సోషల్‌ వార్‌ | Political Parties War On Social Media | Sakshi
Sakshi News home page

సోషల్‌ వార్‌

Published Fri, Oct 12 2018 4:38 PM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

Political Parties War On Social Media - Sakshi

ఆనందాన్ని పంచడానికి, స్నేహితులను కలపడానికి, భావాలను వ్యక్తీకరించే సాధనంగా మొదలైన సోషల్‌ మీడియా ఇప్పుడు రాజకీయ ప్రచారానికి అస్త్రంగా మారుతోంది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికార పీఠాన్ని అందుకోవడానికి నిచ్చెన మెట్లుగా రాజకీయ నాయకులు భావిస్తున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, స్నాప్‌చాట్, యూట్యూట్, ఇన్‌స్ట్రాగామ్‌ల ద్వారా యువతకు చేరువయ్యేందుకు ఆయా రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు నానా అవస్థలు పడుతున్నారు. చేతిలో స్మార్ట్‌ఫోన్‌ లేని యువత లేదంటే అతిశయోక్తి కాదు. ఇంటర్నెట్‌ ఛార్జీలు, ఫోన్‌ ధరలు కూడా అందుబాటులో ఉండటంతో.. వాట్సాప్, ఫేస్‌బుక్‌ ఖాతాలు చాలా సర్వసాధారణమై పోయాయి.  
– సాక్షి, సిద్దిపేట 

ఎన్నికల్లో అన్ని పార్టీలకు ప్రధాన ప్రచార అస్త్రంగా ఇప్పుడు సోషల్‌ మీడియానే ఉపయోగిస్తున్నారు. పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్న యూట్యూబ్‌ ఛానల్స్‌లో రకరకాల కామెంట్లు, వీడియో క్లిప్పింగ్స్, లఘు చిత్రాలు, సన్నివేశాల రూపంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. రోజుకో విశ్లేషణ, సర్వేల పేరుతో అభ్యర్థుల భవితవ్యాలను సోషల్‌ మీడియాలోనే నిర్ణయిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల ఫొటోలతో ఆన్‌లైన్‌లో ఓటింగ్‌ నిర్వహిస్తూ బలాబలాలను లెక్కగడుతున్నారు. తమ అభిమాన నాయకుడిని ప్రమోట్‌ చేసేందుకు అభిమానులు ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో గ్రూప్‌లు క్రియేట్‌ చేస్తున్నాయిరు. తమ నాయకుడి ప్రతి కదలిక, చేసే పని, మాట్లాడే విషయాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరువ చేసేందుకు వీలుగా ఫేస్‌బుక్‌లో ప్రత్యేక పేజీలను క్రియేట్‌ చేసి అభిమానులను సాధించి పెడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ప్రత్యర్థి పార్టీల నాయకులను విమర్శించేందుకు కూడా ట్రాల్‌ పేజీలు పుట్టుకొస్తున్నాయి. ప్రత్యర్థిని విమర్శించడమే ధ్యేయంగా ఈ ట్రాల్‌ పేజీలు నడుపుతున్నారు.  

సామాన్యులు బలి 
చాలా మంది సరదా కోసమో, కాలక్షేపం కోసమో సోషల్‌ మీడియాను వాడుతుంటే ఈ రాజకీయ నాయకులు వారినీ వదలడం లేదు. న్యూట్రల్‌గా ఉండే వారిని ఆకర్షించడమే లక్ష్యంగా వారి అనుమతి లేకుండా గ్రూపుల్లో యాడ్‌ చేయడం, ఫేస్‌బుక్‌లో పెట్టే ప్రతి పోస్టుకీ ట్యాగ్‌ చేయడం చేస్తున్నారు. దీంతో రోజూ వందల సంఖ్యలో వచ్చి పడే మెసేజ్‌లు, ఫొటోలతో వారు బేజారెత్తిపోతున్నారు. ఫేస్‌బుక్‌లో ట్యాగ్‌ చేస్తున్న కారణంగా ఏ ఒక్కరు కామెంట్, లైక్‌లు పెట్టినా తమకు నోటిఫికేషన్‌ వస్తోందంటూ గగ్గోలు పెడుతున్నారు. కొందరు మొహమాటానికి సహిస్తుంటే.. ఇష్టం లేనివారు మాత్రం నిస్సంకోచంగా గ్రూపుల నుంచి బయటకొస్తున్నారు. ఫేస్‌బుక్‌లో వచ్చే కామెంట్లు, లైక్‌ల ఆధారంగా నాయకులు వారి యాక్టివిటీస్‌ని మార్చుకుంటున్నారు. కొందరైతే వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్లు తమ అభిమానులకే పరిమితం అవుతున్నాయని గ్రహించి.. న్యూట్రల్‌ వ్యక్తులను ఆకర్షించడమే లక్ష్యంగా ట్విట్టర్‌ ఖాతాలు తెరిచి ప్రయోగాలు చేస్తున్నారు.   

అభివృద్ధే ప్రధాన ఆయుధంగా టీఆర్‌ఎస్‌ 
తెలంగాణ రాష్ట్ర సమితి గత నాలుగు సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కన్నులకు కట్టినట్లుగా సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తుంది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న నాలుగు నియోజకవర్గాల్లోని గ్రామాలు, మండలాలు, నియోజకవర్గం స్థాయిల్లో వాట్సాప్‌ గ్రూపులు క్రియేట్‌ చేశారు. అదే విధంగా ప్రతి నియోజకవర్గంలో బూత్‌ కమిటీకి ఒక సోషల్‌ మీడియా ఇన్‌చార్జిని  నియమించారు. ఆయా గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల్లో ప్రచారం క్షణాల్లో  వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో పెడుతున్నారు. అదేవిధంగా పార్టీజిల్లా, రాష్ట్ర కార్యాలయాల్లో ప్రత్యేకంగా నియమించిన సోషల్‌ మీడియా టీమ్‌ల ద్వారా సంక్షేమ పథకాల అమలు, ప్రజలతో ముఖాముఖి, లఘు చిత్రాలు, ప్రయోజనం పొందిన వారి మనస్సులో మాటలు చెప్పించి వాటిని సోషల్‌ మీడియాలో పెట్టి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఖరారు కావడంతో ఆ నాయకుడి గొప్పతనం వివరించడం, నియోజకవర్గంలో చేసిన పనిని, చేపట్టిన అభివృద్ధిని చెప్పేవిధంగా పేరుగాంచిన కవులు, గాయకులు, సంగీత దర్శకులతో ప్రత్యేక పాటల ఆల్బం చేయించి వాటిని ప్రచార కార్యక్రమాలతోపాటు, సోషల్‌ మీడియాలో కూడా పెట్టి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.  

విపక్ష పార్టీల ఎదురు దాడి..  
టీఆర్‌ఎస్‌ పార్టీకి ధీటుగా విపక్ష పార్టీలు కూడా సోషల్‌ దాడికి దిగారు. అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో టీఆర్‌ఎస్‌ పార్టీని, నియోకవర్గాల్లో పనితీరును ఆధారంగా చేసుకొని సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నారు. ప్రధానంగా గత ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, ఇతర నాయకులు చేసిన వాగ్ధానాలు, వాటిని విస్మరించిన తీరును వీడియో క్లిప్పింగ్‌లు సేకరించి ఒకదానితో ఒకటి జోడించి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పీసీసీసీ కార్యాలయం నుండి ప్రత్యేకంగా సోషల్‌ మీడియా టీమ్‌లను వేసి ప్రచారం చేస్తుంది. అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా సోషల్‌ ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి మోడీ ప్రసంగాలు, ప్రవేశపెట్టిన పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలతో రాష్ట్రానికి చేకూరుతున్న లబ్ధి, రాష్ట్రాభివృద్ధిలో కేంద్రం వాటా, నిధుల పంపిణీ వంటి విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.  

ఏం జరుగుతుందో తెలుస్తుంది 
కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): ఈరోజుల్లో సోషల్‌ మీడియా అనేది ఎంతో కీలకంగా ఉంది. ఎన్నికల సమయంలో సోషల్‌ మీడియా ద్వారా అనేక విషయాలను ప్రజలు తెలుసుకుటుంన్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో వచ్చే పోస్టులపై అవగాహన కలుగుతోంది. ఏదేమైనా ఎన్నికల ప్రచారం సోషల్‌ మీడియాల్లో జోరుగా సాగుతుంది. దీంతో ఓటర్లు ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలో వద్దో నిర్ణయాలు తీసుకుంటున్నారు. 
– కొమిరె అనిల్, బీటెక్‌ విద్యార్థి, కోహెడ   

హద్దులు మీరితే ఎవరినైనా శిక్షిస్తాం 
సాంకేతిక రంగంలో వచ్చిన మార్పుల ఫలితమే సోషల్‌ మీడియా. ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు సోషల్‌ మీడియాను విరివిరిగా వాడుకుంటున్నాయి. సాధారణ ఎన్నికల ప్రచారంలో మాదిరిగానే సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవచ్చు. ఓట్లు అడగవచ్చు, అభివృద్ధి చెప్పుకోవచ్చు, ఎదుటి పార్టీకి ఎందుకు ఓటు వెయ్యకూడదో అభిప్రాయం పంచుకోవచ్చు. కానీ వ్యక్తిగత దూషణలకు పోవడం, రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం నేరం. హద్దులు మీరి ఎవరు ప్రవర్తించినా శిక్ష తప్పదు.  
– జోయల్‌ డేవిస్, పోలీస్‌ కమిషనర్, సిద్దిపేట 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement