Wireless
-
ఎయిర్టెల్ 5జీ వైర్లెస్ వైఫై ప్రారంభం.. జియో కంటే ముందుగా..
దేశంలో ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ (Xstream AirFiber) పేరిట ఫిక్స్డ్ వైర్లెస్ 5జీ సర్వీస్‌లను ప్రకటించింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో తొలి 5జీ టెక్నాలజీ ఆధారిత ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (FWA) సేవలను ప్రారంభించింది. నెట్వర్క్ అందుబాటులోని మారుమూల గ్రామాలకు సైతం ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించే ఉద్దేశంతో ఈ టెక్నాలజీ 5జీ వైర్లెస్ సేవలు అందుబాటులోకి తీసువచ్చినట్లు ఎయిర్టెల్ తెలిపింది. ఈ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ వైర్‌లెస్‌గా 100 Mbps వేగంతో ఇంటర్నెట్ అందిస్తుంది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ అనేది స్వతంత్రంగా పనిచేసే ఓ ప్లగ్ అండ్ ప్లే పరికరం. వైఫై 6 ప్రమాణాలతో అంతరాయం లేకుండా విస్తృత నెట్వర్క్ కవరేజీని అందిస్తుంది. దీని ద్వారా ఏకకాలంలో 64 ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లకు హై స్పీడ్ ఇంటర్నెట్ను పొందవచ్చు. ఈ పరికరానికి సంబంధించిన హార్డ్‌వేర్ పరికరాలన్నీ భారత్‌లోనే తయారైనట్లు కంపెనీ పేర్కొంది. గత మూడు నాలుగేళ్లుగా ఇళ్లలో ఉపయోగించే వైఫై సేవలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని, ఎక్స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్‌తో ఫిజికల్ ఫైబర్ నెట్వర్క్ సదుపాయం లేని ప్రాంతాలకు కూడా వేగవంతమైన వైఫై ఇంటర్నెట్ సేవలు అందిస్తామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం డిల్లీ, ముంబై నగరాల్లోనే ఈ సేవలు ప్రారంభించినప్పటికీ రాబోయే రోజుల్లో దేశమంతటా విస్తరించాలని యోచిస్తోంది. 5జీ ఆధారిత ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ సర్వీస్‌ను అధికారికంగా ప్రారంభించిన మొదటి కంపెనీ ఎయిర్టెల్. అయితే కొన్ని నెలల క్రితం జియో కూడా జియో ఎయిర్‌ఫైబర్ పేరుతో ఇటాంటి సర్వీసునే తీసుకురాన్నుట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి జియో ఎయిర్‌ఫైబర్ ధరలు ఎంత ఉంటాయి.. అధికారికంగా ఎప్పుడు ప్రారంభిస్తారు? అన్న వివరాలపై సమాచారం లేదు. ఎయిర్టెల్ ఎయిర్‌ఫైబర్ ప్లాన్ వివరాలు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ నెలకు రూ. 799. హార్డ్‌వేర్ కాంపోనెంట్ కోసం సెక్యూరిటీ డిపాజిట్‌గా అదనంగా రూ. 2,500 చెల్లించాలి. మొత్తం ఆరు నెలల ప్యాకేజ్ 7.5 శాతం తగ్గింపుతో రూ. 4,435లకే అందిస్తోంది. అయితే ఎయిర్టెల్ అపరిమిత డేటాను ఆఫర్ చేస్తుందా లేదా మిగిలిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల మాదిరిగానే పరిమితి ఉంటుందా అనేది స్పష్టత లేదు. -
ఇన్ఫీ నుంచి ప్రైవేట్ ‘5జీ సర్వీసులు’
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా తమ క్లయింట్ల కోసం ప్రైవేట్ 5జీ–యాజ్–ఎ–సర్వీస్‌ను ప్రారంభించింది. దీనితో కంపెనీలకు అధిక బ్యాండ్‌విడ్త్, తక్కువ లేటెన్సీ, విశ్వసనీయ వైర్లెస్ కనెక్టివిటీ లభించగలదని సంస్థ తెలిపింది. డేటా ప్రాసెసింగ్‌కు పట్టే వ్యవధిని కుదించడం ద్వారా నెట్‌వర్క్‌లో జాప్యాన్ని తగ్గించగలిగే మల్టీ–యాక్సెస్ ఎడ్జ్ కంప్యూటింగ్ సాంకేతికతను ఇందులో వినియోగిస్తున్నట్లు ఇన్ఫీ తెలిపింది. -
జియోకు కొత్తగా 6.49 లక్షల మంది కస్టమర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం సంస్థ రిలయన్స్ జియో ఆగస్ట్ నెలలో కొత్తగా 6.49 లక్షల మంది వైర్లెస్ వినియోగదార్లను సొంతం చేసుకుంది. సంస్థ మొత్తం కస్టమర్ల సంఖ్య 44.38 కోట్లకు చేరుకుంది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గణాంకాల ప్రకారం.. భారతి ఎయిర్టెల్ 1.38 లక్షల మంది వినియోగదార్లను దక్కించుకుంది. దీంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 35.41 కోట్లుగా ఉంది. వొడాఫోన్ ఐడియా 8.33 లక్షల మందిని చేజార్చుకుంది. మొత్తం వినియోగదార్ల సంఖ్య 27.1 కోట్లకు వచ్చి చేరింది. -
ఈ గూగుల్ ఇయర్ బడ్స్ స్పెషల్ ఏంటో తెలుసా?
టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్త వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. గతనెలలో పిక్సెల్ బడ్స్ ఎ-సిరీస్ ఇయర్ బడ్స్ విడుదల చేస్తున్నట్లు అనుకోకుండా ప్రకటించింది. అదే ఇయర్ బడ్స్ ను తాజాగా గూగుల్ అధికారికంగా విడుదల చేసింది. గూగుల్ ట్రూ వైర్లెస్ స్టీరియో (టిడబ్ల్యుఎస్) ఇయర్‌బడ్స్ ధర $ 99 (సుమారు రూ .7,200) కాగా ప్రస్తుతం ఈయర్ బడ్స్ యుఎస్, కెనడాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సున్నితంగా, అతి తక్కువ సౌండ్ లో స్పష్టంగా వినబడతాయి. దీంతో చెవులల్లో ఒత్తిడి తగ్గిపోతుందని గూగుల్ తెలిపింది. కొత్త పిక్సెల్ బడ్స్ ఎ-సిరీస్ అడాప్టివ్ సౌండ్‌తో వస్తుంది. ఇది పరిసరాల ఆధారంగా వాల్యూమ్‌ను పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. వినియోగదారులు ప్రయాణాల్లో ఈ ఇయర్ బడ్స్ వినియోగించడం వల్ల ఇతర వాహనాల నుంచి వచ్చే శబ్ధాలు రాకుండా నివారిస్తున్నట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం,ఈ ఇయర్ బడ్స్ ఒక్కసారి పెట్టిన ఛార్జింగ్ 24 గంటల పాటు ఉండడమే కాదు కంటిన్యూగా 5 గంటల పాటు వినియోగించుకోవచ్చు. అతి తక్కువ సమయంలో అంటే 15నిమిషాలు ఛార్జింగ్ పెడితే 3గంటల పాటు వినియోగించుకోవచ్చు. దీంతో పాటు హలో గూగుల్ అంటూ మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ట్రాన్సలేషన్, నోటిఫికేషన్లు పొందవచ్చు. చదవండి : Battlegrounds Mobile India భారీ స్థాయిలో ప్రి రిజిస్ట్రేషన్ -
వైర్లెస్ టెక్నాలజీ: భారీ పెట్టుబడులు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో దేశీ కంపెనీలు అధునాతన వైర్లెస్ టెక్నాలజీలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నాయి. ఈ తరహా పెట్టుబడుల ప్రణాళికలకు సంబంధించి జపాన్ తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 71 శాతం భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు.. మహమ్మారి కారణంగా వైర్లెస్ నెట్‌వర్కింగ్‌పై తమ తమ కంపెనీలు మరింతగా ఇన్వెస్ట్ చేస్తాయని విశ్వసిస్తున్నారు. 5జీ టెక్నాలజీ గానీ పూర్తిగా అందుబాటులోకి వస్తే ఆఫీసుల్లో కమ్యూనికేషన్, మెషీన్లను రిమోట్‌గా పర్యవేక్షించడం, కస్టమర్లకు మరింత మెరుగైన సర్వీసులు అందించడం మొదలైనవి మరింత సులభతరం కాగలవని ఎగ్జిక్యూటివ్‌లు భావిస్తున్నారు. 5జీ,వైఫై-6 వంటి కొత్త తరం వైర్లెస్ టెక్నాలజీలతో భద్రత, విశ్వసనీయత మొదలైన అంశాలకు సంబంధించి సర్వీసుల ప్రమాణాలు మెరుగుపడగలవని, వ్యాపార సంస్థలను విజయపథంలో నడపగలవని సర్వే తెలిపింది. -
ఈక్యూ మోడ్‌తో లెనోవా వైర్లెస్ హెడ్ఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా బహుళజాతి సాంకేతిక సంస్థ లెనోవా తన కొత్త వైర్లెస్ హెడ్ఫోన్లను తాజాగా విడుదల చేసింది. సరికొత్త ఈక్యూ టెక్నాలజీతో 'హెచ్డి 116' పేరుతో ప్రస్తుతం అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంచింది. ఈ నెల చివరి నాటికి ఫ్లిప్‌కార్ట్‌లో కూడా లభ్యమవుతుందని కంపెనీ తెలిపింది. దీని ధరను రూ .2,499 గా వుంచింది. మంచి,లుక్, ఉన్నతమైన నాణ్యత, గొప్ప సౌండ్ అవుట్‌పుట్, బలమైన బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి క్లాసిక్ మేళవింపుతో తమ తాజా హెడ్‌ఫోన్స్ ఆకట్టుకుంటాయని షెన్జెన్ ఆడిషి టెక్నాలజీ లిమిటెడ్ ఇంటర్నేషనల్ బిజినెస్ సీఈవో జిసేన్జు తెలిపారు. డ్యూయల్ ఈక్యూ మోడ్, (ఒకే బటన్‌ను నొక్కడం ద్వారా వినియోగదారుడు రెండు మోడ్లకు మారడానికి అనుమతి), 240హెచ్ స్టాండ్‌బై సమయంతో 24 గంటల ప్లేయింగ్ సమయం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. 2019లో తమ ఆడియో పరికరాలకు భారత వినియోగదారుల నుంచి వచ్చిన విశేష ఆదరణ నేపథ్యంలోఇక్యూ టెక్నాలజీతో అప్‌గ్రేడ్ వెర్షన్‌ను తీసుకొచ్చామని ఆడిషి టెక్నాలజీ లిమిటెడ్ ఇండియా బిజినెస్ హెడ్ నవీన్ బజాజ్ తెలిపారు -
డెల్ సూపర్ ల్యాప్‌టాప్ : అన్నీ ఎక్స్‌ప్రెస్ ఫీచర్లే
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ దిగ్గజం డెల్ ఇండియా సరికొత్త ల్యాప్‌టాప్‌ను రిలీజ్ చేసింది. వైర్లెస్ చార్జింగ్ ల్యాప్‌టాప్ లాటిట్యూడ్ 7000 సిరీస్‌లో భాగంగా లాటిట్యూడ్ 7400 14 అంగుళాల 2 ఇన్ వన్ ల్యాప్‌టాప్‌ను శుక్రవారం ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 1,35,000 గా నిర్ణయించింది. ఇంటెల్ కంటెక్ట్స్ టెక్నాలజీ ఆధారిత సెన్సర్‌ను ఇందులో జోడించింది. ఎక్స్‌ప్రెస్ చార్జింగ్, ఎక్స్‌ప్రెస్ కనెక్ట్లాంటి ఫీచర్లతో యూజర్లకు బెస్ట్ అనుభవాన్ని ఇస్తుందనీ, ఎలాంటి అంతరాయం లేకుండా వేగవంతమైన, సర్వీసులను అందిస్తుందని డెల్ ప్రకటించింది. స్లీప్‌మోడ్‌లో ఉన్న ల్యాప్‌టాప్ యూజర్ ఉనికిని గుర్తించి విండోస్ హలో (బయోమెట్రిక్ యాక్సెస్) కు లాగిన్ అవుతుంది. లేదంటే ఆటోమేటిక్‌గా లాక్ అవుతుంది. తద్వారా సెక్యూరిటీతో బ్యాటరీ పొదుపు అవుతుందని కంపెనీ చెబుతోంది. ఫింగర్ ప్రింట్ రీడర్, పవర్ బటన్ లాంటి ఇన్నోవేటివ్ ఫీచర్లతో వ్యాపార సంస్థలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని డెల్ ఇండియా సీనియర్ డైరెక్టర్ ఇంద్రజిత్ బెలగుండి చెప్పారు. అయితే ఆసక్తి ఉన్న సాధారణ వినియోగదారులు కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చని తెలిపారు. తొందరలోనే ఆన్లైన్, రీటైల్ స్టోర్లలో ఈ ల్యాప్టాప్లనుఅందుబాటులోకి తెస్తామని చెప్పారు. -
ఏటీ అండ్ టీ కస్టమర్లకు ఫ్రీ టీవీలు
ప్రముఖ మీడియా సంస్థ టైమ్ వార్నర్‌ను అమెరికాకు చెందిన అతిపెద్ద టెలికాం దిగ్గజం ఏటీ అండ్ టీ కొనుగోలు చేసింది. 2016లో ప్రకటించిన ఈ డీల్ కోర్టు, ప్రభుత్వ అనుమతులతో సహా అన్ని లాంఛనాలను గురువారం నాటికి పూర్తి చేసినట్లు ఏటీ అండ్ టీ పేర్కొంది. ఈ డీల్ విలువ 8540 కోట్ల డాలర్లని వెల్లడించింది. ఈ విలీనంతో వార్నర్‌కు ఉన్న 10,800 కోట్ల డాలర్ల రుణాన్ని కూడా ఏటీ అండ్ టీ తీసేసుకుంది. అలాగే టైమ్ వార్నర్, హెచ్‌బీఓ, వార్నర్ బ్రదర్స్ ఫిలిమ్ స్టూడియో, టర్నర్ ఛానల్స్... ఏటీ అండ్ టీ చేతికి వచ్చాయి. ఏటీ అండ్ టీ మొబైల్ వినియోగదారులకు ఊహించని ఆఫర్లను అందించనున్నామని సంస్థ ఛైర్మన్ అండ్ సీఈవో రాండాల్ స్టీఫెన్ సన్ చెప్పారు. ఏటీ అండ్ టీ వాచ్ టీవీ ద్వారా వైర్లెస్ కస్టమర్లకు ఉచిత టీవీలను అందించనున్నామని వెల్లడించారు. కస్టమర్లు నెలకు 15డాలర్లు చొప్పున ఏ ప్లాట్‌ఫాంలో నైనా తమ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చని చెప్పారు. వినోద కేంద్రంగా తమ సేవలు ఉండనున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన కోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు. ఒక ఏడాదిలోపునే రుణ భారం నుంచి బయటపడతామని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం తీసుకోబోయే చర్యపై తనకు భయం లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు ఏటీ అండ్ టీ, టైమ్‌వార్నర్ విలీనానికి ఆమోదం తెలుపుతూ కొలంబియా కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పును వెలువరించింది. చారిత్రాత్మక తీర్పుగా పేర్కొంటున్న ఈ తీర్పుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. టెలికాం నిబంధనలను తుంగలో తొక్కినట్టు ఆరోపణలు రావడంతో ఈ డీల్‌పై అమెరికా డిపార్ట్ మెంట్ జస్టిస్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. -
తీగలు తెగినా బేఫికర్!
►సీసీ కెమెరాలన్నీ వైర్లెస్ ద్వారా అనుసంధానం ►ఠాణా సమీపం నుంచి నేరుగా సీసీసీకే విజువల్స్ ►బేగంపేట పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు ►లోపాల అధ్యయనం తర్వాత నగర వ్యాప్తంగా.. సిటీబ్యూరో: నగరంలో సంచలనాత్మక కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నేరగాళ్లను పట్టుకోవడంతో పాటు నేరాలు నిరోధించడంలోనూ వీటి పాత్ర కీలకంగా మారింది. మెరుగైన పర్యవేక్షణ కోసం నగర వ్యాప్తంగా ఉన్న కెమెరాలను కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)తో అనుసంధానిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాల వల్ల అప్పుడప్పుడు కనెక్టివిటీకి సంబంధించిన తీగలు తెగిపోతున్నాయి. దీని ప్రభావం పర్యవేక్షణపై పడుతోంది. ఈ పరిస్థితులకు శాశ్వత పరిష్కారంగా సిటీ పోలీసులు వైర్లెస్ పరిజ్ఞానం పరిచయం చేస్తున్నారు. బేగంపేట పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. సీసీ కెమెరాల ఏర్పాటులో యూనిఫార్మిటీ 2014లో అమలులోకి వచ్చిన ప్రజా భద్రతా చట్టాన్ని కమిషనరేట్ అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. వ్యాపార సముదాయాలు, వాణిజ్య ప్రాంతాల్లో వ్యక్తిగతంగా, కమ్యూనిటీ మొత్తం కలిసి సీసీ కెమెరాల ఏర్పాటును కచ్చితం చేశారు. అయితే ఎవరికి నచ్చిన మోడల్, సామర్థ్యం కలిగిన కెమెరాలను వారు ఏర్పాటు చేసుకుంటే కనెక్టివిటీకి సంబంధించి అనేక ఇబ్బందులు వస్తాయి. అలా కాకుండా యూనిఫార్మిటీ కోసమూ పోలీసు విభాగం జాగ్రత్తలు తీసుకుంటోంది. పోలీసులే ఓ ప్రముఖ కంపెనీతో సంప్రదింపులు జరిపింది. సీసీ కెమెరాలకు ఉండాల్సిన సదుపాయాలు, ప్రమాణాలను (స్పెసిఫికేషన్స్) నిర్దేశించి అంతా వాటినే ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో సింక్రనైజేషన్... సీసీ కెమెరాల ఏర్పాటును పర్యవేక్షించే బాధ్యతల్ని ఠాణాల వారీగా ఇన్స్పెక్టర్లకు అప్పగించారు. వీరి సూచన మేరకు వ్యాపార సముదాయాలు, వాణిజ్య కూడళ్లతో పాటు తమ దుకాణాల్లోనూ వ్యాపారులు వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. దుకాణం బయటకు ఉన్న కెమెరాలన్నింటినీ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా సీసీసీతో అనుసంధానిస్తున్నారు. దీంతో ప్రతి సీసీ కెమెరాలో కనిపించే దృశ్యాలను పోలీసుస్టేషన్‌తో పాటు సీసీసీ నుంచి పర్యవేక్షించే అవకాశం ఏర్పడింది. ఇలా సింక్రనైజ్ చేయడానికి ప్రస్తుతం వైర్లు వినియోగిస్తున్నారు. వివిధ కారణాల నేపథ్యంలో ఇవి తెగిపోతుండటంతో నిత్యం కొన్నింటిలోని దృశ్యాలు సీసీసీలో ‘అదృశ్యమవుతున్నాయి’. రెండో దశలో ఎనలటిక్స్... నగర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉండే కెమెరాల్లో కనిపించే దృశ్యాలను ఎప్పటికప్పుడు సీసీసీ ఉండే సిబ్బంది పర్యవేక్షించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే దీనికోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు రెండో దశలో భాగంగా పటిష్ట నిఘా కోసం ఎనలటిక్స్‌గా పిలిచే సాఫ్ట్వేర్స్ అభివృద్ధి చేస్తున్నారు. వైర్లెస్ విధానం అమలుకు శ్రీకారం... ఠాణా పరిధిలో ఇలా తెగిన వైర్లను అతికించి, దృశ్యాలను పునరుద్ధరించే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. అయితే సీసీసీ బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లో ఉండటంతో దీంతో సింక్రనైజేషన్‌కు సమయం పట్టడంతో పాటు అనేక ఇబ్బందులొస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా పోలీసు విభాగం వైర్లెస్ విధానం అమలు చేస్తోంది. ఆ ఠాణా పరిధిలో ఉండే సీసీ కెమెరాలన్నీ పోలీసుస్టేషన్‌తో అనుసంధానించి ఉంటాయి. దానికి సమీపంలో ఉన్న ఎల్తైన భవనంపై ఓ ట్రాన్స్‌మీటర్‌ను ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించిన రిసీవర్ కమిషనరేట్ సమీపంలోని బాబూఖాన్ ఎస్టేట్‌పై అమరుస్తారు. అక్కడ నుంచి సీసీసీకి వైర్ల ద్వారానే ఫీడ్ అందుతుంది. దీంతో ఠాణా నుంచి సీసీసీ వరకు బ్రాడ్‌బ్యాండ్‌తో అవసరం ఉండదు. బేగంపేటలో ప్రయోగాత్మకంగా ఈ విధానం ప్రారంభమైంది. లోపాలను అధ్యయనం చేయడంతో పాటు వాటిని సరి చేసిన తర్వాత నగర వ్యాప్తంగా అన్ని ఠాణాల వద్దా ట్రాన్స్మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇవి ఎలా పనిచేస్తాయంటే... ►నగరంలోని అన్ని కెమెరాలు అనుసంధానించి ఉండే సీసీసీలోని సర్వర్‌ను కంప్యూటర్లకు అనుసంధానిస్తారు. ►ఈ సర్వర్లలో ఎనలటిక్స్‌గా పిలిచే ప్రత్యేక సాఫ్ట్వేర్స్ నిక్షిప్తం చేస్తారు. ►వీటిలో ఉండే ప్రోగ్రామ్స్ ఆధారంగా సర్వర్ అన్ని కెమెరాలను పర్యవేక్షిస్తూ, నిర్దేశిస్తుంటుంది. ►వన్ వేలతో పాటు ఇతర మార్గాల్లోనూ వ్యతిరేక దిశలో (రాంగ్‌రూట్)లో వస్తున్న వాహనాలను, నో పార్కింగ్, నో ఎంట్రీల్లోని వాహనాలను సాఫ్ట్వేర్ ఆధారంగా కెమెరాలు గుర్తిస్తాయి. ►ఆ విషయాన్ని తక్షణం సీసీసీలోని భారీ డిజిటల్ స్కీన్‌పై పాప్అప్ రూపంలో ఇచ్చి అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి. ►పాప్అప్లో ఉండే వివరాల ఆధారంగా సమీపంలోని పోలీసుల్ని సీసీసీలోని సిబ్బంది అప్రమత్తం చేస్తారు. ►ఓ ప్రాంతంలో హఠాత్తుగా గలాభా చోటు చేసుకుని ఎక్కువ మంది ఓ చోట గుమిగూడినా, ఏదైనా ప్రమాదం జరిగి వాహనాలు ఆగిపోయినా ఇవి గుర్తిస్తాయి. ►నగరంలో నిర్దేశించిన ప్రాంతాల్లో ఏదైనా వస్తువు, వాహనం నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు ఆగి ఉన్నా... ఈ విషయం పాప్అప్ రూపంలో సీసీసీలోని సిబ్బందికి తెలుస్తుంది. ►రాత్రి వేళల్లో మూసివేసి ఉండే ప్రార్థనా స్థలాలు, నిర్మానుష్య ప్రాంతాల్లోకి ఎవరైనా ప్రవేశించినా ఆ విషయాన్ని కెమెరాలు తక్షణం గుర్తించి పాప్అప్ ఇస్తాయి. ►ఈ ఎనలటిక్స్‌లో శాంతిభద్రతల పర్యవేక్షణ, నేరాల నిరోధానికీ ఉపకరించేలా డిజైన్ చేస్తున్నారు. -
వైర్లెస్ రూపకర్త ఎవరు?
