సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని న్యూఢిల్లీ లోక్‌సభ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ స్థానంలో ఏ పార్టీ గెలిస్తే కేంద్రంలో అదే పార్టీ అధికారంలోకి రావడం గత రెండు దశాబ్ధాలుగా సాగుతోంది. 1992లో జరిగిన ఉప ఎన్నికల నుంచి ఈ స్థానంలో ఎవరు గెలిస్తే కేంద్రంలో కూడా అదే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అంతేకాదు మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగగా.. దానిలో 13సార్లు ఇదే సీన్ రిపీటైంది. దీంతో ఈ స్థానాన్ని బీజేపీ, కాంగ్రెస్‌తో సహా ఆప్ కూడా ప్రతీష్టాత్మకంగా తీసుకున్నాయి. దేశంలో కీలకమై కేంద్ర వ్యవస్థలన్నీ ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉండటం విశేషం. భారత అత్యున్నత శాసన వ్యవస్థ పార్లమెంట్, సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాజ్యాంగ బద్దమైన సంస్థలు, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రుల నివాసాలు ఇదే నియోజకవర్గంలో ఉన్నాయి. అంతేకాదు దేశ రక్షణ వ్యవస్థకు చెందిన అనేక సంస్థలు కూడా ఈ స్థానం పరిధిలో ఉన్నాయి.
గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి మీనాక్షి లేఖీ విజయం సాధించారు. అనుకున్నట్లుగానే కేంద్రంలో అత్యధిక మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతకుముందు జరిగిన 2004, 09 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్ వరుసగా రెండుసార్లు గెలుపొందారు. ఈ సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేంద్రంలో కొలువుదీరింది. 1998, 1999లో ఎన్నికల్లో కేంద్రంలో వాజ్‌పేయీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ రెండు ఎన్నికల్లోనూ అనుహ్యంగా బీజేపీ అభ్యర్థి జగ్‌మోహన్ విజయం సాధించారు. ఆయన కొద్ది కాలంపాటు జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్‌కే దావన్‌పై ఆయన గెలుపొందారు. అయితే అంతకుముందు 1996లో వాజ్‌పేయీ ప్రభుత్వం లోక్‌సభలో మెజార్టీ లేక కేవలం 13 రోజులకే పడిపోయిన విషయం తెలిసిందే. అప్పడు కూడా జగ్‌మోహన్ విజయం సాధించడం విశేషం.
అద్వానీ గెలుపు.. ఉప ఎన్నికల్లో ఓటమి
1991లో దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో న్యూఢిల్లీ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసిన బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఘన విజయం సాధించారు. అయితే అదే సమయంలో ఆయన గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానం నుంచి కూడా గెలుపొందడంతో న్యూఢిల్లీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి శత్రుఘ్న సిన్హాపై కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ కన్నా గెలుపొందారు. ఆ సమయంలో ఎవ్వరూ ఊహించని విధంగా తెలుగు వ్యక్తి పీవీ నరసింహారావు నేతృత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 1992కు ముందు ఈ సాంప్రదాయంలో కొంత మార్పు వచ్చింది. 1951 నుంచి 89 వరకు జరిగిన తొమ్మిది ఎన్నికల్లో ఆరుసార్లు మాత్రమే న్యూఢిల్లీ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటే కేంద్రంలో వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి..
స్వాతంత్ర భారతంలో మొదటి సారి 1951లో జరిగిన ఎన్నికల్లో న్యూఢిల్లీ పార్లమెంట్ స్థానాన్ని కిసాన్ మాజ్దుర్ ప్రజా పార్టీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ నుంచి ఇక్కడ పోటీచేసిన సుచేతా కృపాలాని ఘన విజయం సాధించారు. ఆతరువాత ఎన్నికల్లో కూడా (1957) కూడా కృపాలానినే రెండోసారి విజయం సాధించారు. ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలుపొందారు. ఆ తరువాత యూపీ అసెంబ్లీకి పోటీచేసి దేశ చరిత్రలో తొలి మహిళా సీఎంగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. అప్పటి నుంచే ఈ సాంప్రదాయం మొదలైంది. ఇక 1962, 1971, 84 ఎన్నికల్లో న్యూఢిల్లీతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక అత్యయిక పరిస్థితి అనంతరం జరగిన తొలి ఎన్నికల్లో (1977) బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు అటల్ బిహారి వాజ్‌పేయీ.. భారతీయ లోక్‌దళ్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. కేంద్రంలో మోరార్జీ దేశాయ్ నేతృత్వంలో తొలి కాంగ్రెసేతేర ప్రభుత్వాన్ని (జనతా) ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి అద్వానీ ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందగా.. వీపీ సింగ్ సారథ్యంలో నేషనల్ ఫ్రెంట్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ 1967, 80 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. న్యూఢిల్లీ పార్లమెంట్ స్థానాన్ని మాత్రం ఇతరులు కైవసం చేసుకున్నారు.
ఈసారి విజయం ఎవరిదో..
ఇలా వినూత్న సాంప్రదాయానికి వేదికైన న్యూఢిల్లీ లోక్‌సభ స్థానంలో విజయం కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బీజేపీ సిట్టింగ్ ఎంపీ మీనాక్షీ లేఖి మరోసారి బరిలో నిలవగా.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ అజయ్ మాకెన్ మరోసారిపోటీలో నిలిచారు. ఆప్ నుంచి బ్రిజేష్ గోయల్ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు ఎంపీ స్థానాలకు బీజేపీయే సొంతం చేసుకుంది. మరోసారి అదే ధీమాతో బరిలో నిలిచింది. దీనిలో భాగంగానే అభ్యర్థుల ఎంపికలో కూడా మొదటినుంచి వ్యూహాత్మకంగా అడుగులువేసింది. టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను ఇక్కడి నుంచి బరిలో నిలపాలని బీజేపీ భావించినా.. చివరి నిమిషంగా లేఖీ అభ్యర్థిగా ప్రకటించింది.
న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలు.. (10)
కరోల్‌బాగ్, పటేల్ నగర్, మోతీ నగర్, ఢిల్లీ కాంట్, రాజేంద్ర నగర్, న్యూఢిల్లీ, కస్తూరిబా నగర్, మాలవియ నగర్, ఆర్‌కే పురం, గ్రేటర్ కైలాష్. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ ఆప్ విజయం సాధించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment