రేడియో రెడీ..!
Published Wed, Apr 2 2014 10:55 PM | Last Updated on Sat, Mar 9 2019 3:26 PM
న్యూఢిల్లీ: పరుగు పరుగున వెళ్లి మెట్రోరైలు ఎక్కిన మీకు వికసించిన కమలం చిత్రాలున్న బిల్‌బోర్డులు దర్శనమిస్తాయి. అదే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలబడి గ్రీన్ లైట్ కోసం ఎదురుచూసే మీకు ఆకాశమంత ఎత్తున్న ‘హస్తం’ దర్శనమిస్తుంది. అలా బైక్‌పై దూసుకుపోతుంటే ‘మార్పు కోసం మాకు మద్దతు పలకండి’ అంటూ చీపురు అడుగుతుంది. ‘మాకు మద్దతు పలికితే పేదలకు మంచి రోజుల’ంటూ ఏనుగు బతిమాలుతుంది. లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి నగరంలో ఇలాంటి పోస్టర్లు, కటౌట్లు, బిల్‌బోర్డులు దర్శనమిస్తున్నాయి.
సంప్రదాయ ప్రచార వ్యూహాలుగా వీటిని ఉపయోగించుకునే రాజకీయ పార్టీలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల రంగప్రవేశంతో వీటినుంచి కొంతమేర దృష్టిమరల్చాయి. పైగా ఎన్నికల సంఘం ఆంక్షల నేపథ్యంలో కూడా ఇలా పోస్టర్లు, జెండాలు, బిల్ బోర్డులు ఏర్పాటు చేసే విషయంలో వెనుకంజ వేస్తున్నారు. దీంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ఓటర్ల వద్దకు వెళ్లే సాధనమైన రేడియోపై ఇప్పుడు అన్ని పార్టీలు దృష్టిసారించాయి. ఔట్‌డోర్ మీడియా, టెలివిజన్‌లో ప్రకటనల వంటివి భారీ ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారడంతో రేడియో ప్రచారంవైపు పార్టీలు మొగ్గుచూపుతున్నాయి.
అలరిస్తున్న రేడియో జింగిల్స్...
రోడ్డుపై నడుస్తున్నా.., బస్సులో ప్రయాణిస్తున్నా..., రైల్లో ఆఫీసుకెళ్తున్నా.. జేబులో సెల్‌ఫోన్, చెవిలో ఇయర్ ఫోన్ ఉండాల్సిందే. ఎందుకంటే సరిగ్గా ఆ సమయంలో మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే పసందైన పాటలు ఎఫ్‌ఎం స్టేషన్లలో వస్తుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే నగరజనం ఇప్పుడు ఎఫ్‌ఎం రేడియోకు బానిసలైపోయారు. ఇటువంటి పరిస్థితిని రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. రకరకాల జింగిల్స్ రూపంలో తమ పార్టీ తరఫున ఎఫ్‌ఎం రేడియోలో ప్రచారం చేస్తున్నాయి. రేడియోల్లో ప్రసారమవుతున్న ఈ జింగిల్స్ ఎంతో ఆసక్తికరంగా ఉండడమేగాకుండా ఆలోచించే విధంగా కూడా ఉంటున్నాయని చెబుతున్నారు శ్రోతలు.
జింగిల్స్ రూపకల్పనలో ప్రైవేటు కంపెనీలు బిజీ...
దేశవ్యాప్తంగా 158 మిలియన్ల మంది రేడియో శ్రోతలుండగా వారిలో 106 మిలియన్ల మంది ఎఫ్‌ఎం రేడియో వినేవారే. భారతదేశంలోని 86 నగరాల్లో దాదాపు 245కి పైగా ఎఫ్‌ఎం చానల్స్ ఉన్నాయి. దీంతో ప్రాంతాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు వారికి నచ్చే రీతిలో, ఆయ ప్రాంతాల యాసలు, భాషల్లో జింగిల్స్ రూపుదిద్దుకుంటున్నాయి. ఈ జింగిల్స్ రూపకల్పన కోసం ఏర్పాటైన వివిధ ప్రైవేటు కంపెనీలను రాజకీయ పార్టీలు ఆశ్రయించడంతో వారికి చేతినిండా పనిదొరికింది. సదరు కంపెనీలు జింగిల్స్ రూపకల్పనలో బిజీగా ఉంటున్నాయి.
రేటూ.. సెపరేటు..!
ఎఫ్‌ఎం రేడియోలో పార్టీ తరఫున ప్రచారం చేయాలంటే గంపగుత్తగా ఒకే మొత్తం చెల్లిస్తే సరిపోదు. ఎందుకంటే ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు ఎఫ్‌ఎం వినేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆయా స్టేషన్లు ఈ సమయాల్లో పార్టీల జింగిల్స్ ప్రచారం చేయాలంటే ఒకరేటు, మిగతా సమయాల్లో ప్రసారం చేయాలంటే మరో రేటు చొప్పున వసూలు చేస్తున్నాయి. దాదాపు 30 సెకన్ల నుంచి 3 నిమిషాల నిడివితో ప్రసారమయ్యే ఈ జింగిల్స్‌కు ప్రసారమయ్యే సమయం ఆధారంగా కూడా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని చానళ్లు వినియోగదారులు కోరితే విరామ సమయంలో కాకుండా పాటల మధ్యలో కూడా ఈ జింగిల్స్‌ను ప్రచారం చేస్తున్నాయి. ఇలా వ్యూహాత్మకంగా ప్రసారం చేసే జింగిల్స్‌కు మరికొంత అదనంగా వసూలు చేస్తున్నాయి. కేవలం ఆ ప్రాంతానికే పరిమితమయ్యే జింగిల్స్‌కు ఒక రేటు, ప్రసార పరిధి విస్తరించేకొద్దీ మరో రేటు కూడా వసూలు చేస్తున్నాయి.
దూసుకుపోతున్న కమలం...
ప్రచారంలో ముందున్న కమలం రేడియో ప్రచారంలో కూడా మిగతా పార్టీలకంటే ముందే కనిపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ ఎఫ్‌ఎం రేడియో చానళ్లలో ఆ పార్టీ గీతం ప్రసారమవుతోంది. ఇది ఎంతో ఆకట్టుకునేలా ఉందంటూ తమకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
Advertisement
Advertisement