తీగలు తెగినా బేఫికర్!
►సీసీ కెమెరాలన్నీ వైర్‌లెస్ ద్వారా అనుసంధానం
►ఠాణా సమీపం నుంచి నేరుగా సీసీసీకే విజువల్స్
►బేగంపేట పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు
►లోపాల అధ్యయనం తర్వాత నగర వ్యాప్తంగా..
సిటీబ్యూరో: నగరంలో సంచలనాత్మక కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నేరగాళ్లను పట్టుకోవడంతో పాటు నేరాలు నిరోధించడంలోనూ వీటి పాత్ర కీలకంగా మారింది. మెరుగైన పర్యవేక్షణ కోసం నగర వ్యాప్తంగా ఉన్న కెమెరాలను కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)తో అనుసంధానిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాల వల్ల అప్పుడప్పుడు కనెక్టివిటీకి సంబంధించిన తీగలు తెగిపోతున్నాయి. దీని ప్రభావం పర్యవేక్షణపై పడుతోంది. ఈ పరిస్థితులకు శాశ్వత పరిష్కారంగా సిటీ పోలీసులు వైర్‌లెస్ పరిజ్ఞానం పరిచయం చేస్తున్నారు. బేగంపేట పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది.
సీసీ కెమెరాల ఏర్పాటులో యూనిఫార్మిటీ
2014లో అమలులోకి వచ్చిన ప్రజా భద్రతా చట్టాన్ని కమిషనరేట్ అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. వ్యాపార సముదాయాలు, వాణిజ్య ప్రాంతాల్లో వ్యక్తిగతంగా, కమ్యూనిటీ మొత్తం కలిసి సీసీ కెమెరాల ఏర్పాటును కచ్చితం చేశారు. అయితే ఎవరికి నచ్చిన మోడల్, సామర్థ్యం కలిగిన కెమెరాలను వారు ఏర్పాటు చేసుకుంటే కనెక్టివిటీకి సంబంధించి అనేక ఇబ్బందులు వస్తాయి. అలా కాకుండా యూనిఫార్మిటీ కోసమూ పోలీసు విభాగం జాగ్రత్తలు తీసుకుంటోంది. పోలీసులే ఓ ప్రముఖ కంపెనీతో సంప్రదింపులు జరిపింది. సీసీ కెమెరాలకు ఉండాల్సిన సదుపాయాలు, ప్రమాణాలను (స్పెసిఫికేషన్స్) నిర్దేశించి అంతా వాటినే ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.
పబ్లిక్ ప్లేసుల్లో సింక్రనైజేషన్...
సీసీ కెమెరాల ఏర్పాటును పర్యవేక్షించే బాధ్యతల్ని ఠాణాల వారీగా ఇన్‌స్పెక్టర్లకు అప్పగించారు. వీరి సూచన మేరకు వ్యాపార సముదాయాలు, వాణిజ్య కూడళ్లతో పాటు తమ దుకాణాల్లోనూ వ్యాపారులు వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. దుకాణం బయటకు ఉన్న కెమెరాలన్నింటినీ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా సీసీసీతో అనుసంధానిస్తున్నారు. దీంతో ప్రతి సీసీ కెమెరాలో కనిపించే దృశ్యాలను పోలీసుస్టేషన్‌తో పాటు సీసీసీ నుంచి పర్యవేక్షించే అవకాశం ఏర్పడింది. ఇలా సింక్రనైజ్ చేయడానికి ప్రస్తుతం వైర్లు వినియోగిస్తున్నారు. వివిధ కారణాల నేపథ్యంలో ఇవి తెగిపోతుండటంతో నిత్యం కొన్నింటిలోని దృశ్యాలు సీసీసీలో ‘అదృశ్యమవుతున్నాయి’.
రెండో దశలో ఎనలటిక్స్...
నగర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉండే కెమెరాల్లో కనిపించే దృశ్యాలను ఎప్పటికప్పుడు సీసీసీ ఉండే సిబ్బంది పర్యవేక్షించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే దీనికోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు రెండో దశలో భాగంగా పటిష్ట నిఘా కోసం ఎనలటిక్స్‌గా పిలిచే సాఫ్ట్‌వేర్స్ అభివృద్ధి చేస్తున్నారు.
వైర్‌లెస్ విధానం అమలుకు శ్రీకారం...
ఠాణా పరిధిలో ఇలా తెగిన వైర్లను అతికించి, దృశ్యాలను పునరుద్ధరించే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. అయితే సీసీసీ బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లో ఉండటంతో దీంతో సింక్రనైజేషన్‌కు సమయం పట్టడంతో పాటు అనేక ఇబ్బందులొస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా పోలీసు విభాగం వైర్‌లెస్ విధానం అమలు చేస్తోంది. ఆ ఠాణా పరిధిలో ఉండే సీసీ కెమెరాలన్నీ పోలీసుస్టేషన్‌తో అనుసంధానించి ఉంటాయి. దానికి సమీపంలో ఉన్న ఎల్తైన భవనంపై ఓ ట్రాన్స్‌మీటర్‌ను ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించిన రిసీవర్ కమిషనరేట్ సమీపంలోని బాబూఖాన్ ఎస్టేట్‌పై అమరుస్తారు. అక్కడ నుంచి సీసీసీకి వైర్ల ద్వారానే ఫీడ్ అందుతుంది. దీంతో ఠాణా నుంచి సీసీసీ వరకు బ్రాడ్‌బ్యాండ్‌తో అవసరం ఉండదు. బేగంపేటలో ప్రయోగాత్మకంగా ఈ విధానం ప్రారంభమైంది. లోపాలను అధ్యయనం చేయడంతో పాటు వాటిని సరి చేసిన తర్వాత నగర వ్యాప్తంగా అన్ని ఠాణాల వద్దా ట్రాన్స్‌మీటర్లు ఏర్పాటు చేయనున్నారు.
ఇవి ఎలా పనిచేస్తాయంటే...
►నగరంలోని అన్ని కెమెరాలు అనుసంధానించి ఉండే సీసీసీలోని సర్వర్‌ను కంప్యూటర్లకు అనుసంధానిస్తారు.
►ఈ సర్వర్లలో ఎనలటిక్స్‌గా పిలిచే ప్రత్యేక సాఫ్ట్‌వేర్స్ నిక్షిప్తం చేస్తారు.
►వీటిలో ఉండే ప్రోగ్రామ్స్ ఆధారంగా సర్వర్ అన్ని కెమెరాలను పర్యవేక్షిస్తూ, నిర్దేశిస్తుంటుంది.
►వన్ వేలతో పాటు ఇతర మార్గాల్లోనూ వ్యతిరేక దిశలో (రాంగ్‌రూట్)లో వస్తున్న వాహనాలను, నో పార్కింగ్, నో ఎంట్రీల్లోని వాహనాలను సాఫ్ట్‌వేర్ ఆధారంగా కెమెరాలు గుర్తిస్తాయి.
►ఆ విషయాన్ని తక్షణం సీసీసీలోని భారీ డిజిటల్ స్కీన్‌పై పాప్‌అప్ రూపంలో ఇచ్చి అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి.
►పాప్‌అప్‌లో ఉండే వివరాల ఆధారంగా సమీపంలోని పోలీసుల్ని సీసీసీలోని సిబ్బంది అప్రమత్తం చేస్తారు.
►ఓ ప్రాంతంలో హఠాత్తుగా గలాభా చోటు చేసుకుని ఎక్కువ మంది ఓ చోట గుమిగూడినా, ఏదైనా ప్రమాదం జరిగి వాహనాలు ఆగిపోయినా ఇవి గుర్తిస్తాయి.
►నగరంలో నిర్దేశించిన ప్రాంతాల్లో ఏదైనా వస్తువు, వాహనం నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు ఆగి ఉన్నా... ఈ విషయం పాప్‌అప్ రూపంలో సీసీసీలోని సిబ్బందికి తెలుస్తుంది.
►రాత్రి వేళల్లో మూసివేసి ఉండే ప్రార్థనా స్థలాలు, నిర్మానుష్య ప్రాంతాల్లోకి ఎవరైనా ప్రవేశించినా ఆ విషయాన్ని కెమెరాలు తక్షణం గుర్తించి పాప్‌అప్ ఇస్తాయి.
►ఈ ఎనలటిక్స్‌లో శాంతిభద్రతల పర్యవేక్షణ, నేరాల నిరోధానికీ ఉపకరించేలా డిజైన్ చేస్తున్నారు.