News Readers
-
దూరదర్శన్ శాంతి స్వరూప్ కన్నుమూత
హైదరాబాద్, సాక్షి: ‘‘నమస్కారం.. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు..’’ అంటూ ఏళ్లపాటు అలరించిన ఆ గాత్రం మూగబోయింది. దూరదర్శన్ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరు. రెండ్రోజుల కిందట గుండెపోటుతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. దూరదర్శన్‌లో తొలి తెలుగు న్యూస్ రీడర్‌గా శాంతి స్వరూప్‌కు ఓ గుర్తింపు ఉంది. గ్రాడ్యుయేషన్ చేసిన శాంతి స్వరూప్.. 1978లోనే దూరదర్శన్‌లో చేరారు. అయితే యాంకరింగ్ చేసేందుకు ఆయన ఐదేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 1983 నవంబర్ 14వ తేదీన ప్రసారమైన దూరదర్శన్ తెలుగు తొలి బులిటెన్ వార్తల్ని చదివి వినిపించారాయన. టెలి ప్రాంప్టర్(ఎదురుగా స్క్రీన్ మీద చూసి..) లేని రోజుల్లో స్క్రిప్ట్ పేపర్లనే బట్టీ పట్టి వార్తలు వినిపించడంలో ఆయన ఆరి తేరారు. అలా పదేళ్ల పాటు స్క్రిప్ట్పేపర్లతోనే వార్తలు చదువుతూ వచ్చారు. దూరదర్శన్‌లో 2011 లో పదవీ విరమణ చేసే వరకూ ఆయన వార్తలు చదివారు. చాలా మంది న్యూస్ రీడర్లు శాంతి స్వరూప్‌ను తమ గురువుగా భావిస్తుంటారు. అయితే 24/7 పేరిట న్యూస్ రంగంలో తర్వాతి కాలంలో వచ్చిన మార్పుల్ని ఆయన స్వాగతించలేకపోయారు. వార్తలు చదవకండి.. వార్తలు చెప్పండి.. అని తర్వాతి తరం యాంకర్లకు సూచించారాయన. శాంతి స్వరూప్ సతీమణి రోజా రాణి కూడా న్యూస్ రీడర్. 1980లో వీళ్ల వివాహం జరగ్గా.. వీళ్లకు ఇద్దరు సంతానం విదేశాల్లో స్థిరపడ్డారు. సాహిత్యంపై పట్టున్న శాంతి స్వరూప్.. భోపాల్ గ్యాస్ దుర్ఘటన మీద ‘‘రాతి మేఘం’ అనే నవల రాశారు. క్రికెట్ మీద మక్కువతో ‘క్రేజ్’, సతీ సహగమన దురాచారానికి వ్యతిరేకంగా ‘అర్ధాగ్ని’ అనే నవల రాశారాయన. యాంకరింగ్‌లో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. శాంతి స్వరూప్ మృతిపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ‘‘తొలి తరం న్యూస్ రీడర్ గా అందరికీ సుపరిచితులైన శాంతి స్వరూప్ గారి మృతి బాధాకరం. సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్ ద్వారా ఆయన అందించిన సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని హరీష్ రావు అన్నారు. -
geetanjali iyer: ప్రముఖ యాంకర్ కన్నుమూత
గీతాంజలి అయ్యర్(70).. దేశంలోని మొట్టమొదటి మహిళా న్యూస్ ప్రెజెంటర్. సుమారు 30 ఏళ్ల పాటు దూరదర్శన్‌లో న్యూస్ రీడర్ పని చేసిన ఆమె ఇక లేరు. బుధవారం వాకింగ్ చేసి ఇంటికొచ్చిన ఆమె కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఆమె మృతిని కుటుంబ సభ్యులు ప్రకటించారు.గత కొంతకాలంగా పార్కిన్సన్స్తో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1971లో దూరదర్శన్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా చేరిన ఆమె.. ఆంగ్లంలో వార్తలు చదివిన తొలి ప్రజెంటర్ కూడా. నేషనల్ బులిటెన్‌తో దేశవ్యాప్తంగా ఆమె మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అంతేకాదు.. నాలుగు సార్లు ఉత్తమ యాంకర్ అవార్డు అందుకున్నారు. మీడియా రంగంలో సేవలకుగానూ గీతాంజలి.. 1989లో అవుట్‌స్టాండింగ్ విమెన్ అవార్డుగా ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డు అందుకున్నారు.వరల్డ్ వైడ్ వైల్డ్‌లైఫ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్)తో కలిసి పనిచేశారు. గీతాంజలి మృతి విషయం తెలిసిన పలువురు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు నివాళులు అర్పిస్తున్నారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సైతం ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. గీతాంజలి అయ్యర్.. కోల్‌కతా లోరెటో కాలేజీలో ఆంగ్లంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారామె. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా డిప్లోమా సైతం పూర్తి చేశారు. దూరదర్శన్ కెరీర్ ముగిశాక.. కార్పొరేట్ రంగం వైపు అడుగులు వేశారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో పని చేసిన ఆమె.. ఖాందాన్ అనే సీరియల్లోనూ చివరిసారిగా నటించారు. గీతాంజలికి ఇద్దరు పిల్లలు. కూతురు పల్లవి కూడా అవార్డ్ విన్నింగ్ జర్నలిస్ట్ కూడా. My heartfelt condolences to the family of Geetanjali AyyarJi. Saddened to know that one of the best Doordarshan news presenters of yesteryears Geetanjali Ji passed away. She was a role model for news presenters .. May her soul rest in Peace pic.twitter.com/46ZKScrZ5R — Vijayasai Reddy V (@VSReddy_MP) June 8, 2023 Gitanjali Aiyar, India’s one of the best tv newsreaders, warm and elegant person and woman of immense substance passed away today. Deepest condolences to her family. 🙏 pic.twitter.com/4q1C6vFHbh — Sheela Bhatt शीला भट्ट (@sheela2010) June 7, 2023 -
North Korea: కిమ్ సంచలన నిర్ణయం.. ఆనందంలో నార్త్ కొరియన్లు
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఏది చేసినా ప్రపంచవ్యాప్తంగా సంచలనే అవుతుంది. ఇప్పటికే ఎన్నోసార్లు తన వైఖరితో వార్తల్లో ట్రెండింగ్‌లో నిలిచిన కిమ్.. మరోసారి సోషల్ మీడియాలో నిలిచారు. ఇంతకీ ఈసారి ఏం చేశారంటే.. ఉత్తర కొరియా అధికారిక టీవీ ఛానల్ యాంకర్ రీ చున్ హీకి(79).. కిమ్ జోంగ్ ఉన్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఆమె కోసం పాంగ్యాంగ్లో నిర్మించిన విలాసవంతమైన ఇంటిని స్వయంగా కిమ్ అందజేశారు. ఆమె మెట్లు ఎక్కడంలో ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు సైతం ఏర్పాటు చేపించినట్టు ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది. అయితే, ఉత్తర కొరియా, అధికారిక పార్టీ కోసం యాంకర్ రీ చున్ హీకి గత 50 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. కొరియా సంప్రదాయ వస్త్రధారణలో ఉండే రీ చున్.. దేశ అవసరాలకు తగ్గినట్టుగా తన స్వరాన్ని మార్చుకుంటూ యాంకరింగ్ చేస్తున్నారు. ఉత్తర కొరియాకు సంబంధించిన కీలక వార్తలన్నింటినీ ప్రజలకు తెలియచేసే రీ చున్ హీ.. విదేశీయులకూ సైతం సుపరిచితమే. కేసీఎన్ఏ టీవీ ఛానల్లో వార్తలు చదువుతూ ఆమె ‘పింక్ లేడీ’గా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, ప్రజల్లో దేశభక్తిని ఉప్పొంగించేందుకు భావోద్వేగభరితంగా, ఒకప్పటి దేశాధినేత మరణం మొదలు.. ప్రస్తుత నియంత కిమ్ జోంగ్ ఉన్ జరిపే అణు పరీక్షలు వరకు.. ఉత్తర కొరియాకు సంబంధించిన అన్ని కీలక వార్తలను సందర్భాన్ని బట్టి స్వరాన్ని మారుస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో ఆమెకు సేవలను గుర్తించిన కిమ్.. ఇలా బహుమానం అందించారు. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ.. రీ చున్‌కు అధికార పార్టీ రుణపడి ఉంటుంది. ఆమె ఆరోగ్యంగా ఉంటూ పార్టీ కోసం ఇదే ఉత్సాహంతో పనిచేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఈ క్రమంలో ఆనందం వ్యక్తం చేసిన రీ చున్ హీ.. కిమ్ ఉదారతకు తన కుటుంబ సభ్యులు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారని ఉద్వేగంగా తెలిపారు. ఇదిలా ఉండగా.. రీ చున్‌తో పాటు పార్టీ కోసం పని చేస్తున్న దాదాపు 10వేల మందికి కూడా కిమ్.. విలాసవంతమైన ఇళ్లను కానుకగా అందజేశారు. — The International Magazine (@TheIntlMagz) April 14, 2022 -
న్యూస్ రీడర్‌గా రమా రాజమౌళి.. వీడియో వైరల్
అపజయం ఎరుగని డైరెక్టర్లలో రాజమౌళి ముందుంటారు. ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. వంద శాతం సక్సెస్ ఫార్ములాతో దూసుకుపోతూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇక రాజమౌళితో పాటు ఆయన కుటుంబంలో పలువురు ఇండస్ట్రీకి చెందినవారే. కీరవాణి, విజేంద్ర ప్రసాద్, కార్తికేయ.. ఇలా పలువురు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక రాజమౌళి భార్య రమా రాజమౌళి ఆయన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలె ఆమె ఫ్రొఫెషన్కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. రమా రాజమౌళి ఇంతకుముందు న్యూస్ రీడర్‌గా పనిచేశారంటూ ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. అయితే ఆమె న్యూస్ రీడర్‌గా చేసింది కేవలం సీరియల్లో ఓ పాత్ర కోసం మాత్రమే. నిజ జీవితంలో ఆమె న్యూస్ రీడర్‌గా పనిచేయలేదు. గతంలో ఓ ఛానెల్లో అమృతం అనే సీరియల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సీరియల్ అప్పట్లో సూపర్ డూపర్ హిట్. గుణ్ణం గంగరాజు తెరకెక్కించిన ఈ సీరియల్లో రాజమౌళి అన్నయ్య కాంచి కూడా నటించారు. ఆయనతో పాటు రాజమౌళి కుటుంబ సభ్యులు కూడా ఈ సీరియల్ కోసం పని చేశారు. అదే సమయంలో రాజమౌళి భార్య రమా రాజమౌళి ఆ సీరియల్లో న్యూస్ రీడర్‌గా కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. చదవండి : RRR: ఆర్ఆర్ఆర్ వచ్చేది ఈ అక్టోబరులోనే! RRR Movie: ఫైట్ సీన్‌కి కన్నీళ్లొస్తాయి! -
పార్వతీ ప్రసాద్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, హైదరాబాద్ : ఆకాశవాణి న్యూస్ రీడర్ పింగళి పార్వతీ ప్రసాద్(70) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆకాశవాణి, దూరదర్శన్ లో ఆమె సేవలు నిరుపమానమని కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. కాగా, కొన్ని రోజులగా అనారోగ్యంతో బాధపడుతున్న పార్వతీ ప్రసాద్ ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆకాశవాణి కేంద్రంలో వార్తలు చదవడంలో ఆమెకి పెట్టిందిపేరు. వినసొంపైన కంఠస్వరంతో ప్రతి అక్షరమూ శ్రోతలకు స్పష్టంగా వినబడాలని తపించే పింగళి పార్వతీ ప్రసాద్ ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు. ఆకాశవాణిలో కార్యక్రమ నిర్మాణంతో ప్రారంభించి వార్తా విభాగంలో సీనియర్ న్యూస్ రీడర్ గా దాదాపు 35 ఏళ్లపాటు సేవలు అందించారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు అడిగే ప్రశ్నలకు ఎంతో హుందాగా చిరునవ్వు తో సమాధానం చెప్పేవారు. వార్తా ప్రపంచం మీదే, భవిష్యత్ తరాలు మీరే అంటూ జూనియర్స్‌ను ప్రోత్సహించే వారు. ఆమె దగ్గరికి వచ్చిన వారికి వార్తా పఠనంలోని మెళకువలను వివరించేవారు. -
రేడియో వెంకట్రామయ్య కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: గంభీరమైన గళం, స్పష్టమైన ఉచ్ఛారణ, సరళమైన భాషతో ‘ఆకాశవాణి వార్తలు చదువుతున్నది డి.వెంకట్రామయ్య’అంటూ హైదరాబాద్ రేడియో స్టేషన్ కేంద్రంగా మూడున్నర దశాబ్దాలు వివిధ హోదాల్లో పనిచేసిన రేడియో న్యూస్ రీడర్ డి.వెంకట్రామయ్య (78) కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ కూకట్‌పల్లిలో సినిమా చూసి వస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలారు. రేడియో అనౌన్సర్‌గా 1963 నవంబర్‌లో ఆకాశవాణిలో చేరిన ఆయన న్యూస్ రీడర్‌గా చాలా కాలం పనిచేశారు. నాటక రచయితగా, కథా రచయితగా మంచి పేరు సంపాదించారు. ఆయన రేడియో అనుభవాలు, వెంకట్రామయ్య కథల పేరుతో రెండు పుస్తకాలు వెలువరించారు. వెంకట్రామయ్య ఆకస్మిక మరణంపై హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన అంత్యక్రియలు మంగళవారం ఉదయం 11 గంటలకు అమీర్‌పేట ఈఎస్ఐ స్మశానవాటికలో నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం ఆకాశవాణి మాజీ న్యూస్ రీడర్ డి.వెంకట్రామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో వివిధ విభాగాలలో ఆయన చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. వెంకట్రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
అచ్చతెలుగు కన్నడమ్మాయి
చిలిపితనం, అమాయకత్వం, అందం కలబోస్తే.. మేఘన! కన్నడ దేశంలో పుట్టిన ఈ అమ్మాయి ‘శశిరేఖ’గా టీవీ వీక్షకుల మదిని దోచుకున్నారు. మంగ, నిత్య పాత్రలతో భిన్న పాత్రలను పోషిస్తున్నారు. కథానాయికగాను, ప్రతికథానాయికగానూ నటనలో వైవిధ్యం చూపుతున్నారు. ఈ విలక్షణ నటితో ఆమె ‘టీవీయానం’ గురించి సాక్షి ముచ్చటించింది. మేఘన.. ‘ఆలీబాబా 40 దొంగలు’ అనే కన్నడ నాటకంలోని కథానాయిక ‘హసీనా’ పాత్రతో మొట్టమొదటిసారిగా రంగస్థలం మీద కనిపించారు. తర్వాత ‘రాబిన్‌హుడ్’ నాటకంలో నటించారు. మండ్యా రమేశ్ స్థాపించిన ‘నటన’ రంగ మందిరంలో తన ఎనిమిదవ ఏటనే చేరి స్టేజ్ నాటకాల కోసం నటనలో శిక్షణ పొందారు. ఈ రోజు తాను టీవీ తారను కావడానికి కారణం తన గురువు గారేనంటారు మేఘన. ‘‘నేను పుట్టింది మైసూరులో. అక్కడే పెరిగాను, అక్కడే చదువుకున్నాను. ప్రస్తుతం అమ్మ, అన్నయ్య, అమ్మమ్మ, నేను మైసూరులోనే ఉంటున్నాం’ అని వారి ఫ్యామిలీ గురించి మరిన్ని వివరాలు చెప్పారు మేఘన. బెస్ట్ న్యూస్ ఫేస్ ‘‘నేను ఈ రోజు నటిని అయ్యానంటే రమేశ్గారే కారణం. మా అమ్మ, నాన్న కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. మా కుటుంబంలో అందరూ ఉన్నత చదువులు చదువుకున్నవారే. నేను మాత్రమే మధ్యలో నటన వైపు మళ్లాను. నాకు 14 సంవత్సరాలు వచ్చేవరకు రంగస్థలం మీదే ఉన్నాను. స్కూల్లో కంటే ‘నటన’ సంస్థలోనే ఎక్కువసేపు ఉండేదాన్ని. అయితే నాకై నేను ఎప్పుడూ యాక్టర్‌ని కావాలి అనుకోలేదు. ఇంట్లో అందరికీ కళలంటే అభిమానం. అందువల్ల నాకు ప్రోత్సాహం లభించి ఉంటుంది. మొత్తం 250 నాటక ప్రదర్శనలిచ్చాను. డిగ్రీ చదువుతుండగా తొలిసారి కన్నడ సీరియల్లో అవకాశం వచ్చింది. ఒక భక్తి సీరియల్లో అది సపోర్టింగ్ పాత్ర. ఆ సీరియల్‌కి ‘బెస్ట్ న్యూ ఫేస్’ అవార్డు వచ్చింది. ఆ తరవాత కన్నడలోనే రెండు సీరియల్స్ చేశాను. కొద్ది రోజులకే తెలుగులో అవకాశం వచ్చింది. ‘శశిరేఖా పరిణయం’ సీరియల్ కోసం తెలుగులో అన్నపూర్ణ సంస్థ వాళ్లు పిలిపించారు. ‘‘నాన్నగారికి ఇష్టం లేకపోయినా నా ఉత్సాహం చూసి సరేనన్నారు. మా అమ్మమ్మ నాగరత్నం ఈ రోజు వరకు నాతో షూటింగులకు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ‘జీ’ తెలుగులో ‘కల్యాణ వైభోగమే’ చేస్తున్నాను. చూసే ఉంటారు ఇందులో మంగ, నిత్య రెండూ నేనే. నెగెటివ్ అండ్ పాజిటివ్. ఇప్పుడు ‘రక్తసంబంధం’ అనే కొత్త సీరియల్ వస్తోంది’’ అని చెప్పారు మేఘన. అటొక అడుగు ఇటొక అడుగు తండ్రి అనారోగ్యం రీత్యా చాలాకాలం షూటింగ్ కోసం మైసూరు, హైదరాబాద్ మధ్య ప్రయాణాలు చేశారు మేఘన. అందువల్ల కొన్నిసార్లు షూటింగులకు వెళ్లలేకపోయేవారు. దాంతో నటనకు కొంతకాలం విరామం వచ్చింది. ‘‘కిందటి సంవత్సరం నాన్నకి క్యాన్సర్ బయపడింది. సీరియల్స్ చేస్తూ నాన్నను చూసుకోవలసి వచ్చింది. యూనిట్ సహకరించడం వల్లనే మధ్య మధ్యలో మైసూరు వెళ్లి నాన్నని చూసి వచ్చేందుకు వీలైంది. ఓసారి మనసు ఉండబట్టలేక, నాన్న దగ్గర పది రోజులు ఉందామని బయలుదేరాను. కాని మైసూరు వచ్చి ఆసుపత్రిలో ఆయనను చేర్చే లోపే అంతా జరిగిపోయింది. చివరి రోజుల్లో నాన్న దగ్గర ఎక్కువరోజులు ఉండలేకపోయాననే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. ఆ బాధను మరచిపోలేకపోయాను చాలాకాలం’’ అని తండ్రిని గుర్తు చేసుకున్నారు మేఘన. తెలుగు వారే ఆదరించారు బిజీగా ఉంటే కోలుకోవచ్చుననే ఉద్దేశంతో మళ్లీ సీరియల్స్ ఒప్పుకున్నారు. నాలుగైదు రోజులకి ఒకసారి మైసూరు వెళ్లి వస్తున్నారు. తెలుగు సీరియల్స్‌లో బిజీగా ఉండటం వల్ల తెలుగు చిత్రాలకు, కన్నడ సీరియల్స్‌కు చెయ్యలేకపోతున్నారు. ‘‘నన్ను తెలుగు వారు బాగా ఆదరించారు. ‘శశి బి టెక్’ గా నేను పాపులర్ అయ్యాను. అందరూ తెలుగింటి ఆడపడుచుననే అనుకుంటున్నారు’’ అని సంతోషంగా చెప్పారు మేఘన. పరిశ్రమలో ఇంతవరకు తాను ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని, పరిశ్రమ నుంచి పిలుపు అందుకుని, వచ్చిన పాత్రలు మాత్రమే చేస్తున్నాననీ చెప్పారు. – పురాణపండ వైజయంతి -
లైవ్‌లోనే న్యూస్ రీడర్ల మధ్య వాగ్వాదం
ఇస్లామాబాద్ : లైవ్‌లోనే ఇద్దరు న్యూస్ రీడర్లు వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి నెట్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ‘ఈమెతో నేనేలా బులిటెన్ చదవాలి?’ అంటూ యాష్ ట్యాగ్‌తో ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ న్యూస్ ఛానెల్ వీడియో అది. లాహోర్‌కు చెందిన సిటీ 42 ఛానెల్ న్యూస్ రీడర్లు ఈ వాగ్వాదానికి దిగారు. ‘ఈమెతో నేనెలా బులిటెన్ చదవాలి అంటూ మేల్ న్యూస్ రీడర్ మొదలుపెట్టగా.. తనతో మాట్లొద్దంటూ ఆమె చెప్పటం.. ఆపై నేను నీ గొంతు గురించి మాట్లాడుతున్నా అంటూ అతను బదులివ్వటం.. గౌరవమిచ్చి మాట్లాడమంటూ ఆమె అనటం... అలా ఆ మాటల యుద్ధం అలాగే కొనసాగటం చూడొచ్చు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ కాగా.. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు కామెంట్ చేస్తున్నారు. ‘ఈ గొడవ అయ్యాక వారిద్దరు డిన్నర్‌కు వెళ్తారని ఒకరంటే.. ఆమె గొంతు అంత దారుణంగా ఏం లేదని మరికొందరు.. ఇక ఆమెకు పెళ్లయ్యి ఉంటే ఆమెను భరిస్తున్న భర్తకు జోహార్లు అంటూ ఇంకొందరు... ఛానెల్ వాళ్లు వీళ్లతో ఎలా వేగుతున్నారో అంటూ మరికొందరు... జోకులు పేలుస్తున్నారు. వీడియో ఎలా బయటకు వచ్చిందో స్పష్టత లేకపోయినా ఫేస్బుక్ లో అది ఇప్పుడు షేర్ల మీద షేర్లతో తెగ వైరల్ అవుతోంది. -
‘సాక్షి’ న్యూస్ రీడర్‌కు పురస్కారం
వివేక్‌నగర్: వార్తల సేకరణ, వాటిని చదవటం కష్టమైన పని అని, న్యూస్‌రీడర్స్‌కు స్పష్టమైన ఉచ్చారణ, సమయస్ఫూర్తి ముఖ్యమని తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య అన్నారు. ఆరాధన సంస్థ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం శ్రీత్యాగరాయ గానసభలో జరిగిన టీవీ న్యూస్ రీడర్స్ పురస్కారాల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగిం చారు. ఈ సందర్భంగా సాక్షి టీవీ న్యూస్ రీడర్ సిద్ధేశ్వరరెడ్డిని ఉత్తమ న్యూస్ రీడర్ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఇదే వేదికపై వివిధ తెలుగు టీవీ చానళ్లకు చెందిన టీవీ న్యూస్ రీడర్లకు ఉత్తమ న్యూస్ రీడర్స్ పురస్కారం ప్రదానం చేశారు. సీనియర్ న్యూస్ రీడర్స్ దీప్తి వాజ్‌పేయి, నాగశ్రీలను స్వర్ణ ప తకాలతో సత్కరించారు. సభలో సాహితీవేత్త డా. ద్వా.నా శాస్త్రి,గుదిబండి వెంకటరెడ్డి, వైకే నాగేశ్వరరావు, న్యూస్ రీడర్ కోట విజయలక్ష్మి, జి.హనుమంతరావు, జయప్రకాష్‌రెడ్డి, అ వార్డు గ్రహీతలు ప్రసంగించారు. సభ ప్రారంభానికి ముందు జరిగిన సినీ సంగీత విభావరి ఆహూతులను అలరించింది.