తెలంగాణ మాండలికంతో పేరొచ్చింది... | special story to tejaswi | Sakshi
Sakshi News home page

తెలంగాణ మాండలికంతో పేరొచ్చింది...

Published Mon, Apr 30 2018 12:03 AM | Last Updated on Mon, Apr 30 2018 12:09 AM

special story to tejaswi - Sakshi

శ్రీమంజునాథ చిత్రంలో ‘‘నాన్నా! సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన్నే ఎందుకు అస్తమిస్తాడు’’ అని పలికే ఆనంద్‌ వర్థన్‌ (అర్జున్‌ కుమారుడు) నటించిన పాత్రకు తన గాత్రంతో ప్రాణం పోశారు తిరుమల తేజస్వి. హైదరాబాద్‌లో ఉంటున్న తేజస్వి రేడియో మిర్చి ఎఫ్‌ఎం లో ‘ఆర్‌జె టిజె’గా ప్రేక్షకులకు సుపరిచితులు. ఫొటోగ్రఫీలో పిజి డిప్లొమా చే శాక ‘ది హిందూ పత్రిక’లో ఇంటర్న్‌ షిప్‌ చేసి తను తీసిన ఫొటోలను ఆ పత్రికలో చూసుకున్నారు. ‘కందిరీగ’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న తేజస్వి సాక్షితో తన అనుభవాలు పంచుకున్నారు...

‘‘నన్ను అందరూ టీజే ఆచార్య అంటారు. నా అసలు పేరు తిరుమల తేజస్వి అనే విషయం మర్చిపోయారు. ‘మిర్చి లవ్‌’ ప్రోగ్రామ్‌ ద్వారా ప్రతిరోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రేడియో జాకీగా ‘నేను మీ టీజే’ అంటూ అందరికీ వినిపిస్తాను’’ అంటున్న తేజస్వి తన మూడవ ఏట నుంచే డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించారు. తండ్రి విజయకుమార్‌ డబ్బింగ్‌ ఆర్టిస్టుల యూనియన్‌ ఫౌండర్‌లో ఒకరు కావడం వల్ల ఇంట్లో అందరూ డబ్బింగ్‌ ఆర్టిస్టులు అయ్యారు. ‘‘చిన్నప్పటి నుంచి నాన్నతో శబ్దాలయ, ప్రసాద్‌ ల్యాబ్స్, రామానాయుడు స్టూడియోలకి వెళ్తుండేదాన్ని. అక్కడ నేను కూడా చెప్తానని వచ్చీరాని మాటలతో అన్నానుట. 1994లో మొట్టమొదటగా నా చేత చిన్న పిల్లలకు డబ్బింగ్‌ చెప్పించారు. సినిమా పేరు‡ అస్సలు గుర్తు లేదు’’ అంటున్న తేజస్వి ‘ఆక్రందన’ సీరియల్‌లో చైల్డ్‌ ఆర్టిస్టుగా కూడా పని చేశారు. ఆ సీరియల్‌కు తన డబ్బింగ్‌ తానే చెప్పుకున్నారు. చైల్డ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్టుగా... శ్రీభాగవతం సీరియల్‌లో కౌశిక్‌కి, శివలీలలు సీరియల్‌లో తనీష్‌కు డబ్బింగ్‌ చెప్పారు. ‘‘నాన్నగారు దూరదర్శన్‌లో టెలీస్కూల్‌ కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆయనతో పాటు స్టూడియోకి వెళ్లి, అవసరమైన చోట పిల్లలకు డబ్బింగ్‌ చెప్పేదాన్ని’’ అని బాల్యస్మృతులు వివరించారు. శ్రీమంజునాథ చిత్రంలో ఆనంద్‌వర్థన్‌ వేసిన పాత్రకు ఇచ్చిన డబ్బింగ్‌కు దర్శకులు కె. రాఘవేంద్రరావు ప్రశంసలు అందుకున్నారు. ఆ చిత్రం ప్రీమియర్‌కి ఆనంద్‌వర్థన్‌ తల్లిదండ్రులు కూడా వచ్చారు. ‘‘తేజస్వి చాలా బాగా డబ్బింగ్‌ చెప్పిందని వారంతా ప్రశంసించారని అమ్మ నాతో చెప్పారు’’ అంటారు తేజస్వి. 

కందిరీగతో బ్రేక్‌
‘‘డబ్బింగ్‌ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న ప్రసాద్, సుబ్బారావు, కాంచనబాబు... వంటి వారు నాకు డబ్బింగ్‌లో బాగా అవకాశాలు ఇచ్చారు. చదువుకి ఆటంకం వస్తుందని మధ్యలో మానేశాను. కొంతకాలం తరవాత ‘కందిరీగ’ చిత్రంలో చిన్న బిట్‌కి డబ్బింగ్‌  చెప్పడానికి నాకు పిలుపు వచ్చింది’’ అంటున్న తేజస్వికి ఆ చిత్రం మంచి బ్రేక్‌ ఇచ్చింది. ఆ చిత్రంలో నటించిన అక్షకు తెలంగాణ మాండలికంలో తన గొంతు ఇచ్చింది తేజస్వి. ‘‘అనిల్‌ రావిపూడి నా గొంతు విని, చాలా పెక్యులియర్‌గా ఉందన్నారు. ఒక పెద్ద డైలాగు ఇచ్చి చెప్పమన్నారు. ఆ చిత్రంలో అది నా మొదటి డైలాగు. తప్పులు లేకుండా చెప్పేశాను. సినిమా విడుదలయ్యాక, ఎలా ఉంటుందో అని టెన్షన్‌ పట్టుకుంది. ఆ రోజున  అనిల్‌రావిపూడి ఫోన్‌ చేసి, ‘ఏంటి ఇలా చేశావు?’ అన్నారు. బెదిరిపోయాను. ఎక్కడో తప్పు చేసేసి ఉంటాను, కెరీర్‌ పోయింది అనుకున్నాను. ఆయన నవ్వుతూ, డైలాగులు చాలా బాగా చెప్పావు’ అనేసరికి నా గుండె తేలికపడింది’’ అంటున్న తేజస్వి...  మోహన్‌బాబు, రామానాయుడు, బెల్లంకొండ సురేశ్‌ వంటి పెద్దల ప్రశంసలు అందుకున్నారు. ఆ చిత్రంలో హీరోగా నటించిన రామ్, స్వయంగా తన అసిస్టెంట్‌తో తేజస్వికి పెద్ద పూల బొకే పంపారు. 

తెలంగాణ మాండలికం స్పెషలిస్ట్‌
బిఏ (సైకాలజీ, మాస్‌ కమ్యూనికేషన్‌) పూర్తి చేశాక, ఫొటోగ్రఫీలో పిజి డిప్లొమా చేయడానికి బెంగళూరు వెళ్లిన తేజస్వి  ‘రేసుగుర్రం’ చిత్రంలో డబ్బింగ్‌ కోసం సురేంద్రరెడ్డి నుంచి ఫోన్‌ అందుకున్నారు. ‘‘నన్ను వాయిస్‌ టెస్ట్‌కి పిలిచారనుకున్నాను. ఒక వీకెండ్‌కి వచ్చి రామానాయుడు స్టూడియోలో డబ్బింగ్‌ చెప్పాను. . అందులో అల్లు అర్జున్‌కి వదినగా వేసిన సలోనీ పాత్రకు తెలంగాణ మాండలికంలో నా చేత డబ్బింగ్‌ చెప్పించారు. తెలంగాణ అనగానే నన్ను పిలుస్తున్నారు. ఇది నాకొక మార్క్‌. చాలా సంతోషంగా ఉంటుంది’’ అంటున్న తేజస్వి ఎక్కడకు వెళ్లినా ఆమెను కందిరీగ, రేసుగుర్రం చిత్రాల డైలాగులతో పలకరిస్తారు. ఇప్పటివరకు సుమారు 400 చిత్రాలకు డబ్బింగ్‌ చెప్పారు తేజస్వి. ఇందులో చైల్డ్‌ ఆర్టిస్టుగా 75, మిగిలినవి పెద్ద వాళ్లకి చెప్పారు. ప్రస్తుతం నాలుగు కొత్త చిత్రాలకు డబ్బింగ్‌ చెబుతున్నారు. ‘‘డబ్బింగ్‌తో పాటు నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావడానికి కారణం నా ఫొటోగ్రఫీ. కొందరి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాను. కొన్ని మాక్‌ షూట్స్‌ చేశాను’’ అన్నారు తేజస్వి. 

గుమ్మం బయటే వదిలేయాలి...
‘‘మనకు ఎన్ని చికాకులు ఉన్నా, మైకు ముందుకి వచ్చాక, పాత్ర గురించి మాత్రమే ఆలోచించాలి. మన వ్యక్తిగత విషయాలను స్టూడియో గుమ్మంలో విడిచిపెట్టేసి లోపలకు ప్రవేశించాలి అని నాన్న అంటుంటారు. నటీనటులు స్క్రీన్‌ ముందర పనిచేస్తే, మనం మైక్‌ ముందరే చేయాలి అని చెప్పేవారు నాన్న. కందిరీగ చిత్రం టైమ్‌లో నాన్నకి యాక్సిడెంట్‌ అయ్యిందని తెలిసింది. అప్పుడు నేను బాగా నవ్వే సీన్‌కి డబ్బింగ్‌ చెప్పాలి. నాన్నకి ఎలా ఉందోనని మనసు అటు వైపే లాగింది. ఇక్కడ డైలాగులు చెప్పాలి. ఎన్నిసార్లు నవ్వుతున్నా అందులో చిన్న బాధ వినిపిస్తోంది. దాంతో అనిల్‌ రావిపూడి నన్ను బయటకు పిలిచి ఐదు నిమిషాలు టీ బ్రేక్‌ తీసుకుందాం అన్నారు. బయటకు వచ్చాక ఏమైందని అడిగారు. విషయం చెప్పాను. ఆయన తనకు ఎదురైన అనుభవాలు చెప్పి. నన్ను పని మీద దృష్టి పెట్టమని, వాతావరణం హ్యాపీగా ఉంచమని బుజ్జగించారు. ఆయన మాటలకు నా మనసుకి చేరాయి. బ్రేక్‌ అయ్యాక డైలాగు చెప్పాను. సింగిల్‌ టేక్‌లో అయిపోయింది’’ అంటున్న తేజస్వి తల్లి రజనీకాంత,,, మణిశర్మ, కీరవాణి వంటి సంగీత దర్శకుల దగ్గర కోరస్‌ పాడేవారు. ఆమె వీణ వాయిస్తారు, రచయిత కూడా. 
ఇంటర్వ్యూ: వైజయంతి

డైలాగులు
కందిరీగ: చల్‌ (ఆ సినిమా తరవాత చల్‌ ఊతపదంగా మారింది),
గంటేంది... మోగుడేంది, నాయనా టీవీ కే బులాణ్ని పిలు.
రేసు గుర్రం:  (చంద్రమోహన్‌ కాళ్లకు మొక్కమన్న సందర్భంలో) 
ఛత్‌ గీపొట్టి సాలెగానికా... నే పెట్టపో...

కందిరీగ నాకొక మంచి మెమరీ
‘స్వరాభిషేకం’ షూటింగ్‌కి అక్కతో పాటు నేను కూడా వచ్చాను. అక్కడ ఒకాయన కందిరీగ చిత్రంలో నా డైలాగుని రింగ్‌టోన్‌గా పెట్టుకున్నారు. అది విని నాకు చెప్పరాని సంతోషం వేసింది.
– తేజస్వి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement