
సాక్షి, హైదరాబాద్ : ఆకాశవాణి న్యూస్ రీడర్ పింగళి పార్వతీ ప్రసాద్(70) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆకాశవాణి, దూరదర్శన్ లో ఆమె సేవలు నిరుపమానమని కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. కాగా, కొన్ని రోజులగా అనారోగ్యంతో బాధపడుతున్న పార్వతీ ప్రసాద్ ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆకాశవాణి కేంద్రంలో వార్తలు చదవడంలో ఆమెకి పెట్టిందిపేరు. వినసొంపైన కంఠస్వరంతో ప్రతి అక్షరమూ శ్రోతలకు స్పష్టంగా వినబడాలని తపించే పింగళి పార్వతీ ప్రసాద్ ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు. ఆకాశవాణిలో కార్యక్రమ నిర్మాణంతో ప్రారంభించి వార్తా విభాగంలో సీనియర్ న్యూస్ రీడర్ గా దాదాపు 35 ఏళ్లపాటు సేవలు అందించారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు అడిగే ప్రశ్నలకు ఎంతో హుందాగా చిరునవ్వు తో సమాధానం చెప్పేవారు. వార్తా ప్రపంచం మీదే, భవిష్యత్ తరాలు మీరే అంటూ జూనియర్స్‌ను ప్రోత్సహించే వారు. ఆమె దగ్గరికి వచ్చిన వారికి వార్తా పఠనంలోని మెళకువలను వివరించేవారు.
Comments
Please login to add a commentAdd a comment