సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్ వ్యూహాలను అమలు చేస్తోంది. ముందస్తు ఎన్ని కలకు అభ్యర్థులను ముందే ప్రకటించిన టీఆర్‌ఎస్... ప్రచారం విషయంలోనూ ప్రత్యర్థి పార్టీల కంటే ముందుంటోంది. నియోజకవర్గాల్లో సాధారణ ప్రచారానికి తోడుగా సోషల్ మీడియా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రతిపక్ష పార్టీలు ఇంకా అభ్యర్థులపై స్పష్టతకు రాకముందే... ఒకదశ ప్రచారాన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతోంది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో అమలు చేసిన ‘వంద ఓటర్లకు కమిటీ’విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని టీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయించింది.
టీఆర్‌ఎస్‌కు సవాలుగా నిలిచిన ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ రికార్డు స్థాయిలో 4,59,092 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పోలింగ్ నిర్వహణలో టీఆర్‌ఎస్ అనుసరించిన విధానంతోనే పార్టీకి భారీ మెజారిటీ సాధ్యమైంది. ఇదే వ్యూహాన్ని ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లోనూ అమలు చేసి విజయం సాధించింది. ప్రతిష్టాత్మకంగా మారిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని టీఆర్‌ఎస్ వదులుకోవడంలేదు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలకు ప్రస్తుత ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. నాలుగేళ్ల పరిపాలనలో సహజంగా ఉండే వ్యతిరేకతను అధిగమించేందుకు వీరు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ‘వంద ఓటర్లకు కమిటీ’విధానాన్ని ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో ప్రారంభించారు.
బూత్ కమిటీల కంటే మెరుగ్గా...
టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనను, అభ్యర్థి విజయాలను... ఆయా నియోజకవర్గా ల్లోని ప్రతి ఓటరుకు చేరవేయడమే లక్ష్యంగా ‘వంద ఓటర్లకు కమిటీ’విధానం ఉంటోంది. అభ్యర్థులకు, ఓటర్లకు అనుసంధానంగా ఈ కమిటీ పని చేస్తుంది. గతంలో అన్ని పార్టీల్లో ఉన్న బూత్ కమిటీల కంటే మెరుగైన ఫలితాలు వంద ఓటర్లకు కమిటీలతో సాధ్యమవుతాయి. వంద మంది ఓటర్లే ఉండటంతో ప్రతి వారంలో ఒకసారి ప్రతీ ఓటరును ఈ కమిటీ కలిసే అవకాశం ఉంటుంది. ఆయా ఓటర్లకు సంబంధించిన అంశాలను తెలుసుకుని అవసరాలను తీర్చడం, కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత కమిటీలు మరింత క్రీయాశీలకంగా పనిచేస్తాయి. ఎన్నికల నోటిఫికేషన్ నుంచి పోలింగ్ రోజు వరకు ప్రతిరోజు కలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే పోలింగ్ నిర్వహణలో ‘వంద ఓటర్లకు కమిటీ’ప్రభావం ఎక్కువగా ఉండనుంది. దీంతో ఈ విధానాన్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని టీఆర్‌ఎస్ అధిష్టానం అభ్యర్థులకు సూచించింది.
ప్రచారంపై అధినేత సమీక్ష...
టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచార సరళిపై ఈ పార్టీ అధినేత కేసీఆర్ ప్రతిరోజు సమీక్షిస్తున్నారు. పలువురు అభ్యర్థులకు ఫోన్‌లో సూచనలు చేస్తున్నారు. అక్టోబర్ 3 నుంచి వరుసగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించే నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ముఖ్యనేతలతో కేసీఆర్ మాట్లాడారు. బహిరంగ సభల జనసమీకరణ లక్ష్యాలను మరోసారి నిర్దేశించారు. అన్ని నియోజకవర్గాల నుంచి జనసమీకరణ ఉండాలని స్పష్టం చేశారు. బహిరంగ సభలకు ఏర్పాట్లను చేస్తూనే ఆయా నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచార ప్రక్రియను కొనసాగించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచారాన్ని నియోజకవర్గ స్థాయిలో సమన్వయం చేసేందుకు సీనియర్ నేతలను పర్యవేక్షకులుగా నియమించాలని కేసీఆర్ నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment