"బెహెనోం..ఔర్ భాయియోం.. మై హూం ఆప్‌కా దోస్త్.. అంటూ శబ్ద తరంగాలపై తేలియాడుతూ కొంత గంభీరంగా మరింత శ్రావ్యంగా మోగిన ఆ స్వరం 70వ చివరిదాకా పరిచయం లేనివారు ఉంటారా అసలు. ప్రతి బుధవారం రాత్రి 8గం.లకు రేడియో సిలోన్ లో బినాకా గీత్ మాలా లక్షలాది ఇళ్లలో మారుమోగిన సూపర్ హిట్ షో. అమీన్ సయానీ గొంతు వినటం ఒక మరపురాని జ్ఞాపకం. ఆహా..అంటూ హిందీ చిత్రగీతాలను పరిచయం చేస్తూ సాగిన ఆ స్వరం దశాబ్దాల తరబడి భావి తరాలకు స్ఫూర్తినిచ్చింది. తన గాత్రంతో ప్రజల గుండె చప్పుడును పెంచిన ప్రపంచ స్వర మాంత్రికుడు. ఆకాశవాణిలో అమీన్ సయానీ గోల్డెన్ వాయస్ ఒక మ్యాజిక్. 91 ఏళ్ల వయసులో గుండెపోటు రావడంతో ఆయన శాశ్వతంగా కన్నుమూశారు. ఆయన మరణం తీరని లోటు.. ఒక స్వర్ణ యుగం ముగిసిందంటూ అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు.
మైక్‌లో కూల్‌గా, సాధారణంగా మృదువైన టోన్‌తో 54,000కి పైగా రేడియో ప్రోగ్రామ్‌లు, జింగిల్స , స్పాట్‌లను అందించిన అద్భుతమైన వ్యక్తి అమీన్ సయానీ. 1952లో ప్రారంభమైన బినాకా గీత్‌మాల 70ల చివరినాటికి, వారానికోసారి 21 కోట్ల మంది ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంది. వారానికి 65వేలకు పైగా సంచుల కొద్దీ ఉత్తరాలొచ్చేవంటే ఆయన ప్రతిభను అర్థం చేసుకోవచ్చు.
రేడియో సూపర్‌స్టార్ కేవలం 13 ఏళ్లకే బాంబేలో ఆల్ ఇండియా రేడియో (AIR)కి ఆంగ్ల భాషా వ్యాఖ్యాతగా పనిచేశారు. 1952లో, బాలకృష్ణ విశ్వనాథ్ కేస్కర్‌ను ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ భారతదేశ సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగా నియమించారు. కేస్కర్ భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో హిందీ-భాషా సినిమా పాటల పట్ల మోజు చూపలేదు. హిందీ పాటల ప్రసార సమయాన్ని 10శాతం కోటాకు పరిమితం చేసి తరువాత పూర్తిగా నిషేధించాడు.
ఆ రోజుల్లో భారతదేశంలో పనిచేస్తున్న ఒక అమెరికన్ వ్యాపారవేత్త డేనియల్ మోలినా సయాని సోదరుడు హమీద్‌ను తన సిలోన్ రేడియో కార్యకలాపాలకోసం ఎంపిక చేశారు. ఇంతలో ఆల్ ఇండియా రేడియో హిందీ విభాగం ఆడిషన్ తర్వాత, ఇంగ్లీష్, గుజరాతీకి సంబంధించిన యాస ఉందంటూ అమీన్‌ను తిరస్కరించారు. దీంతో సిలోన్ రేడియోలో ఉద్యోగం కోసం సోదరుడిని అడిగాడు. ఆకాశవాణి తిరస్కరించి కదా అంటూ ఆయన కూడా నిరాకరించాడు. అయితే అంత తేలిగ్గా వదులుకునే వ్యక్తి కాదు సయానీ. పట్టు వీడ లేదు. ఆ సమయంలో అమీన్‌కి ‘ఓవల్టీన్‌ఫుల్వారీ’ కార్యక్రమంలో అనౌన్సర్‌గా ఉద్యోగం వచ్చింది. తన మధురమైన గాత్రం, తనదైన శైలితో ప్రేక్షకులను కట్టి పడేసే వారు. తరువాత 1952లో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని లెజెండ్‌గా అవతరించాడు. అలాగే తనను తిరస్కరించిన ఆల్ ఇండియా రేడియోలో అత్యంత ఇష్టపడే అనౌన్సర్‌గా నిలవడం విశేషం.
1952లో ‘బినాకాగీత్‌మాల’ సంచలనాలు నమోదు చేసింది. సయానీన షోను స్వీడిష్ కంపెనీ సిబా టూత్‌పేస్ట్ బ్రాండ్ బినాకా స్పాన్సర్ చేసింది. అదృష్టవశాత్తూ గీతమాల కార్యక్రమం 1989 - 1990ల మధ్య ఆల్ ఇండియా రేడియో (AIR)లోని వివిధ్ భారతికి మారింది.
ఇటీవల హిందీ-భాషా సినిమా స్వర్ణయుగం సంగీత హక్కులను కలిగి ఉన్న సరేగామ, దశాబ్దాల ప్రోగ్రామ్ చరిత్రలోని ముఖ్యాంశాలను కవర్ చేసిన “అమీన్ సయానీ ప్రెజెంట్స్ గీత్మాలా కి ఛాన్ మే” పేరుతో 10 సంపుటాలను విడుదల చేసింది.ఈ పాటలతో పాటు, లతా మంగేష్కర్, కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ, ముఖేష్, మన్నా డే, అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, రాజ్ కపూర్, శశి కపూర్ , మరెంతో మంది గొప్ప వ్యక్తులతో సయానీ ఇంటర్వ్యూలు ఇందులో ఉన్నాయి.
అవార్డులు, రివార్డులు
అమీన్‌సయానీని 2009లో పద్మశ్రీ అవార్డ్ వరించింది. 2006లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ నుండి లివింగ్ లెజెండ్ అవార్డు 2003లో ఇండియా రేడియో ఫోరమ్, రేడియో మిర్చి నుంచి కాన్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో పాటు వంటి అనేక అవార్డులను అందుకున్నారు. "బినాకా గీతమాల" కు అత్యుత్తమ రేడియో కార్యక్రమంగా 2000లో బొంబాయి అడ్వర్టైజింగ్ క్లబ్ గోల్డెన్ అబ్బి, ఇండియన్ అకాడమీ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఫిల్మ్ ఆర్ట్ నుండి 1993లో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు, 1992లో పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, 1991లో ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్స్ నుండి అప్పటి భారత ఉపరాష్ట్రపతి K.R. నారాయణన్ చేతుల మీదుగా బంగారు పతకాన్నిఅందుకున్నారు.
అంతర్జాతీయ ఖ్యాతి
ఆయన గళం ఆసియా దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని 'బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ఎత్నిక్ నెట్‌వర్క్'లో ప్రసారమయ్యే "మినీ ఇన్సర్షన్స్ ఆఫ్ ఫిల్మ్ స్టార్ ఇంటర్వ్యూస్", బీబీసీవరల్డ్ సర్వీస్ రేడియోలో మిలియన్స్", లండన్‌లోని 'సన్‌రైజ్ రేడియో'లో ప్రసారమయ్యే "వీటీకా హంగామా"కు నాలుగున్నరేళ్లు, UAEలోని 'రేడియో ఉమ్ముల్‌క్వైన్'లో ప్రసారమవుతున్న "గీత్మాలా కి యాదీన్" నాలుగేళ్లుగా, "యే భీచంగావో భీఖూబ్" 'రేడియో ఆసియా',దుబాయ్‌లో ఎనిమిది నెలల పాటు, టొరంటో, వాషింగ్టన్, హ్యూస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్ బోస్టన్‌లలోని 'జాతి రేడియో స్టేషన్‌ల'లో మొత్తం రెండున్నర సంవత్సరాల పాటు, దక్షిణాఫ్రికా దేశం స్వాజిలాండ్ ఇలా మరెన్నో ఆయన కరియర్‌లో మైలు రాళ్లు.
సినిమాల్లోనూ..
అమీన్ సయాని భూత్ బంగ్లా, బాక్సర్, తీన్ డెవియన్ , ఖత్ల్‌తో సహా సినిమాల్లో అనౌన్సర్‌గా కనిపించారు. 1960-62లో టాటా ఆయిల్ మిల్స్ లిమిటెడ్‌లో బ్రాండ్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పనిచేశాడు. ఆయన భార్య రమా మట్టు కూడా ప్రముఖ గాయని, వాయిస్ ఆర్టిస్ట్.
ఎక్కడ పుట్టారు
1932 డిసెంబర్ 21 న ముంబైలో జన్మించారు అమీన్ సయానీ . ముంబైలోని న్యూ ఎరా స్కూల్‌లో అతని పాఠశాల విద్య పూర్తిగా ఇంగ్లీష్ , గుజరాతీలో సాగింది. తరువాత 1954లో గ్వాలియర్‌కు మారి సింధియా స్కూల్‌లో చదువుకున్నారు. స్వాతంత్ర్యం తరువాత, ముంబైకి తిరిగి వచ్చేశారు.
ప్రస్తుత FM రేడియో యుగంలో, రేడియో జాకీలు వస్తున్నారు. పాపులారిటీ సాధిస్తున్నారు. కానీ భారతదేశ రేడియో ప్రేమికులకు అమీన్ తేనెలూరు ఆ స్వరం అజరామరం. ఆయన భౌతికంగా లేకపోయినా ధ్వని తరంగాలపై ఆ గొంతు ఎప్పటికీ శాశ్వతమే.
Comments
Please login to add a commentAdd a comment