
సాక్షి, హైదరాబాద్: గంభీరమైన గళం, స్పష్టమైన ఉచ్ఛారణ, సరళమైన భాషతో ‘ఆకాశవాణి వార్తలు చదువుతున్నది డి.వెంకట్రామయ్య’అంటూ హైదరాబాద్ రేడియో స్టేషన్ కేంద్రంగా మూడున్నర దశాబ్దాలు వివిధ హోదాల్లో పనిచేసిన రేడియో న్యూస్ రీడర్ డి.వెంకట్రామయ్య (78) కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ కూకట్‌పల్లిలో సినిమా చూసి వస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలారు.
రేడియో అనౌన్సర్‌గా 1963 నవంబర్‌లో ఆకాశవాణిలో చేరిన ఆయన న్యూస్ రీడర్‌గా చాలా కాలం పనిచేశారు. నాటక రచయితగా, కథా రచయితగా మంచి పేరు సంపాదించారు. ఆయన రేడియో అనుభవాలు, వెంకట్రామయ్య కథల పేరుతో రెండు పుస్తకాలు వెలువరించారు. వెంకట్రామయ్య ఆకస్మిక మరణంపై హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన అంత్యక్రియలు మంగళవారం ఉదయం 11 గంటలకు అమీర్‌పేట ఈఎస్‌ఐ స్మశానవాటికలో నిర్వహించనున్నారు.
తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
ఆకాశవాణి మాజీ న్యూస్ రీడర్ డి.వెంకట్రామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తమ సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో వివిధ విభాగాలలో ఆయన చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. వెంకట్రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment