ఒక ఇంట్లో...
‘దీపను కార్తీక్ ఎప్పుడు అర్ధం చేసుకుంటాడో.. భర్త అయ్యుండి మరీ అంత హార్ష్‌గా ఎలా బిహేవ్ చేస్తాడో. ఈ మగాళ్లు ఇంతే’ టీవీలో సీరియల్ చూస్తూ అందులోని కథానాయిక పడే కష్టాలు తనే పడుతున్నంత బాధగా అనుకుంది వంట చేస్తున్న శ్రావణి.మరో ఇంట్లో...‘అసలా సమీర్ కోకిలను చేసుకుంటాడో, సింధును చేసుకుంటాడో. సమీర్ కోకిల జోడీ మాత్రం సూపర్ కదా..’ చాటింగ్‌లో ఫ్రెండ్‌ను అడుగుతోంది కాలేజీ అమ్మాయి కోమలి.వేరే ఇంట్లో...‘పాపం ఆ అమ్ములుకెన్ని కష్టాలే... తల్లిదండ్రులే కాదంటే ఇంక ఆ పిల్ల గతేం కాను?’ కళ్లజోడు తీసి తుడిచి మళ్లీ పెట్టుకుంటూ అంది మనవారిలితో బామ్మ అన్నపూర్ణమ్మ. టీవీ సీరియల్స్‌లో వచ్చే కథలు తమవే అయినట్టు, అందులోని పాత్రలు తమ మధ్యే తిరుగుతున్నట్టు, తమలోనే ఉన్నట్టు ఆవాహన చేసుకుంటోంది.
నిన్నటి, నేటి తరం.నట్టింట చేరిన బుల్లిపెట్టెలో వచ్చే వరుస సీరియళ్లను అర్థరాత్రి వరకు వరుసపెట్టి చూస్తూ, వాటి గురించి మాట్లాడుకునే బామ్మలు, భామలు ఇటు అనకాపల్లి నుంచి అటు అమెరికా దాకా ఉన్నారు. ‘ఆ సీరియళ్ల ధ్యాసలో పడి మొగుడికి వేళకింత తిండిపెట్టాలన్న ఆలోచన కూడా పోయింది ఈ ఆడాళ్లకు’ అంటూ మగవాళ్లు కస్సుబుస్సుమన్నా ‘ప్రకటనల గ్యాప్‌లో కాపురాలను కానిచ్చేస్తున్నారు..’ అని కామెడీ మతాబులు పేల్చినా.. సీరియళ్ల ప్రవాహానికి అడ్డుగా నిలిచే శక్తి ఎవ్వరికీ లేదన్నది నేటి టీవీ సీరియళ్ల టీఆర్‌పి రేటింగ్స్ చూస్తే అర్ధమైపోతుంది.
జీళ్లపాకం సీరియల్స్ అని తిట్టుకునే మగవారు సైతం ‘మా కాలక్షేపం ఈ సీరియల్సే’ అని సీన్ మిస్సవ్వకుండా చూస్తున్నవారే ఎక్కువ. అందుకే ఆ సీరియళ్లు వెయ్యిన్నొక్క ఎపిసోడు, రెండువేల రెండో ఎపిసోడు అంటూ రికార్డులు తిరగరాసుకుంటున్నాయి. ఇంతకీ ఈ సీరియల్స్ మన నట్టింట్లో ఎప్పుడు ఎలా అడుగు పెట్టాయి? ఏళ్లపాటు కొనసాగే వీటి ఉనికి ఎన్నేళ్ల క్రితం మొదలయ్యింది తెలుసుకోవడం కూడా ఆసక్తి పుట్టిస్తుంది. నెక్ట్స్ కథనంలో ఏమవుతుందో అనే ప్రేక్షకుడి ఆసక్తే ఈ సిరియల్స్‌కు అసలు సిసలు పెట్టుబడి అవుతోందన్నది ముమ్మాటికీ నిజం.
రేడియో నుంచి టీవీకి
ధారావాహిక అనేది ముందు అమెరికాలో మొదలైంది. అక్కడి రేడియోలో ‘గైడింగ్ లైట్’ అనే నాటకం 1937 నుంచి 1956 వరకు దాదాపు 19 ఏళ్లపాటు ప్రసారమైంది. దీనిలో చాలా పాత్రలు, భావోద్వేగ బంధాల మధ్య కథనం సాగుతూ ఉంటుంది. టీవీ ప్రాచుర్యంలోకి వచ్చాక అదే నాటకం జూన్ 30, 1952 నుంచి సెప్టెంబర్ 18, 2009వరకు దాదాపు 57 ఏళ్లపాటు సీరియల్‌గా ప్రసారం అయ్యింది. టెలివిజన్ చరిత్రలోనే ఫస్ట్ అండ్ లాంగెస్ట్ రన్నింగ్ డ్రామాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో పేరు సంపాదించుకున్న ఈ సీరియల్ అమెరికా బ్రాడ్‌కాస్ట్ చరిత్రలోనే విశేషంగా చెప్పుకోదగినది.
అంటే అటు రేడియో, ఇటు టీవీ మాధ్యమాలలో ప్రసారమైన ఈ కార్యక్రమం ప్రసార కాలం 72 ఏళ్లు అన్నమాట. దీని విజయంతో యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో సీరియల్ ట్రెండ్ విస్తరించింది. ఇక ఈ సీరియల్స్‌ని మొదట సబ్బుల (సోప్) తయారీదారులు స్పాన్సర్ చేసేవారు. అందుకే వీటికి సోప్ వారు నిర్వహించే ధారావాహిక అనే పేరు వచ్చింది. ఆ తర్వాత్తర్వాత ‘సోప్ ఒపెరా’ పేరు అంతర్జాతీయంగా ఖరారైంది.
మన నట్టింట్లో మొదటి అడుగు
ఇండియన్ టెలివిజన్‌లో మొట్టమొదటగా అడుగుపెట్టిన డ్రామా సీరీస్ ‘హమ్ లోగ్’. దూరదర్శన్‌లో ఈ సీరియల్ 1984 జూలై 7న ప్రారంభమై 17 డిసెంబర్ 1985 వరకు 154 ఎపిసోడ్లు ప్రసారమైంది. 1980ల నాటి మధ్యతరగతి కుటుంబంలోని నిత్య సంఘర్షణలు, వ్యక్తుల ఆకాంక్షల గురించిన కథనంతో విద్య–వినోదం ప్రధానాంశంగా ఈ సీరియల్ సాగింది. ముఖ్యంగా సామాజికాంశాలైన కుటుంబనియంత్రణ, కుల సామరస్యం, మహిళా సాధికారత, జాతీయ సమైక్యత, కట్నం, మద్యపానం– మత్తు పదార్థాల దుర్వినియోగం .. వంటి అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించే విధంగా ఈ సీరియల్‌ని రూపుదిద్దారు.
ఈ కథను మెక్సికన్ టెలివిజన్ సీరీస్ ‘వెన్ కన్‌మిగో (V్ఛn ఛిౌnఝజీజౌ 1975)లోని మూల కథ నుంచి తీసుకొని మనవారి మనోభావాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. 1982లో నాటి కేంద్ర ప్రసార శాఖా మంత్రి వసంత్ సాథే మెక్సికన్ పర్యటనకు వెళ్లి అక్కడ ‘వెన్ కన్‌మిగో’ చూసి ఇండియాలోనూ ఈ తరహా కార్యక్రమం ప్రసారం చేయాలనే ఆలోచన చేశారట. దీంతో రచయిత మనోహర్ శ్యామ్ జోషి, స్క్రిప్ట్ రైటర్, ఫిల్మ్ మేకర్ పి.కుమార్ వాసుదేవ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిల్ బిస్వాస్, హిందీ సినీ నటుడు అశోక్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ‘హమ్‌లోగ్’ సీరియల్ ప్రసారమైంది. ఈ సీరియల్ వచ్చిన 17 నెలల్లో నటుడు అశోక్‌కుమార్‌కు ‘మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటామ’ని 4 లక్షల మంది అమ్మాయిలు ఉత్తరాలు రాశారు. దానిని బట్టి ఈ సీరియల్ ఎంతటి జనాదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు.
రెండవ అడుగు
‘ఏ జో హై జిందగీ’ పేరుతో 1984లో కేవలం 67 ఎపిసోడ్స్‌తో హాస్య ధారావాహిక రూపొందింది. భార్యాభర్తలైన రంజిత్‌వర్మ, రేణు వర్మల మధ్య చోటు చేసుకునే ఫన్నీ సందర్భాలను దీంట్లో చూపించారు. ‘హమ్‌లోగ్’ ముగిసిన ఐదు నెలలకు (మే 1986) ‘బునియాద్’ సీరియల్ ప్రారంభమైంది. 1947లో ఇండియా–పాకిస్తాన్ విభజన నాటి సామాజిక స్థితిగతుల ఆధారంగా ఈ కథను నడిపించారు రచయిత కమల్‌సైగల్. దానికి అందమైన దృశ్యరూపం ఇచ్చారు దర్శకులు రమేష్ సిప్పి, జ్యోతీ స్వరూప్. ఉద్యోగాలు చేసుకునే ఒంటరి మహిళలు ఒకింట్లో పెయింగ్‌గెస్ట్‌గా చేరడం, అక్కడ ఎదురయ్యే సమస్యలు, సరదా విషయాలను ‘ఇధర్ ఉధర్’ (1985) లో చూపించారు.
ఇదే సీరియల్‌ను తిరిగి 1998లో రెండవ సీజన్‌గా ప్రసారం చేశారు. ఆ తర్వాత సీరియల్స్ ట్రెండ్‌ను ఓ ఊపు ఊపినవి.. అశేష జనాన్ని టీవీల ముందు కట్టిపడేసినవి ఇతిహాసాలైన రామాయణ్ (1987–1988), మహాభారత్ (1989–1990)లు. ఒక ఆధ్యాత్మిక భావనను ఈ రెండు సీరియళ్లు ప్రతి మదిని తట్టిలేపాయి. దేవతలే తమ నట్టింటికి వచ్చి అలనాటి కథను చూపుతున్నట్టు ఫీలయ్యారు జనం. టీవీల ముందు కొబ్బరికాయలు కొట్టి, హారతలు పట్టారు. 1980 నుంచి 90ల కాలంలో బుల్లితెర పై దూరదర్శన్ సీరియల్స్‌కి మహర్దశ పట్టిందని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాతి వరుస క్రైమ్ థ్రిల్లర్‌ది. ‘కరమ్‌చంద్’, ‘బ్యోంకేశ్ బక్షీ’, జాన్‌కీ జాసూస్’తో పాటు చారిత్రక నేపథ్యం ఉన్న చంద్రకాంత, చాణక్య, జనం నాడితో ఫీట్లు చేయించిన సర్కస్ .. వంటి సీరియల్స్‌తో ప్రతి ఇంటా బుల్లితెర ఓ అనివార్యమైన వస్తువయ్యింది.
మూడవ అడుగు
అప్పటివరకు సామాజిక పరిస్థితులు, చారిత్రకాంశాలమీద ఫోకస్‌పెట్టిన సీరియళ్ల కన్ను ఆటపాటలు, పుస్తకాలతో కుస్తీపట్టే పిల్లల వైపు మళ్లింది. ఇది బుల్లితెర వామనుడి మూడవ అడుగుగా చెప్పవచ్చు. బామ్మలు చెప్పిన కథలకు దృశ్యరూపం బుల్లితెర ఆకాశమే హద్ధయ్యింది. మాల్గుడి డేస్, విక్రమ్ బేతాల్, తెనాలి రామకృష్ణ.. వంటి సీరియల్స్ పిల్లలు ఎక్కడున్నా సమయానికి లాక్కొచ్చి కూర్చోబెట్టేవి. పెద్దలనూ టీవీల ముందు నుంచి కదలనిచ్చేవి కావు. ఈ మూడవ అడుగుతో సీరియల్ అన్ని తరాలనూ తన వైపు తిప్పుకుంది. హిందీ సీరియల్స్‌తో నార్త్ టు సౌత్‌ను ఆకట్టుకుంటున్న మన బుల్లితెర ఆ తర్వాత మరాఠీ, గుజారాతీ, బెంగాలి, తమిళ, కన్నడ, ఒడియా, తెలుగు, మలయాళం.. ఇతర అన్ని భాషలలో సీరియళ్లని చూపించడం మొదలుపెట్టింది.
(వచ్చేవారం మరికొంత)
– నిర్వహణ: నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment