వైర్‌లెస్ రూపకర్త ఎవరు?
వైర్‌లెస్‌ను కనుగొన్న గూగ్లీమో మార్కోనీ 1874 ఏప్రిల్ 25న ఇటలీలో జన్మించారు. ధనవంతుల కుటుంబంలో జన్మించటం వలన ప్రైవేట్‌గానే చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలన్న కోరిక బాగా ఉండేది. ఆ దృష్టితోనే మార్కోనీ ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించేవాడు.
వివోర్నో టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుంటున్న సమయంలో ఒక వ్యాసం ఆయన దృష్టిని ఆకర్షించింది. ‘వైర్లు లేకుండా రేడియో తరంగాల ప్రసారం సాధ్యమా?’ అన్నది ఆ వ్యాసం. అప్పటికి (1894) టెలిగ్రాఫ్‌ని తీగల ద్వారా పంపడమే గొప్ప. మరో రెండేళ్లలో మార్కోనీ ప్రయోగాలు చేసి రెండు మైళ్ల దూరం వరకు తీగల సాయం లేకుండా రేడియో తరంగాలను ప్రసారం చేయగలిగాడు. తన పరిశోధనని ఇటలీ ప్రభుత్వం ఆమోదించకపోవడంతో దానిని బ్రిటిష్ వారికి ఇచ్చాడు. మార్కోనీ రేడియో పరికరాన్ని కొన్ని నౌకలలో వాడేవాడు.
క్రమంగా 1899 నాటికి రేడియో సంకేతాలను 31 మైళ్ల దూరానికి ప్రసారం చేయగలిగాడు మార్కోనీ. 1901లో అట్లాంటిక్ మహా సముద్రాన్నిదాటి రేడియో సంకేతాలను ప్రసారం చేశారు. దీంతో వైర్‌లెస్ పరిశ్రమలో పెద్ద మార్పు వచ్చింది. ఆ తర్వాత వైర్‌లెస్ వ్యవస్థ ఫలితంగా ఎన్నో ఉపయోగాలు కలిగాయి. మార్కోనీ 1909లో భౌతిక శాస్త్రంలో కార్ల్ ఫెర్డినాండ్ అనే మరో శాస్త్రవేత్తతో కలిసి నోబెల్ బహుమతి పొందారు. నేడు తీగ లేకుండా సంకేతాలు పంపుతున్న, అందుకుంటున్న టెక్నాలజీకి ఆద్యుడు మార్కోనీ.