సాక్షి, హైదరాబాద్ : టీడీపే గెలుస్తుంటే సంబరాలు చేసుకోక సంతాప తీర్మానాలెందుకు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. గురువారం ట్విటర్ వేదికగా చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరగణంపై విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఉమ పిడకలు విసురుతున్నారు. కోడెలేమో జగన్ ఎప్పటికి సీఎం కాలేరని వృద్ధాప్యం వల్ల ఏదేదో మాట్లాడుతున్నారు. మీరే గెలుస్తుంటే సంబరాలు చేసుకోక సంతాప తీర్మానాలెందుకు చదువుతున్నారు. సొంత డబ్బా అలవాటే గదా. కొట్టుకోండి పోయేదేముంది.’అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
చంద్రబాబు ప్రసంగం విని జాతీయ పార్టీల అధ్యక్షులే కింద మీద పడి పిసుక్కుంటున్నారని, ఆయన ప్రసంగం విని ఎవరైనా ఓట్లేస్తారంటే నమ్మొచ్చా? అని ఎద్దేవా చేశారు. అది కూడా ఇంకో రాష్ట్రమైన కర్ణాటకలో వేదిక ఎక్కి ప్రసంగించాలని, ముందు మూడు నాలుగు వేల మంది గుంపుగా కనిపిస్తేనే మనవాడికి ఆ రాత్రి నిద్ర పడుతుందన్నారు. ఇంకా ఐదు వారాలు ఎలా గడవాలో ఏంటోనని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఆప్రమాణం గుర్తుందా?
రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని, చిత్తశుద్ధితో, నిష్పక్షపాతంగా ఉంటానని ఐపీఎస్ శిక్షణ సమయంలో చేసిన ప్రమాణం గుర్తుందా అని ఏబీ వెంకటేశ్వర్రావును ప్రశ్నించారు. ప్రజలు చెల్లించిన పన్నుల నుంచి జీతం తీసుకుంటూ చంద్రబాబుకు ఊడిగం చేశారని, ఇంటెలిజెన్స్ చీఫ్ గా మీరు ప్రజల కోసం చేసిన సేవ ఏమైనా ఉందా?..అని నిలదీశారు. ‘ఎన్నికలంటే ఏంటి? ఎవరో డబ్బు ఏర్పాటు చేస్తారు. ఇంకొకరు ఖర్చుచేసి గెలుస్తారు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు జరిగేది ఇలాగే గదా’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఎవరూ మర్చిపోలేదని, ఈ పెద్ద మనిషి ప్రజాస్వామ్యాన్ని ఈసీ పరిహాసం చేసిందని దేశమంతా తిరుగుతూ రంకెలు వేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment