పద్యానవనం: జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును... | Awareness only capable to stand for long time | Sakshi
Sakshi News home page

పద్యానవనం: జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును...

Published Sun, Jun 8 2014 1:00 AM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

పద్యానవనం: జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును... - Sakshi

పద్యానవనం: జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును...

వార్త యందు జగము వర్ధిల్లుచున్నది.. అదియు లేనినాడు అఖిల జనులు.. అంధకార మగ్ను లగుదురు గావున
వార్త నిర్వహింప వలయునధిపా!

 
 సమాచార నిర్వహణ ఇటీవలి ప్రక్రియ అనుకుంటారు చాలా మంది. ఇటీవల అంటే.... కొన్ని వందల సంవత్సరాలని.  మానవేతిహాసం మొదలైన నుంచీ ఏదో రూపంలో వార్తా నిర్వహణ ప్రక్రియ ఉండనే ఉంది. ట్విట్టర్లు, బ్లాగ్‌లు, ఫేస్‌బుక్, లింక్‌డిన్, వాట్సాప్, ఇంటర్‌నెట్ వంటివి పుట్టుకురాకముందు టెలివిజన్, రేడియో, పత్రికలే ప్రసారమాధ్యమాలుగా రాజ్యమేలాయి. అందులోనూ పత్రికలు అత్యంత పురాతనమైనవి కాగా వాటికి మాతృకలయిన ఉత్తరాలూ చారిత్రక పాత్రనే పోషించాయి. ప్రణయ వ్యవహారాల నుంచి పాలనా సమాచారం వరకు పావురాలతో ఉత్తరాలు పంపించడాలు మన పురాణేతిహాసాల్లో మొదలై ఇటీవలి కాలం వరకూ సాగిందంటే ఆశ్చర్యం కలుగుతుంది.
 
 ఎవరు నిర్వహించే వారో తెలియదు కానీ, పురాణ కాలంలో ఆకాశవాణి, అశరీరవాణి లాంటివి చాలా ముఖ్యమైన సమాచారం అందించేవి. ‘నీ సోదరి దేవకి అష్టమ సంతానమే నీ పాలిట మృత్యువ’ంటూ కంసునికి సమాచరమిచ్చింది ఇటువంటి అశరీరవాణియే! రాజరిక వ్యవస్థల్లో సమాచారం మోసేందుకు, చేరవేసేందుకు  ప్రత్యేకంగా వార్తాహారులు ఉండేవారు. దాదాపు రెండు వేల సంవత్సరాల కిందట అశోక చక్రవర్తి కీలకమైన సమాచారాన్ని రాతి శిలలపైన, స్థంబాలపైన, స్థూపాలపైన చెక్కించాడని ప్రసిద్ధి. దాదాపు వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ కాలమే ఈ రాళ్లపై రాయించే శాసనాల పద్ధతి సాగింది.
 
  తర్వాతి కాలంలో తాటి ఆకులపైన, అదే తాళపత్రాల పై రాతలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. శాశ్వతత్వం కోసం రాగిరేకులపైనా ఈ రాతలు సాగేవి. ఆంధ్ర పదకవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యుల వారి కీర్తనలన్నీ చాలావరకు రాగిరేకులపైనే ఉండేవనీ, అందులో కొన్ని మాత్రమే లభ్యమయ్యాయనీ పరిశోధకులు చెబుతుంటారు. మొగలాయి రాజులు కూడ వార్తా నిర్వహణ బాగా చేసినట్టు చరిత్రకారులు చెబుతారు. వారిలో దాదాపు కడపటి వాడైన ఔరంగజేబు కూడా ముఖ్యమైన ప్రభుత్వ నిర్ణయాల్ని, వార్తా విశేషాల్ని ఉదయం కల్లా గోడలపై రాయించేవాడని ప్రతీతి.
 
 పాశ్చాత్య దేశాల్లో అచ్చు యంత్రం వినియోగంలోకి వచ్చాక వార్తా నిర్వహణ స్వరూమే మారిపోయింది.  ఈస్టిండియా కంపెనీ వారు బెంగాల్ నుంచి వెలువరించిన గెజెట్‌ను దేశంలో తొలి వార్తాపత్రికగా చెబుతుంటారు. తవ్వుకుంటూ పోతే అదో పెద్ద చరిత్ర. కాకపోతే, ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే, ఎప్పుడో అయిదారు వేల ఏండ్ల కిందట జరిగిందని చెబుతున్న మహాభారత కాలం నాటికే వార్తల నిర్వహణపై పాలకులకు అంతటి స్పృహ ఉండటమే విశేషం! అది కూడా సమగ్రమైన అవగాహన కలిగిన వ్యక్తీకరణను ఈ పద్యంలో చూడొచ్చు.
 
 వార్త ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు నిర్వహించాలి? దాని వల్ల కలుగుతున్న ప్రయోజనమేంటి? అది లేకుంటే జరిగే అనర్థమేమిటి? ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానమిస్తూ నారదుడు యుదిష్ఠిరునికి విన్నవించే సందర్భం. రాజసూయ యాగానికి వచ్చిన నారదుడీ వివరణ ఇచ్చినట్టు మహాభారత సభాపర్వంలో నన్నయ చెప్పాడీ పద్యం. సమాచార వ్యాప్తి తోడినే యావత్ ప్రపంచము ప్రగతి సాధిస్తోందని చెబుతాడు. అదే లేకపోతే జనులంతా అంధకారంలో కొట్టుకుపోతారంటాడు. అలా కాకుండా ఉండటానికి వార్తను నిర్వహించాలనీ, అది పాలకుల బాధ్యతనీ వివరిస్తాడు. వార్త అంటే సమాచారం మాత్రమే కాదు. సమాచార రూపంలో వచ్చే జ్ఞానం. జ్ఞాన వ్యాప్తికి దోహదపడే సమాచార వెల్లువ ప్రగతికి కారణమే కాకుండా, అసమానతల నివారణకు, అక్రమాల నియంత్రణకు కూడా హేతువవుతోంది.
 
  గోప్యత అనే చీకటి పొరల్లో మగ్గిన సమాచారం ప్రజా బాహుళ్యంలోకి వస్తే... గ్రామ, పట్టణ స్థాయిలో నోరులేని బడుగు బలహీనవర్గాలు, అల్ప జీవులకు జరిగే చిన్న చిన్న అవకతవకలు, అన్యాయాల నుంచి రాష్ట్ర స్థాయిలో చోటుచేసుకునే అవినీతి, అక్రమాలు, ఆశ్రీత పక్షపాతం, బంధు జన ప్రీతి వంటి అనర్థాలన్నీ బట్టబయలు కావాల్సిందే! జాతీయ స్థాయిలో జరిగే కామన్‌వెల్త్ గోల్‌మాళ్లు, బొగ్గుగనులు, త్రి-జి  కేటాయింపులు, ఆదర్శ్ వంటి కుంభకోణాల గుట్టుమట్లను మన మీడియా వెలికితీయడం నుంచి అంతర్జాతీయ స్థాయిలో సామ్రాజ్యవాదుల దురాగతాలను, కుట్ర-కుతంత్రాలను వికీలీక్స్ బహిర్గతం చేయడం వరకు... ఈ సమాచార వ్యాప్తి పాత్ర ఎంత కీలకమైందో మనందరికీ తెలిసిందే! అందుకే ‘వార్త నిర్వహింప వలయు’నన్నారు పెద్దలు.
 - దిలీప్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement