
బీఎస్ ధనోవా
మద్యం తాగిన వారిని గుర్తించే బ్రీత్‌ఎన్‌లైజర్స్‌లా.. సరిగ్గా నిద్రపోని వారిని గుర్తించే వ్యవస్థను సిద్దం చేయాలని..
బెంగళూరు : సోషల్ మీడియాతో పైలెట్ల సామర్థ్యం దెబ్బతింటోందని భారత వాయుసేన(ఐఏఎఫ్) చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా సంచలన వ్యాఖ్యలు చేశారు. పైలెట్లు గంటలకొద్దీ సోషల్ మీడియాలో గడపడటంతో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎరోస్పేస్ మెడిసిన్ (ఐఏమ్) లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మద్యం తాగిన వారిని గుర్తించే బ్రీత్‌ఎన్‌లైజర్స్‌లా.. సరిగ్గా నిద్రపోని వారిని గుర్తించే వ్యవస్థను సిద్దం చేయాలన్నారు.
సోషల్ మీడియా పైలెట్ల నిద్రను మింగేస్తుందని, చాలా మంది పైలెట్లు సోషల్ మీడియాలో గడుపుతూ అర్దరాత్రి వరకు నిద్రపోకుండా ఉంటున్నారని తెలిపారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చాలా ఫ్లైట్స్ తెల్లవారుజామునే టెకాఫ్ చేయాల్సి ఉంటుందని, దీంతో పైలెట్లకు నిద్రసరిపోవడం లేదన్నారు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని ఐఏమ్ వైద్య నిపుణులను కోరారు. నిద్రలేమి సమస్యతోనే 2013లో ఓ ప్రమాదం చోటుచేసుకుందని గుర్తుచేశారు.