ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసం భారత్‌లోనే ఉందన్న విషయం మీకు తెలుసా? గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా ప్రాంతంలో ఉంది. బరోడా గైక్వాడ్స్ యాజమాన్యంలో ఉన్న లక్ష్మీ విలాస్ ప్యాలెస్ (Laxmi Vilas Palace) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసం. ఇది ఇంగ్లండ్ రాజ కుటుంబీల నివాసమైన బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే చాలా రెట్లు పెద్దది.
500 ఎకరాల విస్తీర్ణం
లక్ష్మీ విలాస్ ప్యాలెస్ బరోడా రాజ కుటుంబానికి చెందిన నివాసం. ఈ ప్యాలెస్ 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. 19వ శతాబ్దపు ఇండో-సార్సెనిక్ కాలంలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించారు. ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద ప్రైవేట్ నివాసాల్లో ఇదే అతి పెద్దది. ఇంగ్లండ్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దది.
ఆకట్టుకునే కళాకృతులు
గుజరాత్‌లోని ఈ రాజ యుగం నాటి ప్యాలెస్‌లో విస్తృతమైన ఇంటీరియర్ డిజైన్లు ఆకట్టుకుంటాయి. మొజాయిక్‌లు, షాన్డిలియర్లు, కళాకృతులు, ఆయుధాలు, కళాకృతులు ఆకర్షిస్తాయి. అప్పటి బరోడా మహారాజు ప్రముఖ కళాకారుడు రాజా రవి వర్మను ప్రత్యేకంగా నియమించి పెయింటింగ్‌లు వేయించారు. విశాలమైన పార్క్ లాంటి మైదానాలు ఇందులో ఉన్నాయి. ఇందులో గోల్ఫ్ కోర్స్ కూడా ఉండటం విశేషం.
ఈయనే యజమాని
లక్ష్మీ విలాస్ ప్యాలెస్ యజమాని హెచ్‌ఆర్‌హెచ్ సమర్జిత్‌సిన్హ్ గైక్వాడ్ ( HRH Samarjitsinh Gaekwad). రంజిత్‌సిన్హ్ ప్రతాప్‌సిన్హ్ గైక్వాడ్, శుభంగినీరాజేల ఏకైక కుమారుడు. 1967 ఏప్రిల్ 25న జన్మించిన ఈయన మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్. డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్‌లో చదువుకున్నారు. సమర్జిత్‌సిన్హ్ తన తండ్రి మరణం తర్వాత 2012లో మహారాజుగా పట్టాభిషక్తుడయ్యారు. ఈ వేడుక లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో 2012 జూన్ 22న అట్టహాసంగా జరిగింది.
2013లో తన మామ సంగ్రామ్‌సింగ్ గైక్వాడ్‌తో పాత వారసత్వ వివాదాన్ని పరిష్కరించుకుని లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌కు యజమాని అయ్యారు. రూ. 20,000 కోట్లకు పైగా ఆస్తి సంక్రమించింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లోని బనారస్‌లో 17 దేవాలయాలను నిర్వహించే దేవాలయాల ట్రస్టు సమర్జిత్‌సిన్హ్ ఆధీనంలో ఉంది. 2014లో బీజేపీలో చేరిన ఈయన 2017 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. సమర్జిత్‌సిన్హ్ వాంకనేర్ రాష్ట్ర రాజకుటుంబానికి చెందిన రాధికారాజేని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.
Comments
Please login to add a commentAdd a comment