రెండేళ్ల క్రితం(2022) జరిగిన మావన అక్రమ రవాణా ఘటనలో విచారించేందుకు భారత సంతతికి చెందిన వ్యక్తిని అమెరికాలోని చికాగోలో అరెస్ట్ చేశారు. నలుగురు సభ్యులు గల గుజరాతీ కుటుంబం కెనడా నుంచి చట్టవిరుద్ధంగా యూఎస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా వారు చలిని తట్టుకోలేక గడ్డకట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అమెరికా అధికారులు విచారిస్తున్నారు.
ఈ కేసులో భారత సంతతికి చెందిన హర్షకుమార్ రామన్‌లాల్ పటేల్‌ను చికాగోలోని ఓ హేర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. రామన్ ఫిబ్రవరి 28న నిర్బంధ విచారణకు హాజరుకానున్నారని చికాగో ట్రిబ్యూన్ పేర్కొంది. డర్టీ హ్యారీ, పరంసింగ్, హరేష్ రమేశ్‌లాల్ పటేల్ తదితర పేర్లతో చలామణీ అవుతున్న పటేల్.. విదేశీయులను అక్రమంగా రవాణా చేయడం, ఇందుకు కుట్ర పన్నడం లాంటి అభియోగాలను ఎదుర్కొంటున్నాడు.
మానవ అక్రమ రవాణా కుట్రలో పటేల్ ప్రమేయంపై మిన్నెసోటా జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. 2022, జనవరి 19న జరిగిన మానవ అక్రమ రవాణాపై ఈ కోర్టులో విచారణ జరుగుతోంది. భారత్‌లోని గుజరాత్‌కు చెందిన జగదీష్ పటేల్( 39)తో పాటు అతని కుటుంబ సభ్యులైన వైశాలిబెన్ పటేల్ (37), విహంగీ పటేల్ (11), ధార్మిక్ పటేల్ (3)లు కెనడా సరిహద్దులోని ఎమర్సన్, మానిటోబా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ, చలికి తట్టుకోలేక గడ్డ కట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.
వీరి మృతదేహాలను బోర్డర్ పెట్రోలింగ్ అధికారులు, స్వాధీనం చేసుకుని, ఈ కేసుతో సంబంధమున్న స్టీవ్ షాండ్ (47)ను అరెస్ట్ చేశారు. హర్షకుమార్ పటేల్, షాండ్ మధ్య కమ్యూనికేషన్ వివరాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫ్లోరిడాలోని గ్యాంబ్లింగ్ నిర్వహణకు హర్షకుమార్ రామన్‌లాల్ పటేల్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడని షాండ్ తెలిపాడు. వీరిద్దరూ ఫోన్‌లో పలు విషయాలు మాట్లాడుకున్నట్లు అధికారులు గుర్తించారు. 2022, జనవరి 19న నార్త్ డకోటా, మిన్నెసోటాలలోని చలి వాతావరణం గురించి వీరు ఫోనులో చర్చించుకున్నారు. మంచు తుఫాను పరిస్ధితులు ఉన్నందున జగదీష్ పటేల్ కుటుంబ సభ్యులంతా తగిన దుస్తులు ధరించారో లేదో చూడాలని షాండ్‌కు పటేల్ ఓ సందేశంలో సూచించాడు. ఈ కేసు విచారణకు సంబంధించి ఢిల్లీలోని హోంలాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (హెచ్ఎస్ఐ) అధికారి గుజరాత్ పోలీసులతో సమావేశమైనట్లు మిన్నెసోటా జిల్లా కోర్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment