భారీ టెలిస్కోప్‌ను సిద్ధం చేస్తున్న చైనా
ప్రపంచంలోనే అతి పెద్ద రేడియో టెలిస్కోపును చైనా సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది. దీని నిర్మాణానికి మొత్తం 1,244 కోట్ల రూపాయల ఖర్చవుతోంది. 500 మీటర్ల వ్యాసంతో, భారీ యంత్రాలతో గుజ్హౌ రాష్ట్రంలో ఈ నిర్మాణం చేపట్టారు. 'ఫైవ్ హండ్రెడ్ మీటర్ ఎపర్చర్ స్ఫెరికల్ టెలిస్కోప్' (ఫాస్ట్) అనే పేరున్న ఈ టెలిస్కోప్.. దాదాపు 30 ఫుట్‌బాల్ మైదానాలను కలిపితే ఎంత అవుతుందో.. అంత పరిమాణంలో ఉంటుంది. ఈ అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణానికి చైనా ఐదేళ్ల సమయం తీసుకుంది. 2016 సెప్టెంబర్ నాటికి దీని నిర్మాణం పూర్తవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇందులోని రిఫ్లెక్టర్ డిష్ ప్రపంచం అంతటి నుంచి సిగ్నల్స్ అందుకుంటుంది. 2003లో తొలిసారిగా దీనికి సంబంధించిన ప్రతిపాదన వచ్చింది. దీని బాడీ 500 మీటర్ల వ్యాసం ఉండటంతో.. దీనిచుట్టూ నడిచేందుకు 40 నిమిషాల సమయం పడుతుంది. ఈ టెలిస్కోపులో మొత్తం 4,500 ప్యానళ్లుండగా.. వాటిలో చాలావరకు త్రికోణాకారంలో ఉంటాయి. సైడ్ ప్యానెల్స్ 11 మీటర్ల పొడవు ఉన్నాయి. ఇప్పటివరకూ టెలిస్కోప్‌లోని ముఖ్యమైన దశలు పూర్తయ్యాయని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ చీఫ్ సైంటిస్ట్ లీ డి వెల్లడించారు.
ఈ టెలిస్కోప్ డిజైన్ అర్థం చేసుకోవడం అంత కష్టం ఏమీ కాదని, ఇది దాదాపు ఓ పెద్ద టీవీ యాంటెనాలాగే ఉంటుందని ఆయన చెప్పారు. సిగ్నళ్లు అందుకునే ప్రాంతం ఎక్కువగాను, మరింత సౌకర్యంగాను ఉండటంతో.. ఇప్పటికే పనిచేస్తున్న 'అరెసిబో' టెలిస్కోప్ కంటే రెండు రెట్లు ఎక్కువ పరిమాణంలో ఆకాశాన్ని స్కాన్ చేస్తుందన్నారు. అలాగే సున్నితత్వం కూడా 3-5 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. దీంతో.. పాలపుంతలో ఇప్పటివరకు ఎవరికీ తెలియని కొత్త నక్షత్రాలను కనుక్కోవడం సాధ్యమవుతుందని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన లిస్టర్ స్టావెలీ స్మిత్ అనే అంతరిక్ష శాస్త్రవేత్త తెలిపారు.