‘ముందస్తు ఓటింగ్‌’తో నష్టమా, లాభమా?! | What Benefit From Allowing Early Voting | Sakshi
Sakshi News home page

‘ముందస్తు ఓటింగ్‌’తో నష్టమా, లాభమా?!

Published Wed, Nov 4 2020 3:32 PM | Last Updated on Wed, Nov 4 2020 5:35 PM

What Benefit From Allowing Early Voting - Sakshi

అమెరికా అధ్యక్ష పదవికి అధికారికంగా మంగళవారం జరిగిన ఎన్నికలకు ముందే దాదాపు పది కోట్ల మంది అమెరికా పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో మూడింట రెండొంతల మంది ఓటర్లు ఓటు వేయడానికి పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకోగా ఒక వంతు మంది ఓటర్లు భౌతికంగా ముందస్తు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటింగ్‌లో పాల్గొన్నారు. అమెరికా తరహాలో ముందస్తు పోలింగ్‌ను అమలు చేస్తున్న అన్ని దేశాల నుంచి సానుకూల వార్తలే వస్తున్నాయి. ఒక్క రోజే పోలింగ్‌ను నిర్వహించడం వల్ల పోలింగ్‌ కేంద్రాలు జనంతో కిక్కిరిసి పోతున్నాయి. ప్రాణాంతక కరోనా వైరస్‌ విజంభిస్తున్న నేటి పరిస్థితుల్లో ఇలా ముందస్తు పోలింగ్‌ను అనుమతించడం ఎంతైనా సమంజసమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. (ట్రంప్‌ సంచలన కామెంట్లు: ట్వీట్‌ తొలగింపు)

న్యూజిలాండ్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో 56.7 శాతం ముందస్తు ఓటింగ్‌ జరిగింది. అదే 2017లో నిర్వహించిన ఎన్నికల్లో 48 శాతం ముందస్తు ఓటింగ్‌ జరగ్గా, ఈసారి మరింతగా పెరిగింది. కరోనా వైరస్‌ కారణంగా ఈ ఓటింగ్‌ పెరిగిందని భావించవచ్చుగానీ 2011 ఎన్నికల్లో అధికారిక పోలింగ్‌కు ముందు కేవలం 14.7 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. 2013లో ఆస్ట్రేలియాకు జరిగిన ఎన్నికల్లో 26.4 శాతం మంది ముందస్తు ఓటింగ్‌లో పాల్గొనగా, 2019లో జరిగిన ఎన్నికల్లో 40.1 శాతం మంది ముందస్తు ఓటింగ్‌లో పాల్గొన్నారు.  (ఈ ఎన్నికల్లో మేం గెలుస్తాం : జో బైడెన్‌)

అమెరికాకు 2000 సంవత్సరం నుంచి 2016 వరకు జరిగిన అయిదు ఎన్నికల్లో వరుసగా 16, 22, 30.6, 31.6, 33.6 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును ముందుగానే ఉపయోగించుకున్నారు. ముందస్తు ఓటింగ్‌ సదుపాయం వల్ల అత్యవసర పనులు కూడా మానుకొని ఓటింగ్‌లో పాల్గొనాల్సి రావడం, పోలింగ్‌ కేంద్రాల వద్ద గంటల కొద్ది బారులు తీరి క్యూల్లో నిలబడాల్సి రావడం లాంటి సమస్యలు తప్పిపోవచ్చుగానీ, ముందస్తు ఓటింగ్‌ వల్ల సమస్యలంటూ లేకపోలేదు. అభ్యర్థుల చర్చా గోష్ఠుల్లో వారి చెప్పే అంశాలను అర్థం చేసుకొని వారి పట్ల ఓ అభిప్రాయానికి రావడం కుదరదు. హోరా హోరీ ఎన్నికల పోరులో అభ్యర్థులకు సంబంధించి కొన్ని కీలక అంశాలు చివరి నిమిషంలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కొందరు అభ్యర్థులు చివరి నిమిషంలో ఎన్నికలకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలను చివరి నిమిషంలో కుమ్మరిస్తారు.

ముందస్తు ఓటింగ్‌ వల్ల అలాంటి పరిణామాలు తెలుసుకొనే అవకాశం ఓటర్లు కోల్పోతారు. కొంత మంది ఓటర్లు చివరి నిమిషం వరకు తమ ఓటు విషయంలో ఓ నిర్ణయానికి రాలేరు. అలాంటి వారికి ఇది ఇబ్బంది. కొన్ని దేశాల్లో పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం జాతీయ నిరుద్యోగం జాబితాలు వెలువడ్డాయి. అలాంటి సమయాల్లో వాటిని సమీక్షించి ఓటువేసే అవకాశాలను కొల్పోవాల్సి వస్తుంది. ముందస్తు ఓటింగ్‌ను అనుమతించడం వల్ల ఎన్నికల ఖర్చు పెరగుతుంది.  (అమెరికా ఓటర్‌ ‘స్వింగ్‌’ ఎటు?)

ముందస్తు ఓటింగ్‌ వల్ల పోలింగ్‌ శాతం పెరగుతుందని చాలా మంది భావిస్తారు. కానీ అది అబద్ధమని ‘విస్కాన్సిన్‌ యూనివర్శిటీ’ 2013లో నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ముందస్తు ఓటింగ్‌ను అనుమతించడం వల్ల ప్రస్తుతం ఏ దేశంలోనైనా 50 శాతం నుంచి 70 శాతం వరకు ఓటింగ్‌ అధికారిక పోలింగ్‌ తేదీకీ ముందే జరిగిపోతుంది. ఆ 30 శాతం పోలింగే సరిగ్గా జరగడం లేదని అధ్యయనంలో తేలింది. ఓటు చేయడానికి చాలా రోజులుందిలే అని భావించి ఓటు వినియోగాన్ని వాయిదా వేస్తూ వచ్చే వారు, చివరి నిమిషంలో ఏదో కారణంగా పోలింగ్‌లో పాల్గొనకపోవడం, అధికారిక పోలింగ్‌ రోజుకు తక్కువ మంది ఓటర్లు మిగిలిపోవడం వల్ల ఆ పోలింగ్‌ రోజు పట్ల అంతగా ఆసక్తి లేకపోవడం, ఓటు వేయడం వల్ల ఒరిగేదేముందిలే అనుకునే వారి వల్ల పోలింగ్‌ శాతం తగ్గుతోందట. (అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వివాదాలెన్నో!)

రాజకీయ ప్రాతినిథ్యంలేని ప్రజా వర్గాలు కూడా ఓటింగ్‌ పట్ల ఆసక్తి చూపడం లేదని, వారిని నయానో, భయానో పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్లాల్సి అవసరం లేక పోవడం వల్ల కూడా పోలింగ్‌ తగ్గుతోందట. ‘అప్లైడ్‌ ఎకనామిక్స్‌’ ప్రచురించిన పరిశోధనా పత్రం, యూనివర్శిటీ ఆఫ్‌ మేరీలాండ్, యూనివర్శిటీ ఆష్‌ క్వీన్స్‌లాండ్‌ ఈ ఏడాదిలో నిర్వహించిన సర్వే ప్రకారం ముందస్తు ఓటింగ్‌ను అనుమతించడం వల్ల 0.22 పాయింట్ల అదనపు ఓటింగ్‌ పెరిగింది. మహిళలు, వృద్ధులు, గర్బవతులు, కార్మికులకు ఈ ఓటింగ్‌ అనుకూలంగా ఉందట. ఈ సారి అమెరికా ముందస్తు ఓటింగ్‌లో పాల్గొన ప్రతి ఐదుగురిలో ఒకరు గత ఎన్నికల్లో పాల్గొనలేదని, దీన్నిబట్టి ఓటర్లలో భిన్నమైన గ్రూప్‌ను ఈ ముందస్తు ఎన్నికలు ఆకర్షిస్తున్నాయని ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ కాలమిస్ట్‌ గ్రెగ్‌ సార్జంట్‌ పేర్కొన్నారు. ముందస్తు ఓటింగ్‌ అమెరికాలో డెమోక్రట్లు కలసి వస్తుండగా, ఆస్ట్రేలియాలో ఉదారవాద జాతీయ కూటమికి అనుకూలిస్తోంది. 

ఎలక్షన్‌ లా జనరల్‌ : రూల్స్, పాలిటిక్స్‌ అండ్‌ పాలసీ’లో ప్రచురించిన ఓ వ్యాసం ప్రకారం పలు దేశాల్లో నాలుగు రకాల ముందస్తు ఎన్నికలను అమలు చేస్తున్నారు. కెనడాలో కొన్ని రోజుల ముందు నుంచి, ఫిన్‌లాండ్‌ వారం రోజుల ముందు నుంచి, జర్మనీలో ఆన్‌డిమాండ్‌ పోస్టల్‌ ఓటింగ్, స్విడ్జర్లాండ్‌లో ఆటోమేటిక్‌ పోస్టల్‌ ఓటింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. దాదాపు వంద కోట్ల మంది ఓటర్లను కలిగిన భారత దేశంలో ముందస్తు ఓటింగ్‌ను అమలు చేయడం కష్టం. పోలింగ్‌ కేంద్రాల ఆక్రమణ, రిగ్గింగ్‌లు జరిగే భారత్‌లో ఓటర్లకు స్వేచ్ఛాయుత వాతావరణం లేదని చెప్పవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement