Children's Day 2022: పిల్లలవాణి.. స్కూల్‌ రేడియో! అంతా వాళ్లిష్టమే | Childrens Day 2022: Visakhapatnam Based School Radio For Kids | Sakshi
Sakshi News home page

Children's Day 2022: పిల్లలవాణి.. స్కూల్‌ రేడియో! అంతా వాళ్లిష్టమే

Published Mon, Nov 14 2022 2:47 PM | Last Updated on Mon, Nov 14 2022 3:01 PM

Childrens Day 2022: Visakhapatnam Based School Radio For Kids - Sakshi

ఉదయ్‌ కుమార్‌- అరుణ.. స్కూల్‌ రేడియో నిర్వహణలో పిల్లలు

బడి అంటే పాఠాల బట్టీ కాదు..  వినోదం.. విజ్ఞానం కూడా! వాటిని పంచే ఓ సాధనం రేడియో! ఎస్‌.. ఆకాశ వాణి! కాకపోతే ఇది పిల్లల వాణి.. దీనికి కేంద్రం స్కూల్‌! అనౌన్సర్లు, రైటర్లు, స్టోరీ టెల్లర్లు, ఆర్టిస్టులు, ప్రోగ్రామ్‌ డిజైనర్లు.. స్టేషన్‌ డైరెక్టర్లు అందరూ పిల్లలే! అంటే విద్యార్థులే!! మరి శ్రోతలు..?  www.schoolradio.in వెబ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఆ కార్యక్రమాలను వినేవాళ్లంతా!

అదే స్కూల్‌ రేడియో! 2015లో..  ఫిబ్రవరి 13న.. అంతర్జాతీయ రేడియో దినోత్సవం సందర్భంగా తన ఫ్రీక్వెన్సీని సెట్‌ చేసుకుంది. దీనికి రూపకర్తలు.. కాట్రగడ్డ అరుణ, గాలి ఉదయ్‌ కుమార్‌! విశాఖపట్టణం వాస్తవ్యులు! స్కూల్‌ రేడియో స్థాపన.. దాని విధివిధానాలు, కార్యక్రమాల గురించి ఆ జంట మాటల్లోనే.. 

‘మనం బాలలను ఎంతగానో నిర్లక్ష్యం చేస్తున్నాం. వారి ప్రాధాన్యాలేమిటో, వారేం కోరుకుంటున్నారో తెలుసుకోవటం లేదు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని పిల్లలు, యువత కోసం  స్కూల్‌ రేడియోను ప్రారంభించాం.  

ఇప్పటివరకు శ్రోతలుగా, ప్రేక్షకులుగా మిగిలిపోయిన పిల్లలు, యువతకే పట్టం కడుతూ, వారే వక్తలుగా, కార్యక్రమ నిర్వాహకులుగా.. వాళ్లకేం కావాలో వాళ్ళే నిర్ణయించుకునేలా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలనూ మొదలుపెట్టాం.. ఈ స్కూల్‌ రేడియో ద్వారానే! ప్రసారం చేయాలనుకొనే అంశాలకు సంబంధించిన ఇతివృత్తాలను ఎంచుకోవటం, సమాచారాన్ని సేకరించటం, స్క్రిప్ట్‌ రాయటం, రాసిన స్క్రిప్ట్‌ను సరిదిద్దటం వంటి పనులను విద్యార్థులే చేస్తారు.

కార్యక్రమాలను రికార్డు చేస్తారు. రికార్డు చేసిన ఆడియో ఫైల్స్‌ను ఎడిట్‌ చేసి, బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ని జత చేస్తారు. ఇలా సిద్ధమైన కార్యక్రమాలను స్కూల్‌ రేడియోలో ప్రసారం చేస్తాం. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లతో పాటు పలు భారతీయ భాషల్లోనూ  కార్యక్రమాలను రూపొందిస్తున్నారు చిన్నారులు. తాము నివసిస్తున్న గ్రామం లేదా నగరాల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను స్వయంగా ఇంటర్వ్యూ చేస్తారు.

తమ ప్రాంతంలోని పర్యావరణ, సామాజిక సమస్యలను అధ్యయనం చేసి, సమస్య మూలాలను అర్థం చేసుకొంటూ, ఆయా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వమూ ప్రజలూ ఏం చేయాలో సూచిస్తూ కూడా  రేడియో కార్యక్రమాలను రూపొంది స్తున్నారు. ఇలా.. సామాజిక స్పృహæ కలిగిన పౌరులుగా వారు ఎదిగేందుకు స్కూల్‌ రేడియో చేయూత నిస్తోంది. 

వాళ్లిష్టమే..
స్కూల్‌ రేడియోలో చిన్నారులు  ఏమైనా మాట్లాడవచ్చు. పాఠ్యాంశాలను చెప్పవచ్చు.  పుస్తకాలను సమీక్షించవచ్చు. సినిమాలను విశ్లేషించవచ్చు. తాము ఆడే ఆటల గురించి మాట్లాడవచ్చు. పండుగలు, ఉత్సవాలు, ఆచార వ్యవహారాలు, రాజకీయాలు, సామాజిక సమస్యలు, పర్యావరణ అంశాలు ఇలా ఏం మాట్లాడాలనేది వాళ్ళ ఇష్టం. సహ విద్యార్థులతో కలసి చర్చించి, తమకు నచ్చిన అంశాలను ఎంచుకొని కార్యక్రమాలను తయారు చేయవచ్చు.

స్కూల్‌ రేడియో క్లబ్‌లు
పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ఈ రేడియోను ప్రారంభించేందుకు ముందుగా స్కూల్‌ రేడియో క్లబ్‌లను ఏర్పాటు చేయాలి. ప్రతి రేడియో క్లబ్‌లో పది మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారు. ఇవి ప్రతినెల రేడియో కార్యక్రమాలను రూపొందిస్తాయి.

ఈ కార్యక్రమాలను  www.schoolradio.in వెబ్‌సైట్‌లో వినవచ్చు. స్కూల్‌ రేడియో క్లబ్‌ల కోసం ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలను విద్యాసంస్థల్లోనే నిర్వహిస్తారు. కరోనా తదనంతర పరిస్థితులలో ఆన్‌లైన్‌లో కూడ శిక్షణ మొదలైంది. చెప్పదలిచిన సమాచారాన్ని ఒక పద్ధతి ప్రకారం రాయటం, కథలను చెప్పగలగటం, భావవ్యక్తీకరణ నైపుణ్యాలను పెంచటం, బహిరంగ సభలు, సమావేశాలలో ప్రసంగించటం, నిర్మోహమాటంగా తమ అభిప్రాయాలను వెల్లడించడమెలాగో నేర్పడంతోపాటు వాయిస్‌ రికార్డింగ్, ఆడియో ఫైల్స్‌ ఎడిటింగ్‌ వంటి సాంకేతిక అంశాలలోనూ పిల్లలకు తర్ఫీదు ఉంటుంది.

టాక్‌ షోలు, రేడియో నాటికలు, చర్చా కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు, పాటలు, పద్యాలతో పాఠశాల విద్యార్థులు తామే రేడియో కార్యక్రమాలను రూపొందించుకునేలా వారికి చేయూత ఉంటుంది. వినోదంతో పాటు విజ్ఞానాన్నీ పంచుతూ పిల్లల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తూ..  స్ఫూర్తి నింపే లక్ష్యంతో స్కూల్‌ రేడియో క్లబ్‌లు ఏర్పాటయ్యాయి.  

పుస్తకాలు
రేడియో కార్యక్రమాలను రూపొందించేందుకు అవసరమైన ప్రాథమిక సమాచారాన్ని అందించేందుకు స్కూల్‌ రేడియో ప్రత్యేకంగా ఎన్నో పుస్తకాలను ప్రచురించింది. అలాగే చిన్నారులు రాసిన కథలు, కవితలు, నాటికలకు స్థానం కల్పిస్తూ బాల, చిన్నారి, ప్రతిబింబం, ఆనందాల హరివిల్లు పుస్తకాలను అచ్చువేసింది. ఇది పబ్లిష్‌ చేసిన ‘చీమా చీమా ఎందుకు కుట్టావు?’ పుస్తకంలోని కథలను ‘పిపీలికే పిపీలికే కిమర్థం దంశసి?’ పేరిట సంస్కృతంలోకి అనువదించారు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని సంస్కృత పాఠశాల విద్యార్థులు.

దీన్నీ స్కూల్‌ రేడియో ప్రచురించింది. ఉన్నత పాఠశాల విద్యార్థులు తెలుగు నుంచి అనువదించిన తొలి సంస్కృత పుస్తకంగా ఇది గుర్తింపు పొందింది. చిన్నారుల భాగస్వామ్యంతో ఆడియో, వీడియో, టెక్ట్స్‌తో కూడిన మల్టీ మీడియా డిజిటల్‌ పుస్తకాలనూ రూపొందించి, అందుబాటులోకి తెచ్చింది. 

ఆన్‌లైన్‌ పాఠాలు
కరోనా కంటే ముందు నుంచే స్కూల్‌ రేడియోలో ఆన్‌లైన్‌  పాఠాలున్నాయి. ఉపాధ్యాయులు తమకు నచ్చిన అంశాలను స్కూల్‌ రేడియోలో చెప్పవచ్చు. ఆన్‌లైన్‌ విధానంలో తరగతి గదుల నిర్వహణకు సంబంధించి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలనూ నిర్వహించింది స్కూల్‌ రేడియో. 

కెరీర్‌కూ దోహదం
మెరుగైన ఉపాధి అవకాశాలున్న కోర్సులకు సంబంధించిన సమాచారాన్ని అందజేస్తూ కెరీర్‌ ఎంపికల గురించి ప్రత్యేక కార్యక్రమాలను వారే రూపొందించేలా చూస్తోంది స్కూల్‌ రేడియో. ఇప్పటి వరకు కేవలం కార్పొరేట్‌ లేదా ప్రైవేట్‌ పాఠశాలలకే పరిమితమైన స్కూల్‌ రేడియో కార్యక్రమాలను ప్రభుత్వ పాఠశాలలకు విస్తరిస్తున్నాం.

గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధిస్తూ, ఉన్నత ర్యాంకులను పొందుతున్నప్పటికీ, వారిలో భావ వ్యక్తీకరణ నైపుణ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. కారణం.. ఆత్మ విశ్వాసం కొరవడటమే. ఫలితంగా బహుళ జాతి సంస్థలలో వారు ఉద్యోగాలు సాధించటంలో వెనుకబడుతు న్నారు. కనుక వారిలో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పెంపొదించేలా ప్రత్యేక కార్యక్రమాలనూ రూపొందిస్తోందీ స్కూల్‌ రేడియో. 

ప్రత్యేక దినాలు, ప్రత్యేక కార్యక్రమాలు
అంతర్జాతీయ, జాతీయ దినాలనెన్నింటినో జరుపుకొంటూంటాం. అయితే వీటిని మొక్కుబడిగా పాటించటమే తప్ప, వాటి ప్రత్యేకత ఏమిటో ఎక్కువ మందికి తెలియదు. విద్యార్థులకు చెప్పే వారూ ఉండరు. అందుకే ఇలాంటి ప్రత్యేక సందర్భాల కోసం స్కూల్‌ రేడియో స్లాట్స్‌ను కేటాయిస్తుంది.

ఆయా దినాల ప్రత్యేకతను అర్థం చేసుకొనేందుకు విద్యార్థులు ఇంటర్నెట్‌ను శోధిస్తారు. గ్రంథాలయాలలో పుస్తకాలను చదువుతారు. సంబంధిత నిపుణులతో మాట్లాడతారు. సంబంధిత సమస్యలు, పరిష్కార మార్గాల గురించి ఆలోచిస్తారు. ఫలితంగా వారిలో ఆసక్తితో పాటు అవగాహనా పెరుగుతుంది’ అంటూ స్కూల్‌ రేడియో ఏర్పాటు గురించి చెప్పింది అరుణ, ఉదయ్‌ కుమార్‌ జంట.  
 
తప్పిపోయిన కార్డు కథ!
వ్యర్థాల నిర్వహణ అంశంపై  పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్న మాకు ఒక వింత అనుభవం ఎదురైంది. తడి, పొడి వ్యర్థాలు, జీవ వైద్య వ్యర్థాలు, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు ఇలా రకరకాల వ్యర్థాలతో కూడిన ఫ్లాష్‌ కార్డులను విద్యార్థులకు ఇచ్చి, వాటి గురించి మాట్లాడమని అడిగే వాళ్ళం. ఆయా వ్యర్థాలను ఎలా తొలగించాలి, వ్యర్థాల నిర్వహణలో పాటించవలసిన విధివిధానాల గురించి విద్యార్థులు తమ అభిప్రాయాలను తెలియజేయాలి.

ఈ కార్డులలో శానిటరీ నాప్కిన్‌ చిత్రంతో కూడిన కార్డు కూడా ఉండేది. కానీ విద్యార్థినీ విద్యార్థులలో ఎవరూ కూడ దీని గురించి అసలేమీ మాట్లాడేవారు కాదు. పైగా ఆ కార్డును మాకు తిరిగి ఇవ్వకుండా, డెస్క్‌ల కిందో, పుస్తకాల మధ్యనో దాచిపెట్టేసేవారు. మానవ జీవితంలోని ఒక సహజమైన ప్రక్రియ గురించి మాట్లాడేందుకు చిన్నారులు, యువత సిగ్గు పడుతున్నారని, వారిలో ఎన్నో అపోహలు ఉన్నాయని ఈ సంఘటన మాకు స్పష్టం చేసింది.

దాంతో ది స్టోరీ ఆఫ్‌ మిస్సింగ్‌ కార్డ్‌ పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని డిజైన్‌ చేశాం. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, నెలసరి లేదా పీరియడ్స్‌ గురించిన శాస్త్రీయమైన అవగాహనను విద్యార్థులలో కలిగించేందుకు, ఈ అంశం చుట్టూ నెలకొన్న అపోహలు, భయాలను తొలగించేందుకు  స్కూల్‌ రేడియోలో ప్రత్యేక కార్యక్రమాలకు చోటు కల్పించాం.

చదవండి: Winter Care Tips: చలికాలంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! చల్లారిన ఆహారం తిన్నారంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement