
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచార వ్యూహా లపై దృష్టి సారించాయి. పెరుగుతోన్న సాంకేతికత తో ప్రచార వేదికలు మారిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా లేకుండా ఎన్నికల ప్రచారాన్ని ఊహించలేని పరిస్థితి నెలకొంది. దీనికి తగినట్లుగా టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మధ్యమాలతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది.
తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీల విమర్శలు, వ్యాఖ్యలపై వెంటనే స్పందించేలా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా సైట్లలో పోస్టులు పెట్టేలా వ్యవస్థను తీర్చిదిద్దారు. మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ప్రచార వ్యూహాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. టీఆర్‌ఎస్ సోషల్ మీడియా ప్రచారం కోసం 200 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ మంగళవారం హరితప్లాజా హోటల్‌లో ఈ బృందంతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో సోషల్ మీడియాలో అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలను ఆయన వివరించారు.
మేనిఫెస్టో నుంచి వ్యాఖ్యల వరకు..
వచ్చే ఎన్నికల పార్టీ మేనిఫెస్టో విడుదల కాగానే అందరికీ అది చేరేందుకు సోషల్ మీడియా సైట్లను చక్కగా వినియోగించుకోవాలని సోషల్ మీడియా బృందానికి కేటీఆర్ చెప్పారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, కవిత ప్రచార కార్యక్రమాలు, ప్రత్యర్థి పార్టీల విమర్శలపై చేసే వ్యాఖ్యలను సోషల్ మీడియా ద్వారా అందరికీ చేరవేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల్ని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని, దీనికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహం సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
ప్రతి కార్యకర్తకు చేరాలి
టీఆర్‌ఎస్‌కు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని కార్యకర్తకు చేరేలా చూడాలని సోషల్ మీడియా ప్రచార బృందాన్ని కేటీఆర్ ఆదేశించారు. అనంతరం కార్యకర్తలు వారి ప్రాంతాల్లోని ప్రజలకు పంపుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. టీఆర్‌ఎస్ సేకరించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో రెండున్నర కోట్ల సెల్‌ఫోన్‌లున్నాయి. వీరిలో స్మార్ట్‌ఫోన్‌లు వినియోగిస్తున్న వారే అధికం.
దాదాపు కోటి మంది ఏదో ఒక సోషల్ మీడియాతో అనుసంధానమై ఉన్నారని, వీరికి టీఆర్‌ఎస్ ప్రచార కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చేరవేయాలని సూచించారు. టీఆర్‌ఎస్ ముఖ్య నేతల ప్రచార కార్యక్రమాల ఆడియోలు, వీడియోలు అందరికీ చేరాలని ఆదేశించారు. తెలంగాణ ఉద్యమం, టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గణాంకాలతో తెలిపేలా సోషల్ మీడియాలో సమాచారం చేరవేయాలని కేటీఆర్ సూచించారు.