కట్టుబడి ఉండాలని కోరు కోవటం గాడితప్పి అన్నిరకాల అవి నీతికి అలవాటుపడి అందలమెక్కిన నేటి రాజకీయ పాలక శక్తులకే అల వాటైన సంప్రదాయమని మరచి పోరాదు.

పైగా భారత కేంద్ర ఎన్నికల సాధికార సంఘం ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళిలోని అయిదవ అధ్యాయం (పే. 31–43)  దేశమంతటా ఎన్నికల నిర్వహణ పరిపూర్తి అయి, నూతన ప్రభుత్వాలు అధికారం చేప ట్టేదాకా ఏ ఆపద్ధర్మ రాష్ట్ర ప్రభుత్వమూ లేదా సీఎంలూ, మంత్రులూ మధ్యలో ‘కొత్త పథకాలను ప్రకటించడంగానీ, ద్రవ్య సంబంధమైన ఆర్థిక, పరిపాలనా సంబంధమైన నిర్ణయాలు ప్రకటించటంగానీ’ పూర్తిగా నిషిద్ధమని పాలకులను, అధికారులనూ ఆదేశించింది. అలాగే ఆర్థికపరమైన గ్రాంట్లనుగానీ, పునాదిరాళ్లు వేయడంగానీ, రోడ్ల నిర్మా ణంగానీ, మంచినీళ్ల సదుపాయం కల్పిస్తామనిగానీ ఎలాంటి హామీ లనూ ఎన్నికల నిబంధనావళి అమలులో ఉండగా ఇవ్వరాదని ఆ ఆదే శంలో స్పష్టం చేసింది. అలాగే 19 (6వ అధ్యాయం)లో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న దశలో ‘ప్రజల సొమ్ము అయిన ప్రభుత్వ ఖజానా నుంచి పాలకులు ఎలాంటి అడ్వర్‌టైజ్‌మెంట్లు విడుదల చేయరాదని, సొంత ప్రచార హోర్డింగ్‌లు, ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోల ప్రదర్శన విష యంలో కూడా ఇదే వర్తిస్తుందని ఆదేశించింది. తన పాలన అవసాన దశలో ఉన్న సమయంలో బాబు బరితెగించి తనకు పడకపోచ్చని భావి స్తున్న ఓట్లను, సీట్లనూ ఆధునిక టెక్నాలజీ లోని మాయ మర్మాలన్నిం టినీ వినియోగించి తారుమారు చేయించే యత్నాల (ఐటీ గ్రిడ్స్‌) ఆధా రంగా, 2016లో అమెరికా పర్యటించినప్పుడే ప్రారంభించినట్లు ఆయన సన్నిహితులు కొందరి ద్వారా ఇప్పుడు తెలియవచ్చింది: ‘అక్కడ, నేను 2019 కోసం ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను’ అని ఆయన అన్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనితో ట్యాంపరింగ్‌కి బాబే పురోహితుడా అనే అనుమానాలు వ్యాప్తిలో ఉంటున్నాయి.

 ముంచుకొస్తున్న ఓటమి భయం కూడా పీడిస్తున్నందున బాబు తీసుకున్న తాజా నిర్ణయం– మీడియాపై విరుచుకుపడటం. వర్మ తీసిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ను ఆంధ్రలో విడుదల కాకుండా చేస్తున్న ‘చీకటి’ ప్రయత్నం ఇందుకు నిదర్శనం. వర్మ విజయవాడలో పత్రికా గోష్టిని అడ్డుకోవటం కోసం ఎన్నికల కోడ్‌ను కూడా విస్మరించి పోలీసుల్ని ప్రయోగించటం గన్నవరం విమానాశ్రయంనుంచే వెనక్కి హైదరాబా ద్‌కు బలవంతంగా పంపించివేయటం! అయినా ఈసీ వర్మ విషయంలో టీడీపీ ప్రభుత్వ వ్యవహారంపై సహితం కరకుగా వ్యవహరించకపో వడం చూస్తుంటే ప్రజలలో ఉన్న ఒక అనుమానాన్ని బలపర్చకపోయినా లోలోపల తొలగని ఒక శంకను మాత్రం–తీర్చలేకుండా ఉంది అది– బాబు బరితెగించి అన్ని కేంద్రీయ సంస్థల్నీ ధిక్కరించి, రాజ్యాంగ వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్న ప్పటికీ, బీజేపీలో మిగిలి ఉన్న పై స్థాయిలోని కొందరు ‘మిత్రుల’తో ఎక్కడో, ఏమూలనో బాబుకున్న సన్నిహిత సంబంధాలు ఇంకా తొలగ లేదని, కొనసాగుతూనే ఉండి ఉండాలన్న భావన లీలామాత్రంగా ప్రజల మనస్సుల్లో దోబూచులాడుతూనే ఉంది.

సాంఘిక సంస్కరణల పూర్వ రంగంలో గతంలో దూసుకువచ్చిన ఎన్నో సినిమాలు, శక్తివంతమైన డాక్యుమెంటరీలూ ఉన్నాయి. వాటిలో కొన్ని స్వతంత్ర భారత పాలకులు ముందు నిషేధించి, తరువాత విడు దల చేసినవీ ఉన్నాయి. దీపా మెహతా ‘ఫైర్‌’ చిత్రం, ‘ది డావెన్సీ కోడ్‌’ (2006), ‘ఆరక్షణ్‌’ (2011) చిత్రాలు ఈ కోవలోనివే. ఇంతకూ బాబుకు ఒకటే ప్రశ్న: ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్ర దర్శకుడి పత్రికా గోష్టిని అడ్డుకో వటం ఎన్టీఆర్‌కు బాబు వెన్నుపోటు పొడిచినందుకా లేక ఆ విషయాన్ని వెండితెరకు వర్మ ఎక్కించినందుకా?! వెన్నుపోటు పొడిస్తే భయంగానీ, పొడవకపోతే భయం దేనికి? తన కంట్లో దూలం ఉందని ఆయన గుర్తిం చగలిగితే ఎదుటివాళ్ల కళ్లల్లో నలుసులున్నాయని వేదికలెక్కి బాబు అరవటం మానేస్తాడు, రేపటి నిజాన్ని చెవులారా విని, కళ్లారా చూసు కుని ఆయనే చెప్పుకున్నట్లు తాను ‘ఓడినా ఫర్వాలేదు.. పెళ్లాం, కొడుకు, మనవడు ఉన్నారు’ కాలక్షేపానికి! మనకు సినిమాల్లో ఏవీఎస్‌ అనే దివంగత ప్రసిద్ధ హాస్యనటుడు తనకూ ఏదో ఒక తృప్తి కలిగిందనడానికి వ్యంగ్యంగా అలా ‘నాకూ ‘తుత్తి’ ఉంది’ అంటూండేవాడు. పాత్ర పోషణ చాలా కష్టం, అందులోనూ రాజకీయాల్లో మరీనూ!!

abkprasad2006@yahoo.co.in
ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement