నిద్రలేమితో జ్ఞాపకశక్తి లోపం
వాషింగ్టన్: నిద్రలేమి కారణంగా మన జ్ఞాపకశక్తిపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనంలో తేలింది. సరిపడా నిద్రలేకపోతే మెదడుకు సంబంధించిన నాడీ వ్యవస ్థ సక్రమంగా పనిచేయదని, అందువల్ల జ్ఞాపకశక్తి తగ్గే అవకాశాలుంటాయని నెదర్లాండ్‌లోని గ్రానింగన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త రాబర్ట్ హావెక్స్ తెలిపారు. నిద్రలేమి మెదడులోని నాడీ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు ఎలుకలపై శాస్త్రవేత్తలు ఈ మేరకు పరిశోధన నిర్వహించారు. పరిశోధనలో భాగంగా రోజులో కనీసం ఐదు గంటల నిద్రలేకపోవడం ద్వారా మెదడులోని నాడీవ్యవస్థపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో గుర్తించారు.
నిద్రలేమితో మెదడులోని నాడీవ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుందని దీని ఆధారంగా కనుగొన్నారు. నిద్రలేమి కారణంగా ఎలుక మెదడులోని అణువులు సక్రమంగా పనిచేయకపోవడంతో అది నాడీవ్యవస్థపై ప్రభావం చూపిందని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ఆధునిక సమాజంలో నిద్రలేమి ఓ సాధారణ సమస్యగా మారిందని దాని ద్వారా ఆరోగ్య సంబంధమైన సమస్యలతోపాటు మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపుతోందని అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త టెడ్ అబెల్ తెలిపారు. కాగా, ఈ పరిశోధన కు సంబంధించిన ఫలితాలు ఈలైఫ్ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి.