డిజిటల్ మీడియాలో వచ్చే ప్రభుత్వ వార్తల్లోని సత్యాసత్యాలను ఒక ప్రత్యేక ‘ఫ్యాక్ట్ చెక్’ విభాగం ద్వారా తనిఖీ చేయించేందుకు వీలుగా ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ... ఐటీ ‘నియమావళి – 2023’ని సవరించడంపై పలు అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిన విస్తృత సంప్రదింపులు లేకుండానే నిబంధనలు రూపొందించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1)(ఎ) పౌరులకు ప్రసాదిస్తున్న భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందని సోషల్ మీడియా వెబ్‌సైట్‌లు, డిజిటల్ మాధ్యమాలు కలవరం చెందుతున్నాయి. సమాచారాన్ని తొలగించమని ఆదేశించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి దఖలు పడుతున్నందునే తాజా ‘ఐటీ నియమావళి, 2023’ వివాదాస్పదం అయింది.
ఏప్రిల్ 6న కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫి కేషన్‌తో ఒక కొత్త సమాచార నియంత్రణ శక్తి ఊపిరి పోసుకుంది! ప్రాథమిక ‘ఐటీ నియమావళి, 2023’కి జోడింపుగా ‘మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నీతి నియమాలు’ (ఇంటర్మీడియేటరీ గైడ్‌లైన్స్ అండ్ మీడియా ఎథిక్స్ కోడ్)ని చేర్చడం ద్వారా ‘ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ’ అలాంటి నియంత్రణ శక్తి ఆవిర్భావానికి తావు కల్పించింది.ఈ కొత్త నియమావళి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి డిజిటల్ మీడియాలో వచ్చే నకిలీ, తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని గుర్తించి, వాటిని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఒక ‘వాస్తవాల తనిఖీ’ (ఫ్యాక్ట్ చెక్) విభాగం ఏర్పాటుకు అధికారాన్ని ఇస్తోంది!
సమాజ సంక్షేమాన్ని విస్మరించి, స్వేచ్ఛను హరించేందుకు (ఆర్వేలియన్) అవకాశం ఉన్న ఆ ఫ్యాక్ట్ చెక్ విభాగం... ప్రభుత్వ శాఖలు, మంత్రుల గురించి డిజిటల్ మీడియాలో వచ్చే వార్తలు, వ్యాఖ్యలు, నివేదికలు, అభిప్రాయాలను వాస్తవాల తనిఖీ పేరిట పరి శీలించి వాటిని తొలగించడం కోసం ఆన్‌లైన్ మధ్యవర్తులకు ఆదేశాలు జారీ చేస్తుంది.
ఆ మధ్యవర్తులు ఆన్‌లైన్ సోషల్ మీడియా కంపెనీలు కావచ్చు. ఐ.ఎస్.పి. (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్)లు, యాప్‌ల రూప కల్పనకు అవసరమై సాంకేతికతల్ని హోస్ట్ చేసే సంస్థలూ కావచ్చు. వాస్తవాల తనిఖీ వల్ల కచ్చితత్వ నిర్ధారణ జరుగుతుందనీ, వాస్తవా లకు మాత్రమే విస్తృతి లభించి, పాఠక పౌరులకు ఏది చేరాలో అదే చేరుతుందనీ ‘ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ’ ఉద్దేశం.
ఐటీ యాక్ట్, 2000లోని సెక్షన్ 79 కల్పిస్తున్న ‘నియమాల రూప కల్పన అధికారాన్ని’ ఉపయోగించుకుని ఈ తాజా ఐటీ నియమావళి, 2023 ఏర్పడింది. శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం... సెక్షన్ 79, ఐ.టి. నియమావళిని అనుసరించి చట్ట విరుద్ధ చర్యలకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని కోర్టు ఉత్తర్వు ద్వారా లేదా ప్రభుత్వ విభాగం ఆదేశాల మేరకు ప్రభుత్వం పొందడానికి మధ్యవర్తులను ఏర్పరచుకోవచ్చు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2)లో ‘నకిలీ’, ‘తప్పుడు’, ‘తప్పుదారి పట్టించే’ అనే పదాలు ప్రత్యేకించి లేవు.
శాంతి భద్రతలు, దేశ సమగ్రత, నైతికత వంటి విస్తృత వర్గీకరణల కింద మాత్రమే ఐటీ నియమావళి అన్వయం అవుతుంది. అంతమాత్రాన, సరిగా లేని ఏదైనా సమాచారం లేదా ప్రకటన... నకిలీ, తప్పుడు, లేదా తప్పుదారి పట్టించేది అయిపోదు. అయితే నకిలీ, తప్పుడు, తప్పుదారి పట్టించే వర్గీకరణల కిందికి వచ్చే ప్రతి సమాచారం కూడా ఈ ‘వాస్తవాల తనిఖీ’ పరిధిలోకి రాకపోయి నప్పటికీ రాజ్యాంగ విరుద్ధమైన నిషేధ అధికారంతో ప్రభుత్వం చర్య తీసుకునే ప్రమాదం ఉంది.
ఇక ఐటీ నియమావళి, 2023 ‘నకిలీ, తప్పుడు, తప్పుదారి పట్టించే’ సమాచారం ఎలాంటిదన్నది నిర్వచించలేదు. ‘వాస్తవాల తనిఖీ విభాగం’ అర్హతల్ని, విచారణ పరిధుల్ని, విధానాలను పేర్కొన లేదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పి.ఐ.బి.) లో ఇప్పటికే ఉన్న తనిఖీ విభాగం గతంలో పొరబడిన సందర్భాలు కూడా ఉన్నాయి! 2020 డిసెంబర్ 16 పీఐబీ ఒక ఇంటెలిజెంట్ బ్యూరో నియామక సమా చారానికి బూటకంగా ముద్రవేసింది. అయితే ఆ మర్నాడే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ... పీఐబీ బూటకం అని భావించిన ఆ నియామక ప్రకటన నిజమైనదేనని ప్రకటించింది. ఇదొక్కటే ఇలాంటి సంఘటన కాదు. పలు పత్రికా ప్రచురణకర్తలు ఇటువంటి వాస్తవాల తనిఖీ తొందరపాట్లపై ఫిర్యాదు చేసిన ఉదంతాలు ఉన్నాయి.
‘ఐటీ నియమావళి, 2023’ మొదట 2023 జనవరి 2న ఒక ముసాయిదా రూపంలో వెలువడింది. ఆ నియమావళిపై 2023 జనవరి 17 లోపు తమ అభిప్రాయాలను వెల్లడించాలని ప్రభుత్వం డిజిటల్ సంస్థలను, డిజిటల్ వినియోగదారులను కోరింది. అయితే ఆ ముసాయిదా ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలను నియంత్రించడానికి అవసరమైన నిబంధనలను మాత్రమే కలిగి ఉంది. అభిప్రాయాల వెల్లడికి గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆ ముసాయిదాలో ‘వాస్తవాల తనిఖీ’ అధికా రాలను చేరుస్తూ దానిపై సంప్రదింపుల వ్యవధిని పొడిగించింది. ఈ చర్యే ఆందోళనకు దారి తీసింది.
ఎడిటర్స్ గిల్డ్ జనవరి 18న ఒక ప్రకటన విడుదల చేస్తూ, తనిఖీ అధికారాల నిబంధనను వెనక్కు తీసుకోవాలని కోరింది. ఏది నకిలీ సమాచారమో తేల్చే పూర్తి నిర్ణయాధికారం ప్రభుత్వం చేతిలో ఉండకూడదని అభిప్రాయపడింది. జనవరి 19న ‘డిజిపబ్’... ప్రతిపాదిత సవరణల్ని విమర్శించింది. ఆ సవరణలు భారత ప్రభుత్వానికి ఏకపక్షంగా విచక్షణాధికారాలను కట్ట బెడుతున్నాయని ఆరోపించింది. జనవరి 23న ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ... ఈ సవరణలు ప్రభుత్వ చర్యల్ని విమర్శించడాన్ని నిషేధించేందుకు అనుమతిస్తున్నాయని వాదించింది.
ఈ అభ్యంతరాలన్నిటికీ జనవరి 25న ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమాధానం ఇచ్చారు. ఈ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఏర్పాటు ప్రతిపాదనపై ఫిబ్రవరి ఆరంభంలో పీఐబీతో ప్రత్యేక సంప్రదింపులు జరుపుతామని ప్రకటించారు. అయితే ముఖాముఖీలు గానీ, ఆన్‌లైన్ ప్రజా సంప్రదింపులు గానీ లేవు. డిజిటల్ సమాచార సంస్థలతో ప్రభుత్వం అసలు సమావేశమే అవలేదు. ‘‘అన్నిటికన్నా ఆశ్చర్య పరుస్తున్నదేమంటే ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా అర్థవంతమైన సంప్రదింపులేవీ జరప కుండానే ముసాయిదాలో సవరణల్ని ప్రకటించడం’’ అని ఎడిటర్స్ గిల్డ్ ఏప్రిల్ 7న పేర్కొంది.
వాస్తవానికి ‘ఐటీ నియమావళి, 2021’లో ప్రతి సంవత్సరం సవ రణలు జరుగుతూనే ఉన్నాయి. మొదట 2021 ఫిబ్రవరి 25న ప్రభుత్వం ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు, డిజిటల్ న్యూస్ పోర్టల్స్‌కు ఉన్న అధికారాలను విస్తరిస్తూ నియమాల్లో మార్పులు చేసింది. ఆ మార్పులపై వ్యతిరేకత వ్యక్తం అయింది. 30 రిట్ పిటిషన్‌లు దాఖలు అయ్యాయి. వాటిపై మూడు హైకోర్టులు నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చాయి. 2021 ఆగస్టు 5న బాంబే హైకోర్టు ‘‘ఈ మార్పులు ఆలోచనా స్వేచ్ఛ కోసం ప్రజలు అలమటించేలా చేస్తాయి’’ అని పేర్కొంటే, 2021 సెప్టెంబరు 17న మద్రాసు హైకోర్టు, ‘‘ప్రభుత్వపు ఒక్క కనుసైగతో పౌరులకు సమాచారం అందుబాటులో లేకుండా పోతుంది’’ అని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం ఈ కేసులను సవాలు చేసి వాటిని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరింది.
ఆ తర్వాత, 2022 అక్టోబర్ 28న ప్రభుత్వం మరికొన్ని సవ రణల్ని ప్రవేశపెట్టింది. సోషల్ మీడియా వినియోగదారులు సమాచార నియంత్రణ నియమాలపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి వీలుకల్పించే ఫిర్యాదుల అప్పిలేట్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు 37 విజ్ఞప్తులు రాగా, వాటిల్లో 19 విజ్ఞప్తులను నిర్ణయ మేమిటో వెల్లడించకుండా, ప్రజలకు వాటి యు.ఆర్.ఎల్.లను బహి ర్గతం చేయకుండా అవి పరిష్కరించేశాయి! ఇదంతా ‘రేస్ ఇస్పా లోక్వి టూర్’ (వాస్తవాలు వాటికవే మాట్లాడతాయి) అనే లాటిన్ సామెతను గుర్తు చేస్తోంది. నిజం ఏమిటో నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వ శాఖకు దఖలు పరుస్తున్న ఐటీ నియమావళి, 2023తో వాస్తవాలే మాట్లాడతాయన్న సంగతి కూడా నిర్ధారణలోకి రావచ్చు.
అపర్ గుప్తా
వ్యాసకర్త న్యాయవాది,ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
(‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment