Sleep Deprivation
-
రెప్పవాలితే చాలు!
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు పై కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో అల్వాల్ వెంకటాపురానికి చెందిన నవ దంపతులు బాల కిరణ్, కావ్య సహా ఐదుగురు.. ఉత్తరాంధ్రలోని కాశీబుగ్గ వద్ద చైతన్యపురికి చెందిన వేదవతి, వెంకటయ్య..ఇలా ఎందరో డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ప్రాణాలు కోల్పోయారు. సుదీర్ఘ ప్రయాణం, తగినంత విశ్రాంతి లేకుండా వాహనాలు నడపడం వల్ల నిద్ర మత్తులోకి జారుకుంటున్న డ్రైవర్లు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఏటా లక్షలాది మంది డ్రైవర్లు, ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 40 శాతం నిద్రమత్తు వల్లే చోటు చేసుకుంటున్నాయని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా డ్రైవర్ల పని వేళలకు సంబంధించిన చట్టం అమలు కావడంతో పాటు సాంకేతికంగానూ అనేక మార్పులు వస్తేనే ఈ ప్రమాదాలకు ఫుల్స్టాప్ పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అలసటే ప్రధాన కారణం దేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారులు..అలాగే హైదరాబాద్‌లోని పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే, నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ వంటి కీలక రోడ్లపై ప్రయాణించే వాహనాల్లో అత్యధికం ట్రాన్స్పోర్ట్ కంపెనీలకు చెందినవే అయినప్పటికీ.. వ్యక్తిగత రవాణా వాహనాలు, ప్రైవేటు వాహనాలు సైతం పెద్ద సంఖ్యలోనే రాకపోకలు సాగిస్తుంటాయి. నిత్యం సుదూర ప్రాంతాల నుంచి గమ్య స్థానాలకు సరుకు రవాణా చేసే వాహనాల డ్రైవర్లకు అవసరమైన విశ్రాంతి ఉండదు. ఎన్ని ట్రిప్పులు ఎక్కువ వేయిస్తే అంత ఎక్కువ మొత్తం సంపాదించవచ్చనే ధోరణితో యాజమాన్యాలు పని చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు డ్రైవర్లపై ఒత్తిడి పెంచుతుంటాయి. రిలీవర్ రాకపోవడం, ఇతరత్రా కారణాలతో విశ్రాంతి ఇవ్వకుండా పని చేయిస్తుంటాయి. ఇక వివిధ పనులపై వ్యక్తిగత వాహనాల్లో వెళ్లే వారు సైతం వీలైనంత త్వరగా గమ్యస్థానానికి చేరుకోవాలనుకుంటారు. త్వరగా పని పూర్తి చేసుకుని ఇంటికి చేరుకోవాలనుకుంటారు. తగినంత విశ్రాంతి లేకుండా వేగంగా డ్రైవ్ చేస్తుంటారు. అలసటతో నిద్రమత్తుకు గురై వాహనంపై నియంత్రణ కోల్పోతారు. రోడ్డు పక్కనే ఉన్న చెట్టునో, నిలిపి ఉంచిన లారీ లాంటి ఏ భారీ వాహనాన్నో ఢీకొట్టేస్తారు. ఇలాంటి ఘటనల్లో ఏం జరిగిందో తెలుసుకునే లోపే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. రోడ్డు పక్కన ఆపినా.. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రయాణించే భారీ వాహనాల డ్రైవర్లలో కొందరు కాస్త అలసట తీర్చుకుందామనో, టీ తాగుదామనో రోడ్డు పక్కన వాహనాలు నిలిపి ఉంచడం ప్రమాదాలకు కారణమవుతోంది. డ్రైవర్లు తామ వాహనాలను పార్కింగ్ చేసుకుని సేద తీరేందుకు అవసరమైన స్థలాలు అన్నిచోట్లా అందుబాటులో ఉండట్లేదు. చాలావరకు దాబాలు, రెస్టారెంట్లు, పెట్రోల్ బంకుల వద్దే వీరు తమ వాహనాలను ఆపి ఉంచుతున్నా.. మరికొందరు వెంటనే వెళ్లిపోదామనో, ఇతరత్రా కారణాలతోనో రహదారికి పక్కగానే ఆపుతున్నారు. ఇది అనేక సందర్భాల్లో ఎదుటి వారికి, కొన్నిసార్లు వారికే ప్రమాదకరంగా మారుతోంది. ఈ వాహనాలు సరిగా కనబడక పోవడం, అలసట, నిద్రావస్థలో ఆదమరిచి ఉండటం లాంటి కారణాలతో వేగంగా వచ్చే వాహనాలు వీటిని ఢీ కొంటున్నాయి. బ్లాక్ స్పాట్స్ వద్ద నిలుపుతున్న సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారులపై తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాలను పోలీసులు గుర్తిస్తుంటారు. వీటినే సాంకేతిక పరిభాషలో బ్లాక్‌స్పాట్స్ అంటారు. ఇలాంటి బ్లాక్‌స్పాట్స్ హైవేలపై ఎక్కువగా ఉంటున్నాయి. ఎంవీ యాక్ట్ ఏం చెబుతోందంటే... ప్రతి రవాణా వాహనంలో డ్రైవర్‌తో పాటు ఖచ్చితంగా కో–డ్రైవర్ ఉండాలని మోటారు వాహనాల చట్టం స్పష్టం చేస్తోంది. డ్రైవర్లు రోజుకు కేవలం పది గంటల (విశ్రాంతితో కలిపి) చొప్పున వారానికి 48 గంటలు మాత్రమే పని చేయాలి. డ్రైవర్ విధులు నిర్వర్తించే ఎనిమిది గంటల కాలంలో ఖచ్చితంగా రెండు గంటల విశ్రాంతి ఉండాలి. తన వాహనం ద్వారా ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఆ సమాచారాన్ని పోలీసులకు తెలిపి తీరాలి. రహదారుల పక్కన నిర్దేశిత ప్రాంతాల్లో మినహా ఎక్కడా వాహనాలను పార్క్ చేయకూడదు. ఈ నిబంధనలు కేవలం రవాణా వాహనాలకే కాదు.. వ్యక్తిగత వాహనాల డ్రైవర్లకూ వర్తిస్తాయి. అయితే ఇవి ఎక్కడా అమలుకాని కారణంగానే హైవేలు, ఇతర మార్గాలపై ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయని నిపుణులు అంటున్నారు. ప్రమాదాల నివారణకు పరిశోధనలు ఏటా లక్షల మందిని మింగుతున్న కారు ప్రమాదాల నివారణకు ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ సంస్థలు దశాబ్దాలుగా ముమ్మర పరిశోధనలు చేస్తున్నాయి. వీటి ఫలితంగానే 1948లో రోడ్ గ్రిప్, ఆ తర్వాత రేడియల్ గ్రిప్ టైర్లు అందుబాటులోకి వచ్చాయి. 1958లో ఓల్వో కంపెనీ సీటుబెల్ట్‌ను కనుగొంది. తర్వాత ఎయిర్ బ్యాగులూ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రధానంగా మూడు అంశాలపై ఆటోమొబైల్ కంపెనీల పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి కూడా సాకారమైతే కారు ప్రమాదాలకు దాదాపు ఫుల్స్టాప్ పెట్టొచ్చని మోటారు వాహన రంగ నిపుణులు చెప్తున్నారు. ఆటో బ్రేకింగ్ ముందున్న వాహనాలు/వస్తువులు కారుకు సమీపంలోకి రాగానే కారులో ఉండే సెన్సర్లు పని చేస్తాయి. బ్రేకులు వాటంతట అవే పడేలా చేస్తాయి. ఈ టెక్నాల జీ ప్రస్తుతం స్వీడన్లో ప్రయోగాల దశలో ఉంది. ఇంటెలిజెంట్ విండ్ స్క్రీన్ డ్రైవర్ కారు నడిపేప్పుడు అతడు నిద్రలో జోగకుండా, అతని దృష్టి మళ్లకుండా ఇది ఉపకరిస్తుంది. డ్రైవర్ సరిగా చూస్తున్నాడా? ఎటు చూస్తున్నాడనే దాన్ని గమనిస్తూ అప్రమత్తం చేస్తుంది. రోడ్ల అంచులు, వాహనం స్థితి తదితరాలను సూచిస్తుంది. క్రాష్ టెస్ట్ డమ్మీ కారు నడిపే వ్యక్తి పర్సనాలిటీ ఆధారంగా ఎక్కడ ఢీ కొంటే ఏ అవయవాలు దెబ్బతింటాయి అనేది నిర్థారిస్తుంది. ఇప్పటికే 100కు పైగా నమూనాలు రూపొందించిన ఈ టెక్నాలజీతో వ్యక్తికి తగ్గట్టుగా భద్రతా ప్రమాణాలను కారులో ఏర్పాటు చేసేందుకు వీలుగా పరిశోధనలు సాగుతున్నాయి. మానవ తప్పిదాలను నివారించాలి వాహనం ఎంతటి భద్రతా ప్రమాణాలతో కూడినదైనా, ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా.. అతి ఎక్కువగా ప్రమాదాలకు కారణమయ్యే మానవ తప్పిదాలను నివారించకపోతే ఫలితం ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సరిగా రాకపోయినా వాహనం నడపడం, హైవే డ్రైవింగ్‌పై అవగాహన లేకపోవడం, మితిమీరిన వేగం, వాహనాన్ని అదుపు చేయలేక పోవడం, మద్యం తాగి వాహనాలు నడపడం, సీట్‌బెల్ట్ ధరించడంలో నిర్లక్ష్యం వహించడం లాంటివి నివారిస్తేనే ఏ టెక్నాలజీతోనైనా పూర్తి ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. -
కంటి నిండా నిద్ర కరువు
సాక్షి, అమరావతి: మారిన జీవన విధానాలు, చుట్టుముడుతున్న ఆర్థిక, కుటుంబ సమస్యల నడుమ మధ్య వయస్కులు, వృద్ధుల్లో కంటి నిండా నిద్ర కరవు అవుతోంది. ముఖ్యంగా మధ్య వయసు్కలు పగలంతా కష్టం చేసి రాత్రి అయ్యాక కంటి నిండా నిద్రపోవడం ఒక కలగా మారుతోంది. ఏజ్‌వెల్ ఫౌండేషన్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 40 నుంచి 64 ఏళ్లు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇలా రెండు వర్గాలుగా మే నెలలో దేశవ్యాప్తంగా 5 వేల మంది నుంచి ఫౌండేషన్ వివరాలు సేకరించింది. వీరిలో 40 నుంచి 64 ఏళ్ల వారు 2245 (పురుషులు 1102, మహిళలు 143)మంది, 65 ఏళ్లు పైబడిన వారు 2,755 (పురుషులు 1,336, మహిళలు 1,419) మంది ఉన్నారు. ఆరు గంటలు కూడా నిద్రపోలేకున్నాం 70 శాతం మంది రోజులో కనీసం ఆరు గంటలు కూడా కంటి నిండా నిద్ర పోలేకపోతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 24 శాతం మంది మాత్రం 7 నుంచి 8 గంటలు, 6 శాతం మంది 8 గంటలకు పైగా నిద్రపోతున్నట్టు తెలిపారు. మధ్య వయసు్కల్లో 60 శాతం ఆరు గంటలలోపు, 31 శాతం 7 నుంచి 8 గంటలు, 9 శాతం మంది 8 గంటలకుపైగా నిద్రపోతున్నామన్నారు. అదే వృద్ధుల్లో 78 శాతం మంది ఆరు గంటల్లోపు, 19 శాతం మంది 7 నుంచి 8 గంటలు, 3 శాతం మంది 8 గంటలకుపైగా నిద్ర పోతున్నట్టు వెల్లడైంది. ఆర్థిక ఇబ్బందులు ప్రధాన కారణం నిద్ర లేమికి ప్రధాన కారణం ఆర్థిక పరమైన అంశాలేనని సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య లేకపోవడం, ఇతర కలహాలు కారణమని పేర్కొంది. యాంత్రిక జీవనం, మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు, మద్యం సేవించడం, ఇతర సమస్యలతో సరైన నిద్ర ఉండటంలేదని కూడా ఫౌండేషన్ తెలిపింది. వయోభారం రీత్యా చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలు, ఒంటరి జీవనం నిద్రలేమికి కారణంగా వృద్ధులు పేర్కొన్నారు. పురుషులే అధికం నిద్రలేమితో సతమతం అవుతున్న వారిలో పురుషులే అధికం. పురుషుల్లో 81 శాతం మంది కనీసం ఆరు గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని వెల్లడించారు. అదే మహిళల విషయానికి వస్తే 60 శాతం మంది ఆరు గంటలలోపు నిద్రపోతున్నామని చెప్పారు. మరో 15 శాతం మంది పురుషులు, 32 శాతం మంది మహిళలు 7 నుంచి 8 గంటలు, 4 శాతం పురుషులు, 8 శాతం మహిళలు 8 గంటలకు పైగా నిద్రపోతున్నట్టు తెలిపారు. సర్వేలో పాల్గొన్న మొత్తం వ్యక్తుల్లో 55.08 శాతం మంది ప్రస్తుతం నిద్ర విధానంతో అసంతృప్తిగా ఉన్నామని తెలిపారు. ఇలా చేయండి.. నిద్ర పడుతుంది సర్వేలో భాగంగా నిద్ర లేమి సమస్య నివారణకు పలు సలహాలు, సూచనలు కూడా ఫౌండేషన్ తెలియజేసింది. అవి.. ♦ నిద్రకు ఉపక్రమించే 4 గంటల ముందు నుంచి కాఫీ, టీలు తాగకూడదు. ధూమపానం, మద్యపానం చేయకూడదు. వేడి పాలను తాగాలి ♦ ఆందోళన, ఒత్తిడి, నిరాశ నిద్రకు పెద్ద అవరోధం. వాటిని అధిగమించడానికి చర్యలు తీసుకోవాలి ♦ పగటిపూట నిద్ర మానుకోవాలి ♦టీవీ, సెల్‌ఫోన్ చూడకూడదు ♦ పడక గదిలో స్లీప్ ఫ్రెండ్లీ వాతావరణం ఉండేలా చూసుకోవాలి -
ఒక్కరోజు నిద్రలేకపోతే ఇంత జరుగుతుందా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!
ఒత్తిడి, మానసిక సమస్యలు, ఎక్కువగా ఆలోచించడం వంటి ఇతరత్రా కారణాల వల్ల కొంతమందికి రాత్రివేళ త్వరగా నిద్రపట్టదు. ఒక్కోసారి తీరకలేక రోజంతా మెళకువతో ఉండి నిద్రకు దూరమవుతారు. ఇలా ఒక్క రోజు నిద్రలేకపోతే ఏమవుతుందనే విషయంపై శాస్త్రవేత్తలు చేసిన పరోశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. మనిషి ఒక్కరోజు నిద్రకు దూరమైతే మెదడు నిర్మాణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఓ పరిశోధన వెల్లడించింది. మన వయసు 1-2 ఏళ్లు పెరిగనట్లుగా మెదడు వ్యవహరిస్తుందని ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించింది. ఈ పరిశోధనలో తేలిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. నిద్ర లేనప్పుడు మెదడులో వచ్చిన మార్పులు, మళ్లీ గాఢంగా నిద్రపోతే యథావిధిగా మారుతాయని వెల్లడైంది. అంటే మనం ఒక రోజు నిద్రపోకపోతే వచ్చిన మార్పులు.. ఆ తర్వాత రోజు బాగా నిద్రపోతే తొలగిపోతాయి. మెదడు తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. ఈ పరిశోధనను 'జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్' ఇటీవలే ప్రచురించింది. అయితే రోజుకు కనీసం మూడు, ఐదు, 8 గంటలు నిద్రపోతే మెదడులో ఎలాంటి మార్పులు కన్పించలేదని ఈ పరిశోధన స్పష్టం చేసింది. కానీ తక్కువ నిద్రవల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయనే విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. ఈ పరిశోధనలో మొత్తం 134 మంది ఆరోగ్యవంతమైన వలంటీర్లు పాల్గొన్నారు. వీరిలో 42 మంది మహిళలు కాగా.. 92 మంది పురుషులు. వయసు 19-39 ఏళ్ల మధ్య ఉంటుంది. వీరందరినీ ఐదు బ్యాచ్‌లుగా చేసి ఒకరోజు మొత్తం నిద్రలేకపోతే ఎలా ఉంటుంది? రోజులో మూడు గంటలు, ఐదు గంటలు, 8 గంటలు మాత్రమే పడుకున్నప్పుడు ఎలా ఉంటుందని పరిశోధన జరిపారు. దీనికోసం మెషీన్ లెర్నింగ్ అల్గారిథం ఉపయోగించారు. చదవండి: వారానికి 4 రోజులు.. పని విధానంలో ఇదో కొత్త ట్రెండ్ -
దాని వల్లే పైలెట్ల సామర్థ్యం దెబ్బతింటోంది..
బెంగళూరు : సోషల్ మీడియాతో పైలెట్ల సామర్థ్యం దెబ్బతింటోందని భారత వాయుసేన(ఐఏఎఫ్) చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా సంచలన వ్యాఖ్యలు చేశారు. పైలెట్లు గంటలకొద్దీ సోషల్ మీడియాలో గడపడటంతో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎరోస్పేస్ మెడిసిన్ (ఐఏమ్) లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మద్యం తాగిన వారిని గుర్తించే బ్రీత్‌ఎన్‌లైజర్స్‌లా.. సరిగ్గా నిద్రపోని వారిని గుర్తించే వ్యవస్థను సిద్దం చేయాలన్నారు. సోషల్ మీడియా పైలెట్ల నిద్రను మింగేస్తుందని, చాలా మంది పైలెట్లు సోషల్ మీడియాలో గడుపుతూ అర్దరాత్రి వరకు నిద్రపోకుండా ఉంటున్నారని తెలిపారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చాలా ఫ్లైట్స్ తెల్లవారుజామునే టెకాఫ్ చేయాల్సి ఉంటుందని, దీంతో పైలెట్లకు నిద్రసరిపోవడం లేదన్నారు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని ఐఏమ్ వైద్య నిపుణులను కోరారు. నిద్రలేమి సమస్యతోనే 2013లో ఓ ప్రమాదం చోటుచేసుకుందని గుర్తుచేశారు. -
నిద్రలేమితో గుండెకు ముప్పు
న్యూయార్క్: విపరీతమైన పని ఒత్తిడివల్ల నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారికి గుండె సంబంధిత సమస్యలు వస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. పని ఒత్తిడి ఎక్కువగా ఉండే ఎమర్జెన్సీ, మెడికల్ సర్వీసెస్ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవారు నిద్రకు దూరమవుతుంటారు. ఇలాంటి వారిలో గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నమైనట్టు గుర్తించామని జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బోన్ కి చెందిన డానియెల్ కేటింగ్ అన్నారు. పని ఒత్తిడి వల్ల కేవలం మూడు గంటలే నిద్రపోతున్న 20 మందిపై పరిశోధన చేసి ఈ విషయం గుర్తించారు. కొందరికి రక్తపోటు పెరిగి నట్టు గుర్తించామని కేటింగ్ చెప్పారు. -
మంచి నిద్ర కోసం...
స్లీప్ హైజీన్ నిద్రలేమితో బాధపడుతున్నవాళ్లు ఈ కింది జాగ్రత్తలు తీసుకుంటే మంచి నిద్రపట్టేందుకు అవకాశాలెక్కువ.ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను పెంపొందించుకోవాలి. అంటే... క్రమబద్ధంగా ఒకే వేళకు నిద్రపోవడం, ఉదయం మళ్లీ వేళకు నిద్రలేవడం వంటివి.బెడ్రూమ్ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. వురీ చల్లగానూ, వురీ వేడిగా కాకుండా ఉండాలి. నిద్రపోతున్న సమయంలో ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి. ఈ మసక చీకట్లోనే నిద్ర వచ్చేందుకు తోడ్పడే మెలటోనిన్ రసాయనం విడుదల అవుతుంది. వెలుతురు ఎక్కువగా ఉంటే ఇది వెలువడదు. అందుకే నిద్రపోవడాలనుకున్నవారు కళ్లపై ఏదైనా కప్పుకుంటారు. పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయూలి. రాత్రి భోజనం త్వరగా పూర్తి చేయండి. కడుపు నిండుగా తినకండి.నిద్రకు వుుందు టీవీలో ఉద్విగ్నత, ఉద్వేగం కలిగించే దృశ్యాలున్న సినివూలూ, సీరియుళ్లు చూడొద్దు. వీలైతే బెడ్రూమ్లో టీవీ లేకుండా చూసుకోండి. బెడ్రూమ్ను కేవలం నిద్ర కోసం మాత్రమే ఉపయోగించండి. దాన్ని వర్క్‌ప్లేస్‌గా మార్చవద్దు.రాత్రి వేళ వుంచి నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపరుునా పూర్తిస్థారుు పగటి వెలుగులో (డే లైట్) గడపాలి. వుసక వెలుగున్న రూమ్‌లలో గడపడం తగదు.నిద్రకు వుుందు ఆహ్లాదకరమైన వుూ్యజిక్ను వినండి. రణగొణధ్వని ల్లాంటి వుూ్యజిక్ వద్దు. నిద్రకు వుుందు కొన్ని రకాల పుస్తకాలు చదివితే నిద్ర వస్తుంది కానీ... అందులో ఉత్కంఠకు గురిచేసే ఆసక్తికరమైన విషయాలున్న పుస్తకాలు చదవద్దు. కేవలం నిద్రపట్టడానికి ఉపకరించేలా మాత్రమే మీ పుస్తకపఠనం ఉండాలి.బెడ్రూమ్లో ఆహ్లాదకరమైన లైట్ మ్యూజిక్ వినడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఊపిరితిత్తులు, కిడ్నీల జబ్బులు ఉండి, వాటికోసం మందులు ఉపయోగించేవాళ్లు డాక్టర్ సలహా మేరకు వాటిని పగటి పూట వాడేలాగా మార్పు చేసుకోవచ్చు. ఇక నొప్పుల సమస్యలు (పెయిన్ డిజార్డర్స్) ఉన్నవాళ్లు డాక్టర్‌ను సంప్రతించి వాటికి సంబంధించిన మందులు వాడాలి. వాకింగ్ వంటి వ్యాయమాలు చేయాలి. అయితే వాటిని ఉదయం వేళ చేయడం మంచిది. ఒకవేళ ఉదయం వీలు కాకపోతే రాత్రి మాత్రం నిద్రపోయే ముందు తీవ్రమైన వ్యాయామాలు చేయవద్దు. నిద్రకు ముందు చేసే తీవ్రమైన వ్యాయామాలు ఒక్కోసారి నిద్రపట్టకుండా చేయవచ్చు.మంచి నిద్ర పట్టడానికి చేసే పైన పేర్కొన్న మంచి అలవాట్లను ‘స్లీప్ హైజీన్’ నిర్వహణగా పేర్కొంటారు. ఈ ‘స్లీప్ హైజీన్’ను నిత్యం ఆచరించడం వల్ల మంచి నిద్ర పడుతుంది. డా. బి. చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరాలజిస్ట్ సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం.12, బంజారాహిల్స్ హైదరాబాద్ -
నిద్రలేమితో జ్ఞాపకశక్తి లోపం
వాషింగ్టన్: నిద్రలేమి కారణంగా మన జ్ఞాపకశక్తిపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనంలో తేలింది. సరిపడా నిద్రలేకపోతే మెదడుకు సంబంధించిన నాడీ వ్యవస ్థ సక్రమంగా పనిచేయదని, అందువల్ల జ్ఞాపకశక్తి తగ్గే అవకాశాలుంటాయని నెదర్లాండ్‌లోని గ్రానింగన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త రాబర్ట్ హావెక్స్ తెలిపారు. నిద్రలేమి మెదడులోని నాడీ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు ఎలుకలపై శాస్త్రవేత్తలు ఈ మేరకు పరిశోధన నిర్వహించారు. పరిశోధనలో భాగంగా రోజులో కనీసం ఐదు గంటల నిద్రలేకపోవడం ద్వారా మెదడులోని నాడీవ్యవస్థపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో గుర్తించారు. నిద్రలేమితో మెదడులోని నాడీవ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుందని దీని ఆధారంగా కనుగొన్నారు. నిద్రలేమి కారణంగా ఎలుక మెదడులోని అణువులు సక్రమంగా పనిచేయకపోవడంతో అది నాడీవ్యవస్థపై ప్రభావం చూపిందని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ఆధునిక సమాజంలో నిద్రలేమి ఓ సాధారణ సమస్యగా మారిందని దాని ద్వారా ఆరోగ్య సంబంధమైన సమస్యలతోపాటు మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపుతోందని అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త టెడ్ అబెల్ తెలిపారు. కాగా, ఈ పరిశోధన కు సంబంధించిన ఫలితాలు ఈలైఫ్ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి.