సోషల్‌ పోరులో హోరాహోరీ | political parties bet big on social media, data analytics for campaign | Sakshi
Sakshi News home page

సోషల్‌ పోరులో హోరాహోరీ

Published Mon, Sep 17 2018 4:13 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

political parties bet big on social media, data analytics for campaign - Sakshi

న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఖాయమని ఇప్పటికే తేలిపోయింది. అయితే ఈసారి క్షేత్ర స్థాయిలో నేతల ప్రచారంతో సమానంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రధాన పార్టీల మధ్య యుద్ధం తారస్థాయిలో సాగనుంది. అందుకోసం ఆయా పార్టీలు తమ సోషల్‌ మీడియా ప్రచార వీరుల్ని యుద్ధం కోసం సన్నద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే వేలాది మంది వలంటీర్లకు సమాచార విశ్లేషణ, సంప్రదింపుల అంశంలో శిక్షణను పార్టీలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ వంటి పెద్ద పార్టీలే కాకుండా.. ఆమ్‌ ఆద్మీ, సీపీఎం వంటి పార్టీలు కూడా సైబర్‌ సైన్యాన్ని ఎన్నికల ప్రచార రంగంలోకి దింపుతున్నాయి.
 
2014 ఎన్నికల ప్రచారం నుంచి గుణపాఠం నేర్చుకున్న కాంగ్రెస్‌.. ఆన్‌లైన్, సోషల్‌ మీడియా వేదికగా ప్రచార స్థాయిని గణనీయంగా పెంచుకుని బీజేపీతో సమానంగా పోటీకి సిద్ధమైంది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సోషల్‌ మీడియా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా భారత్‌లో 46.21 కోట్ల మంది ఇంటర్నెట్‌ను వాడుతున్నారు. ఇక 2019 నాటికి దేశంలో సోషల్‌ మీడియాను వాడేవారి సంఖ్య 25 కోట్లకు చేరనుంది. 2016లో ఆ సంఖ్య 16.8 కోట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా ప్రచారం 2019 లోక్‌సభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడం ఖాయం.  

బీజేపీకి దీటుగా కాంగ్రెస్‌
కాంగ్రెస్‌ పార్టీలో డిజిటల్‌ ప్రచార విభాగాల్ని చాలాకాలం నుంచే బలోపేతం చేశామని, సోషల్‌ మీడియా ప్రచార వ్యూహాల్ని ఖరారుచేసేందుకు అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రత్యేక విభాగాల్ని నెలకొల్పామని ఆ పార్టీ సోషల్‌ మీడియా విభాగం చీఫ్‌ దివ్య స్పందన తెలిపారు. ‘ప్రతీ రాష్ట్రంలోను సోషల్‌ మీడియా విభాగాల్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు వాటిని జిల్లా స్థాయికి విస్తరిస్తున్నాం. పార్టీలోని ప్రతి ఒక్కరూ పార్టీ డిజిటల్‌ విభాగంతో అనుసంధానమయ్యారు. దాంతో సమాచారం ఎప్పటికప్పుడు వారికి అందుతోంది’ అని స్పందన చెప్పారు. పార్టీ వాట్సాప్‌ నంబర్‌కు అందరూ అనుసంధానం కావాలని కార్యకర్తలకు కాంగ్రెస్‌ సూచించింది. కార్యకర్తలందరినీ డిజిటల్‌ ప్రచారానికి అనుసంధానం చేసేలా ‘ప్రాజెక్టు శక్తి’ని చేపట్టామని కాంగ్రెస్‌ సమాచార విభాగం చీఫ్‌ ప్రవీణ్‌ చక్రవర్తి చెప్పారు.   

12 లక్షల మంది వలంటీర్లు: బీజేపీ  
2014 ఎన్నికల సందర్భంగా సోషల్‌ మీడియా ప్రాముఖ్యతను గుర్తించిన బీజేపీ.. ఈసారి మరింత దీటుగా ప్రతిపక్షం ఆరోపణల్ని సోషల్‌ మీడియా వేదికగా తిప్పికొట్టేందుకు సర్వసన్నద్ధంగా ఉంది. సోషల్‌ మీడియా ప్రచారం కోసం 12 లక్షల మంది వలంటీర్లు అందుబాటులో ఉన్నారని.. ఆ సంఖ్య క్రమంగా పెరుగుతోందని బీజేపీ ఐటీ విభాగం ఇన్‌చార్జ్‌ అమిత్‌ మాల్వియ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement