ఎర్రగులాబి | That day should not have left it alone | Sakshi
Sakshi News home page

ఎర్రగులాబి

Published Sun, Feb 17 2019 1:12 AM | Last Updated on Sun, Feb 17 2019 2:59 AM

That day should not have left it alone - Sakshi

‘‘గుడ్‌ మార్నింగ్‌... నమస్తే.. ఆదాబ్‌.. నేను సూపర్‌ కూల్‌.. మీరు వింటున్నారు రేడియో నీమ్‌.. ఇది చాలా  చేదు  బాస్‌.  యే డైట్‌ అయినా  షుగర్‌కి  నో అంటోంది కాని బిట్టర్‌కి కాదు. బిట్టర్‌ ఎంత బెస్టో తెలుసా!  చేదుకు అలవాటు పడితే.. ఎంతటి కషాయాన్నయినా.. ఐ మీన్‌ ఎంతటి కష్టాన్నయినా ఇట్టే  మింగేయొచ్చు’’  సాగుతోంది  నాన్‌స్టాప్‌గా!మొబైల్‌ ఫోన్‌లో మెసేజెస్‌ బ్లింక్‌ అవుతూన్నాయి. ఆసక్తి..అనాసక్తి..వంటివేవీ ప్రదర్శించకుండా తన పనిలో నిమగ్నమైంది ఆ గొంతు. షో తర్వాత ఫోన్‌ చూసుకుంటే... ‘‘హేయ్‌..! వెన్‌ విల్‌ వి మీట్‌’’ మెసేజే రిపీటెడ్‌గా ఉంది. డయల్‌ చేయబోతుండగానే.. రింగ్‌ అయింది..  ‘‘భైరవా..’’‘‘హాయ్‌.. ’’ ఆత్రం, ప్రేమ, మార్దవంగా భైరవ. ‘‘సారీ.. ఇందాక షోలో ఉండి రిప్లయ్‌ ఇవ్వలేదు’’‘‘ఓహ్‌.. సారీ డిస్టర్బ్‌ చేసినందుకు.. ’’నొచ్చుకుంటూ భైరవ. ‘‘కమాన్‌ మ్యాన్‌.. డోంట్‌ బీ ఫార్మల్‌’’‘‘అయితే.. చెప్పు.. ఎప్పుడు కలుస్తున్నావ్‌?’’‘‘అప్పుడే ఎందుకంత తొందర? కలుద్దాం’’ నింపాదిగా!‘‘ హే.. ఇట్స్‌ బీన్‌ ఎ మంత్‌.. డార్లింగ్‌?’’ భైరవ‘‘అందుకే అంత  తొందరా అంటున్నా..’’‘‘హలో బేబీ.. ఇది మిలేనియల్స్‌ ఏజ్‌. నిన్న కలిసి.. ఈ రోజు ప్రేమించుకుని.. రేపు బ్రేకప్‌ చేసుకునేంత స్పీడ్‌..’’‘‘ఆహా... ’’‘‘యెస్‌ బేబీ!చచ్చిపోతున్నా.. నరకం కనపడుతోంది.. వినిపించడం తప్ప కనిపించవు’’.

 ‘‘కమా...న్‌ డియర్‌’’ మత్తుగా!అంతే ఆ స్వరంలోని హస్కీనెస్‌కు నోటమాట రాలేదు భైరవకు. ‘‘బై.. విల్‌ మీట్‌ సూన్‌..’’ ఫోన్‌ డిస్కనెక్ట్‌ అయింది.  ∙∙ ‘‘పిన్నీ..ప్లీజ్‌.. ఏడిస్తే పోయిన ఆత్మిక మళ్లీ రాదు కదా! చూడూ.. ఏడ్చి ఏడ్చి ఎలా అయిపోయావో?’’ ‘‘ నా వల్ల కావట్లేదు.  ఆరోజు దాన్ని ఒంటరిగా వదిలి ఉండాల్సింది కాదు.  పాపిష్టిదాన్ని!‘మమ్మీ తలనొప్పిగా ఉంది.. కాసేపు పడుకుంటా’  అంటే.. పడుకోనీ  అని నా చేతులతోనే తలుపేసి హాల్లోకి వచ్చా. దాంతోపాటే ఉన్నా అదిలా చేసుండేది కాదు. అది ఉరేసుకొని నా ఊపిరి తీసింది. నేను, మీ బాబాయ్‌ ఎవరికోసం బతకాలి? ఎందుకు బతకాలి?’’ రెండు చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తోంది చిత్ర. ఆ దుర్ఘటనను అలా ఆమె గుర్తు చేసుకోవడం లక్షా ఎనభయ్యోసారి.‘‘ఊరుకో పిన్నీ.. ప్లీజ్‌’’ అంతకన్నా ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. ఆత్మిక చనిపోయి ఏడు నెలలు అవుతోంది. ఆకలి, నిద్ర ఆమె దరిదాపుల్లోకి రాక ఏడునెల్లవుతోంది. కాలం చిత్ర గాయాన్ని ఏమాత్రం మాన్పలేకపోతోంది. ఆత్మిక ఆత్మహత్య కంటే కూడా చిత్ర క్షోభే ఆ ఇంట్లో వాళ్లను  కలత పెడ్తోంది. కౌన్సెలింగ్,సైకియాట్రి, ఆధ్యాత్మికత.. ఏమీ చేయలేకపోతున్నాయి. ‘‘ఆత్మిక ఆత్మ వచ్చి చెబితే గానీ మీ పిన్నీ మనుషుల్లోపడదు’’ జనాంతికంగా అన్నాడు సురేష్‌.. భార్య మానసిక స్థితి చూడలేక.

 ‘‘నేనొస్తేనన్నా.. కాస్త తేరుకొని మనుషుల్లో పడ్తుందని ఇక్కడికి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నా బాబాయ్‌! ప్చ్‌..నేనూ ఏం చేయలేక పోతున్నా..’’ బాధగా.‘‘ఛ..ఛ!  అలా అనకురా.. నువ్వు రావడం నిజంగా మంచిదే అయింది. నేను కాస్తయినా యాక్టివ్‌గా ఉండగలుగుతున్నా’’ భుజమ్మీద చేయివేస్తూ అనునయంగా అన్నాడు సురేష్‌. ఆత్మీక, తను కజిన్సే కాని  సిబ్లింగ్స్‌ కన్నా క్లోజ్‌గా ఉండేవాళ్లు. ఒకరంటే ఒకరికే కాదు..  ఆ  ఇద్దరన్నదమ్ముల కుటుంబాలకూ  ప్రాణం. ‘‘ఆత్మికా..  మై సిస్టర్‌.. నిన్ను మాకు కాకుండా చేసినవాడిని.. పిన్నిని ఇలా పిచ్చిదానిలా మార్చిన వాడిని వదిలిపెట్టే సమస్యే లేదు..’’ అంటుంటే.. గోడ మీద ఉన్న ఆత్మిక ఫోటోకి వేలాడ దీసిన దండలోంచి ఎర్ర  గులాబీ కింద పడింది. ∙∙ ‘‘హలో... మళ్లీ డిస్టర్బ్‌ చేస్తున్నానా?’’ భైరవ‘‘ఏం లేదు.. చెప్పు’’‘‘నిన్ను కలవకుండానే పోతానేమో’’ భైరవ‘‘అబ్బా..అంత నిరాశా?’’ ‘మరేంచేయను? నీ వాయిస్‌.. పెక్యూలియర్‌ వాయిస్‌ వినే భాగ్యం దొరికింది ఈ జన్మకిది చాలు అనుకుంటా’’ ‘‘ఆహా..’’‘‘నిజం.. ఐ మీన్‌ ఇట్‌. గమ్మత్తయిన వాయిస్‌. నిన్ను చూడకుండా నీతో లవ్‌లో పడ్డానంటే నీ వాయిసే కారణం. యు షుడ్‌ థ్యాంక్‌ ఫుల్‌ టు గాడ్‌.. అలాంటి గొంతునిచ్చినందుకు’’ భైరవ‘‘సరేగాని..ఎందుకు కాల్‌ చేశావో చెప్పు’’‘‘ ఈ ఈవెనింగ్‌ కలవ్వా... ప్లీజ్‌’’ బతిమాలాడు భైరవ.

‘‘హూ.. ’’నిట్టూరుస్తూ.. ‘‘ఈ ఈవెనింగ్‌ కుదరకపోవచ్చు.  సిక్స్‌ థర్టీకి రికార్డింగ్‌ ఉంది. ఆఫ్టర్‌ టెన్‌ అయితే  ఓకే.. ’’‘‘ నైట్‌? నీకు ఓకే అయితే నాకూ ఓకే’’ కొంటెగా భైరవ. ‘‘వెన్యూ...?’’‘‘అదీ నువ్వే చెప్పు..’’ అన్నాడు అదే కొంటెతనంతో భైరవ‘‘వాట్సప్‌ చేస్తా...’’ఫోన్‌ డిస్కనెక్ట్‌ అయింది. ∙∙ రాత్రి.. ‘‘హేయ్‌.. నీ వాయిస్‌కి తగ్గట్టే నీ టేస్ట్‌ కూడా పెక్యూలియర్‌’’ ‘‘ఆహా..’’‘‘కాకపోతే.. ఫస్ట్‌ టైమ్‌ నిన్ను చూడబోతుంటే వెన్యూ పెట్టేది ఈ ఊరి శ్మశానంలోనా?’’ వెటకారం భైరవలో.‘‘యే.. భయమేస్తోందా?’’ ‘‘అంతలేదు బేబీ.. త్వరగా రా.. వెయిటింగ్‌’’ అన్నాడు. ‘‘ వస్తున్నా’’సరిగ్గా పది గంటల పది నిమిషాలకు.. ఫోన్‌లో సూచించిన ప్రకారం.. ఓ సమాధి దగ్గర నిలబడి ఉన్నాడు సమాధి వెపు మొహం చేసి!సరిగ్గా అతని వెనకాల..  సన్నగా.. భుజాల వరకు జుట్టు.. జీన్స్‌.. షూ.. క్యాప్‌ స్వెట్టర్‌తో ఓ ఆకారం. క్యాప్‌తో తలంతా కవర్‌ చేసుకుని చేతులను జీన్స్‌ పాకెట్స్‌లో పెట్టుకుని మెడ వంచి  ముందున్న ఓ రాయిని బలంగా తన్నింది ఆకారం. రాయి వెళ్లి సరాసరి భైరవ పిరుదుకు తగిలింది. అసంకల్పితంగా దెబ్బ తగిలిన చోట రుద్దుకుంటూ వెనక్కి తిరిగాడు చటుక్కున.‘‘హాయ్‌..’’ అంటూ జేబుల్లోంచి చేతులు తీసి తల మీదున్న క్యాప్‌ను వెనక్కి తోస్తూ మొహాన్ని పైకెత్తింది ఆ ఆకారం. షాక్‌.. భైరవకు.

గొంతు సుపరిచితం.. ఫేస్‌ ఏంటీ.. మీసాలతో?‘‘నువ్వు.. నువ్వు... అబ్బాయివా?’’ విస్మయం.‘‘యెస్‌.. ఆత్మిక అన్నను. నువ్వు నిలబడ్డది ఆత్మిక సమాధి దగ్గరే’’ చెప్పాడు.‘‘ఎంత మోసం’’ భైరవ. ‘‘నువ్వు నా చెల్లికి చేసిన దాని కంటేనా? ఏరా..ఒకరోజు పరిచయం.. రెండో రోజు ప్రేమ.. మూడో రోజు బ్రేకప్‌ ఆ... నా చెల్లిని చీట్‌ చేసింది ఇలాగే కదా?’’ అంటుంటే..  ‘‘అన్నయ్యా.. నువ్వాగు’’ అని వినిపించింది సమాధి వైపు నుంచి. ఇంకో షాక్‌ భైరవకి. అది ఆత్మిక గొంతు. వినిపించిన వైపు  తిరిగాడు భయంగానే. నవ్వుతోంది ఆత్మిక.. నల్లటి చుడీ దార్‌లో తెల్లగా మెరిసిపోతూ.. పెద్ద జడను మెడకు  చుట్టుకుని.. దోసిళ్ల కొద్దీ ఎర్ర గులాబీలను భైరవ మీదకు విసురుతూ. చూస్తుండగానే ఆ గులాబీలన్నీ భైరవను ముంచెత్తాయి శ్వాస తీసుకోనివ్వకుండా.‘‘ఇవన్నీ నువ్వు నాకిచ్చినవే.. తీసుకో.. తీసుకో’’ విరగబడి నవ్వుతూ భైరవ మీదకు వేస్తూనే ఉంది ఆత్మిక.వెనక్కి తిరిగాడు ఆత్మిక అన్న..క్యాప్‌ తల మీదకు జరుపుకొని చేతులు జేబుల్లోకి దూర్చుకుంటూ! 
సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement