సరిగ్గా వందేళ్ల క్రితం నవంబర్‌ 2న రాత్రి.. | US Election 2020 : America Election Results In First Radio | Sakshi
Sakshi News home page

రాత్రికి రాత్రే నాటి అమెరికా ఫలితాలు

Published Wed, Nov 4 2020 8:22 PM | Last Updated on Wed, Nov 4 2020 8:27 PM

US Election 2020 : America Election Results In First Radio - Sakshi

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థి వారెన్‌ హార్డింగ్, డెమోక్రాట్ల అభ్యర్థి జేమ్స్‌ కోక్స్‌పై అఖండ విజయం సాధించారు’ అనే వార్త అమెరికా రేడియోలో మారు మ్రోగిపోయింది. అధ్యక్ష అభ్యర్థుల పేర్లు మారిపోయాయంటూ ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. సరిగ్గా వందేళ్ల క్రితం 1920, నవంబర్‌ 2వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు అమెరికాలోని తొలి వాణిజ్య బ్రాడ్ ‌క్యాస్టింగ్‌ రేడియో స్టేషన్‌ ‘పిట్స్‌బర్గ్స్‌ కేడీకేఏ’ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. ఆ ఫలితాలతోనే తొట్ట తొలి రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. (చదవండి : అమెరికా అధ్యక్ష ఫలితాలపై ఎందుకు ఆసక్తి?)

హైస్కూల్‌ చదువు కూడా పూర్తి చేయని ‘ఫ్రాంక్‌ కొనార్డ్‌’ అనే వ్యక్తి రేడియో సాంకేతిక పరిజ్ఞానంలో అనేక పేటెంట్లు సాధించారు. ఆయనే ఆ రోజున తన గ్యారేజీలో ఏర్పాటు చేసిన రేడియో స్టేషన్‌ ప్రసారాలను బటన్‌ తిప్పడం ద్వారా ప్రారంభించారు. ‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒహాయో నుంచి వెలువడుతున్న మారియన్‌ స్టార్‌ ఎడిటర్, పబ్లిషర్‌ వారెన్‌ హార్డింగ్‌ అఖండ విజయం సాధించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అనుసరించిన విధానాల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిపోయింది. ఆ పర్యవసానంగానే డెమోక్రాట్ల అభ్యర్థి ఓడిపోవాల్సి వచ్చింది’ అంటూ ఫ్రాంక్‌ కొనార్డే వార్తను విశ్లేషించారు. ఆయన టెలిఫోన్‌ అమెరికా ఎన్నికల ఫలితాలను ఫోన్‌ ద్వారా ఎప్పటికప్పుడు తెప్పించుకున్నారు. (చదవండి : ‘ముందస్తు ఓటింగ్‌’తో నష్టమా, లాభమా?!)

నాటి ఫలితాలను నవంబర్‌ రెండో తేదీ రాత్రి కొంత మంది శ్రోతలే తెలుసుకోగలిగారు. మిగతా అమెరికన్లు మరుసటి రోజు ఉదయం పత్రికలు వచ్చే వరకు ఫలితాల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ప్రముఖ వ్యాపార వేత్త జార్జి వెస్టింగౌజ్‌ పెట్టుబడులతో ఫ్రాంక్‌ కొనార్డ్‌ సాంకేతిక పరిజ్ఞానంతో అమెరికా తొలి లైసెన్స్‌ వాణిజ్య రేడియో కల నెరవేరింది. వాస్తవానికి 1890 దశకం నుంచి రేడియో సిగ్నల్స్‌పై ప్రయోగాలు మొదలయ్యాయి. దూర ప్రాంతానికి రేడియో సిగ్నల్స్‌ ప్రసారం చేసిన ఇంజనీర్‌ జీ. మార్కోనికి నోబెల్‌ బహుమతి లభించింది. 1910 కొంత మంది ఔత్యాహిక రేడియో ఆపరేటర్లు పరిమిత దూరం వరకు తమ గొంతును, సంగీతాన్ని ప్రసారం చేయగలిగారు. తొలితరంలో రాజకీయ నాయకులు ఎంతో ఉపయోగపడిన రేడియో మాధ్యమం, టీవీల రూపంలో, సోషల్‌ మీడియా రూపంలో మరెంతగానో అభివృద్ధి చెందింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement