చైతన్యం ఇలా..
ఓ మహిళ చేతిలో కెమెరా ఉంటే... ఊళ్లోకి నీళ్లొస్తాయి.
ఓ మహిళ రేడియో మైకు ముందు నిలబడితే... బడి మానేసిన పిల్లలు బడిబాట పడతారు. ఓ మహిళ చేతిలో కాగితం, కలం ఉంటే... నాలుగ్గోడల మధ్య నలిగే మహిళ కడగండ్లకు ఊరట కలుగుతుంది. ఇది నిజమా! అంటే... నిజంగా నిజమేనని ఆధారాలు చూపిస్తారు గుజరాత్ మహిళలు.
అది గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నగరానికి ముప్ఫై కిలోమీటర్ల దూరాన ఉన్న మణిపూర్ గ్రామం. అక్కడ ‘రుడి నో రేడియో’ అనే కమ్యూనిటీ రేడియో కేంద్రం ఉంది. వర్ష, జైమిని, విద్య, జల్పలతోపాటు అనేక మంది మహిళలు అక్కడ తమ తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. వర్ష ఆ రేడియో ప్రసారాలకు వ్యాఖ్యాత. జల్ప స్థానిక జానపదాలను గానం చేసే గాయని. విద్య ఈ కార్యక్రమాలను రూపొందిస్తారు. జైమిని ఈ ప్రసారాలకు కావల్సిన సాంకేతిక సహకారాన్ని అందిస్తారు. వీరందరి కంటే ఎక్కువగా చూపరుల దృష్టిని ఆకర్షిస్తున్న మహిళ దమయంతి. ఆమె జాతీయ మహిళా పాత్రికేయుల సదస్సును (ఎన్‌డబ్ల్యుఎమ్‌ఐ) వీడియో కెమెరాలో చిత్రీకరిస్తున్నారు. ఒక జాతీయస్థాయి కార్యక్రమాన్ని సామాన్య గ్రామీణ మహిళ అధునాతనమైన కెమెరాతో సమర్థవంతంగా చిత్రీకరిస్తున్నారు. వీడియో కూర్పులో కూడా ఆమె నేర్పరి.
అందరూ మహిళలే!
‘రుడి నో రేడియో’ కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణ అంతా మహిళలే చూసుకుంటారు. అయితే... అసలు విషయం ఇది మాత్రమే కాదు. ఈ మహిళల్లో ఎవరూ పెద్ద చదువులు చదవలేదు. ఇంటి పనులు, వ్యవసాయ పనులను యథావిధిగా కొనసాగిస్తూ, రేడియో కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం వారెంచుకున్న మాధ్యమే ఈ కమ్యూనిటీ రేడియో, వీడియో కార్యక్రమాలు. ‘పది వాక్యాల్లో చెప్పలేని ఓ విషయాన్ని ఒక్క బొమ్మ ఇట్టే వివరిస్తుంది’- అంటున్నారు.
శక్తిమంతమైన మాధ్యమం!
మణిపూర్ గ్రామంతోపాటు పరిసరాల్లోని అనేక గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించింది ఈ కెమెరానే అంటారు కెమెరా ఉమన్ దమయంతి. ‘‘ ఊరి చివరన ఉన్న వ్యవసాయ బావుల నుంచి తాగునీటిని మోయాల్సి వచ్చేది. నీటి సౌకర్యం కల్పించమని గ్రామపెద్దను కోరాం. అతడు ఎంతకీ స్పందించకపోవడంతో ఒక రోజు నా కెమెరాకు పని చెప్పాను. అంతే! మా గ్రామానికి కుళాయిలు వచ్చేశాయి’’ అన్నారామె నవ్వుతూ. ఇంతకీ వారు ఏం చేశారంటే... తెల్లవారు జాము నుంచి మహిళలు నీటిని మోయడాన్ని చిత్రీకరించి స్థానిక కేబుల్ ద్వారా ప్రసారం చేశారు. ఆ ప్రసారాలు ప్రభుత్వ అధికారుల దృష్టికి చేరడంతో సమస్య తీరింది.
సంఘటితంగా పని చేస్తే...
ఇలా భట్ అనే సామాజిక సంస్కర్త ‘సేవ’ అనే వేదిక ద్వారా ఇచ్చిన ఆసరాతో ఈ మహిళలు చైతన్యవంతమయ్యారు. ఆ ఆసరాతో తమ జీవితాలకు ఒక రూపు తెచ్చుకుంటున్నారు.
‘ఇలా’ సేవకు గుర్తింపు!
పద్మభూషణ్ (1986), పద్మశ్రీ(1985)
రైట్ టు లైవ్‌లీ హుడ్ అవార్డు(1984)
పార్లమెంట్ సభ్యురాలు (1986 - 1989)
హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి డాక్టరేట్, ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ ( 2001)
కుటుంబం... భర్త రమేశ్‌భట్, అమ్మాయి అమిమాయి, అబ్బాయి మిహిర్. అహ్మదాబాద్‌లో నివాసం .ఆమె రాసిన పుస్తకం...‘వియ్ ఆర్ పూర్ బట్ సో మెనీ...’. ఇది సేవా సంస్థలో స్వయంసాధికారత సాధించిన మహిళల జీవితాల ఆధారంగా సాగిన కథనం.