వైర్‌లెస్‌ను కనుగొన్న గూగ్లీమో మార్కోనీ 1874 ఏప్రిల్ 25న ఇటలీలో జన్మించారు. ధనవంతుల కుటుంబంలో జన్మించటం వలన ప్రైవేట్‌గానే చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలన్న కోరిక బాగా ఉండేది. ఆ దృష్టితోనే మార్కోనీ ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించేవాడు. వివోర్నో టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్న సమయంలో ఒక వ్యాసం ఆయన దృష్టిని ఆకర్షించింది. ‘వైర్లు లేకుండా రేడియో తరంగాల ప్రసారం సాధ్యమా?’ అన్నది ఆ వ్యాసం. అప్పటికి (1894) టెలిగ్రాఫ్‌ని తీగల ద్వారా పంపడమే గొప్ప. మరో రెండేళ్లలో మార్కోనీ ప్రయోగాలు చేసి రెండు మైళ్ల దూరం వరకు తీగల సాయం లేకుండా రేడియో తరంగాలను ప్రసారం చేయగలిగాడు. తన పరిశోధనని ఇటలీ ప్రభుత్వం ఆమోదించకపోవడంతో దానిని బ్రిటిష్ వారికి ఇచ్చాడు. మార్కోనీ రేడియో పరికరాన్ని కొన్ని నౌకలలో వాడేవాడు. క్రమంగా 1899 నాటికి రేడియో సంకేతాలను 31 మైళ్ల దూరానికి ప్రసారం చేయగలిగాడు మార్కోనీ. 1901లో అట్లాంటిక్ మహా సముద్రాన్నిదాటి రేడియో సంకేతాలను ప్రసారం చేశారు. దీంతో వైర్లెస్ పరిశ్రమలో పెద్ద మార్పు వచ్చింది. ఆ తర్వాత వైర్లెస్ వ్యవస్థ ఫలితంగా ఎన్నో ఉపయోగాలు కలిగాయి. మార్కోనీ 1909లో భౌతిక శాస్త్రంలో కార్ల్ ఫెర్డినాండ్ అనే మరో శాస్త్రవేత్తతో కలిసి నోబెల్ బహుమతి పొందారు. నేడు తీగ లేకుండా సంకేతాలు పంపుతున్న, అందుకుంటున్న టెక్నాలజీకి ఆద్యుడు మార్కోనీ. -
ఇక మొబైల్లకు వైర్లెస్ చార్జింగ్!
ఎంత ఖరీదైన మొబైల్ కొనుగోలు చేసినా చార్జింగ్ విషయం మాత్రం వినియోగదారులకు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోయింది. అయితే దీనిని పరిష్కరించే దిశగా కొత్త చార్జింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఎనర్జీస్క్వేర్ పేరుతో మార్కెట్లోకి రాబోతున్న వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీ ద్వారా అన్ని స్మార్ట్ ఫోన్లతో పాటు.. ట్యాబ్‌లను కూడా ఈజీగా చార్జ్ చేసుకోవచ్చు. ఎనర్జీస్క్వేర్లో ఓ వైర్లెస్ చార్జింగ్ మ్యాట్‌తో పాటు ఓ చిన్న స్టిక్కర్ ఉంటుంది. మొబైల్‌కు అంటుకునే లాగా డిజైన్ చేసిన ఈ స్టిక్కర్‌ను చార్జింగ్ సాకెట్లో ఉంచి ఫోన్‌ను.. మ్యాట్‌పై ఉంచితే చాలు చార్జింగ్ అవుతోంది. ఇందులో ఇప్పటివరకు చార్జింగ్ కోసం వాడుతున్న ఇండక్షన్, ఎలక్ట్రో మేగ్నటిక్ టెక్నాటజీని కాకుండా కండక్టీవ్ చార్జింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఒకే చార్జింగ్ ప్యాడ్ సహాయంతో నాలుగైదు ఫోన్లను సైతం ఒకేసారి చార్జింగ్ చేసుకోవచ్చు. గత ఐదేళ్లలో తయారుచేసిన ఏ స్మార్ట్‌ఫోన్ అయినా ఈ చార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. స్టిక్కర్లలో ఉండే రెండు కండక్టీవ్ డాట్స్ సహాయంతో నేరుగా మొబైల్ బ్యాటరీకి లింక్ అయ్యేలా దీనిని రూపొందించారు. చార్జింగ్ మ్యాట్‌తో పాటు నాలుగు స్టిక్కర్లను కస్టమర్లకు ఇవ్వనున్నట్లు ఎనర్జీస్క్వేర్ వెల్లడించింది. అయితే ఇవి వచ్చే నెలలో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. -
స్మోక్ డిటెక్టర్లు ఎలా పనిచేస్తాయి?
హౌ ఇట్ వర్క్స్ అగ్ని ప్రమాదాలను నివారించడంలో స్మోక్ డిటెక్టర్లు ఎంతో కీలకం. ఇళ్లల్లో మొదలుకొని... పెద్ద పెద్ద భవంతుల్లో, ఆఫీసుల్లో ఎక్కడైనా వీటిని అమర్చుకోవడం ద్వారా ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించవచ్చు. నిప్పు లేకుండా పొగ రాదంటారు కదా మరి ఈ పొగను స్మోక్ డిటెక్టరైనా ఎలా గుర్తిస్తుంది? నిజానికి స్మోక్ డిటెక్టర్ ఓ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ మాత్రమే. కొన్ని రకాల వాయు కణాలు ఈ సర్క్యూట్‌ను అడ్డుకున్నా, లేదా ఇబ్బందులు కలగజేసినా అలారం మోగిపోతుంది. ఈ సర్క్యూట్ పరికరంలోని చిన్న గదిలాంటి నిర్మాణంలో ఉంటుంది. రెండు ఎలక్ట్రోడ్ల మధ్య అతితక్కువ గ్యాప్ ఉండేలా దీన్ని ఏర్పాటు చేస్తారు. ఈ రెండు ఎలక్ట్రోడ్ల మధ్య విద్యుత్తు వైర్లెస్ పద్ధతిలో ప్రవహిస్తూ ఉంటుంది. సర్క్యూట్‌కు అనుసంధానమైన మైక్రోచిప్ విద్యుత్ ప్రవాహాన్ని నిత్యం గమనిస్తూ ఉంటుంది. అగ్ని ప్రమాద వేళల్లో ముందుగా పొగ పుట్టుకొచ్చినప్పుడు ఆ పొగలోని కణాలు స్మోక్ డిటెక్టర్‌లో ఎలక్ట్రోడ్లు ఉన్న చాంబర్లోకి వెళతాయి. ఫలితంగా విద్యుత్ ప్రవాహంలో తేడా వస్తుంది. దీన్ని గుర్తించే మైక్రోచిప్ వెంటనే అలారం మోగేలా చేస్తుంది. -
లూనా... ఓ చక్కని సేవకుడు!
శునకాన్ని వాకింగ్‌కు తీసుకెళ్లడమే కాదు.. లూనా అనే ఈ పర్సనల్ రోబో ఇంకా అనేక పనులూ చేయగలదు. కూల్డ్రింకులు అందించడంతో పాటు ఆస్పత్రిలో వైద్యులకు, నర్సులకు సహాయం కూడా చేస్తుంది. కాలిఫోర్నియాలోని రోబోడైనమిక్స్ కంపెనీ వారు దీనిని తయారు చేస్తున్నారు. మనిషిలా ఒకటిన్నర మీటర్ల ఎత్తుండే లూనా ముఖంపై టచ్‌స్క్రీన్ ఉంటుంది. మైక్రోఫోన్, వైర్లెస్, సెల్యులార్ కమ్యూనికేషన్ ద్వారా నియంత్రించొచ్చు. హెచ్డీ కెమెరాతో పరిసరాలను గమనిస్తూ చక్రాలతో చకచకా తిరుగుతుంది. దీనిని పెద్ద ఎత్తున ఉత్పత్తిచేసేందుకు కంపెనీవారు నిధుల వేట మొదలుపెట్టారు. డిసెంబర్‌లోగా మార్కెట్లోకి రానున్న లూనా ధర రూ. 93 వేలు. ముందుగా బుక్ చేసుకుంటే రూ. 63 వేలు. ఇప్పుడు పీసీలు, స్మార్ట్ఫోన్లు ఇంటింటా సందడి చేస్తున్నట్లే.. 2021 నాటికి పర్సనల్ రోబోలూ హల్చల్ చేస్తాయని, వాటిలో లూనా మొదటిస్థానంలో నిలుస్తుందని కంపెనీవారు చెబుతున్నారు. -
కొత్త రూటర్‌తో తగ్గనున్న ఇంటర్నెట్ కష్టాలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశంలోని ప్రముఖ నెట్వర్కింగ్ కంపెనీ ‘స్మార్ట్‌లింక్ నెట్వర్క్ సిస్టమ్స్ లిమిటెడ్’ ఏసీ750 అనే వైర్లెస్ డ్యూయల్ బ్యాండ్ బ్రాడ్‌బ్యాండ్ రూటర్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. డీజీ-బీఆర్4400ఏసీ అనే ఈ కొత్త తరం రూటర్కున్న రెండు ప్రత్యేక ఎల్ఈడీలు...2.4 జీహెచ్‌జడ్, 5 జీహెచ్‌జడ్ ఫ్రీక్వెన్సీలను సూచిస్తాయని, తద్వారా కనెక్టెడ్ వైర్లెస్ నెట్‌వర్క్‌ను సులభంగా గుర్తించవచ్చని సంస్థ ఒక ప్రకటనలో వివరించింది. భారతీయ ఇంటర్నెట్ స్పేస్ అనేక డివైజ్‌లలో విశ్వ రూపాన్ని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో బహుళ ఇంటర్నెట్ డివైజ్‌లు అనేక సమస్యలు సృష్టిస్తున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో నెట్వర్క్ అత్యుత్తమంగా పని చేయడానికి ఈ రూటర్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. అంతేకాకుండా రూటర్‌లోని ఇన్‌బిల్ట్ గిగాబైట్ వై-ఫై, కంటెంట్‌ను వేగంగా డౌన్లోడ్ చేసుకోవడానికి సాయపడుతుందని పేర్కొంది. పెద్ద వీడియో, మ్యూజిక్ ఫైళ్లను సత్వరమే వినియోగించుకోవడానికి కూడా వీలవుతుందని తెలిపింది. దీని ధర రూ.3,490 అని, ఇళ్లు, వ్యాపారాల్లో అత్యుత్తమ పనితీరుకు దీనికి మించిన ప్రత్యామ్నాయం లేదని వివరించింది. అమ్మకాల తదనంతర సేవలను కూడా సమర్థంగా అందిస్తామని తెలిపింది. -
వైర్లెస్ సెట్లు!
పాలకుర్తి, న్యూస్‌లైన్ : ప్రజల సొమ్మే కదా అని అనుకుందో... ఏమో... మన జిల్లా యంత్రాంగం... అనుకున్నదే తడువుగా మండల కేంద్రాల్లోని తహసీల్దార్, ఎంపీడీఓ, ఆర్డీఓ కార్యాలయూల్లో వైర్లెస్ సెట్లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా మండల పరిధిలో జరుగుతున్న సంఘటనలు, అభివృద్ధి పనుల వివరాలు, ప్రజల ఇబ్బందులు జిల్లా యంత్రాంగానికి వెంటవెంటనే నివేదించే అవకాశముంటుంది. అదేక్రమంలో అన్ని మండల కేంద్రాల్లోని అధికారులకు ఏకకాలంలో సమాచారం చేరవేసేందుకు ఇది ఉపయోగకారిగా ఉంటుంది కదా.. ఇది మంచి పనే అనుకోవచ్చు. అయితే ఈ ఆధునిక కాలంలో సెల్ఫోన్లు విస్తరించాయి... అందులోనూ అధికారులతో ఉచితంగా మాట్లాడుకునే అవకాశమున్న గ్రూప్ సిమ్లూ అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వైర్లెస్ సెట్ల కొనుగోలు దండగే అనవచ్చు. అంతేకాకుండా లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వైర్లెస్ సెట్లు వినియోగంలో లేక అక్కరకు రాకుండా పోయూయి. వైర్లెస్ సెట్లను ఎవరూ పట్టించుకోకపోవడంతో అవి బూజుపట్టగా... భవనాలపై తరంగాల కోసం ఏర్పాటు చేసిన ఏరియల్ పైపులు విరిగిపోయూయి. ముందుచూపు లేకుండా కొనుగోలు చేయడమే కాకుండా... అధికారుల నిర్లక్ష్య వైఖరితో వైర్లెస్ సెట్లు మూలకుపడ్డాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ. 20 లక్షలు వృథా జిల్లావ్యాప్తంగా 50 మండలాల్లోని ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలతోపాటు ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో వైర్లెస్ సెట్లు అమర్చారు. ఒక్కో సెట్ విలువ సుమారు రూ. 10 వేల పైనే ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో మండలంలో రెండు వైర్లెస్ సెట్లకు రూ. 20 వేల ఖర్చవుతుంది. అంటే జిల్లాలో సుమారు రూ. 20 లక్షలు వృథా అరుునట్లు తెలుస్తోంది. ఇన్ని నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన వైర్లెస్ సెట్లు ఎందుకు అక్కరకు రాకుండా పోయాయని మండల అధికారులను ప్రశ్నిస్తే... వారిచ్చిన సమాధానం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘మా వద్దనే కాకుండా జిల్లాలో ఎక్కడా వాడడం లేదు. ల క్షలాది రూపాయలు వెచ్చించి ఎంతో మేలు చేస్తుందని ఆశిస్తే ఆశలన్నీ అవిరయ్యారుు.’ అని అంటున్నారు.