
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచాన్నే ఏలుతోంది.. ఏ నిమిషంలో ఎవరు ఫేమస్ అయిపోతారో తెలియదు.. ఏ అంశం వైరల్ అవుతుందో తెలియదు.. అదంతా సోషల్ మీడియానే డిసైడ్ చేస్తుంది. అదీ సోషల్ మీడియా మహిమ. ఐస్ బకెట్ చాలెంజ్, రైస్ బకెట్ చాలెంజ్.. ఇలా చాలా చాలెంజ్‌లు సోషల్ మీడియా పుణ్యమా అని తెగ వైరల్ అయిపోయాయి. ఇప్పుడేమో తాజాగా మరో చాలెంజ్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. బొద్దింక తెలుసు కదా.. దాన్ని ముఖంపై పెట్టుకుని సెల్ఫీ దిగి దాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేయాలి. బొద్దింకను చూస్తేనే ఆమడ దూరం పారిపోతాం.. అలాంటిది ముఖంపై వేసుకుని ఫొటో దిగడమా.. వాక్ అనుకోకండి.
అదే మరి చాలెంజ్ అంటే.. అసలు ఇది ఎక్కడ మొదలైందంటే.. గత నెలలో మయన్మార్‌కు చెందిన అలెక్స్ ఆంగ్ అనే యువకుడు పెద్ద బొద్దింకను ముఖం మీద పెట్టుకుని ఫొటో దిగి ఫేస్‌బుక్‌లో పెట్టాడు. అంతే ఒక్కరోజులో ఈ పోస్ట్‌ను దాదాపు 20 వేల మంది షేర్ చేశారు. ఇక అప్పటినుంచి మయన్మార్, ఫిలిప్పీన్స్, ఇండోనేసియాల్లో బొద్దింకతో సెల్ఫీ దిగి పోస్ట్ చేస్తున్నారు. ఇందుకోసం ఎక్కువగా అమెరికన్ జాతికి చెందిన బొద్దింకలను వాడుతున్నారు. ఈ బొద్దింకలను ఆగ్నేయాసియా దేశాల్లో ఇంట్లో పెంచుకుంటుంటారు. చూడాలి ఇంకా ఎలాంటి చాలెంజ్‌లను మనం చూడాల్సి వస్తుందో!