ఈ రోజుల్లో సీఐడీ సీరియల్ హిందీలోనే కాకుండా అన్ని భాషల్లోనూ ప్రసారమవుతోంది. వేల ఎపిసోడ్లుగా వచ్చిన సీఐడి లాంటి సీరియల్స్‌కి అంకురం వేసింది మాత్రం నాటి దూరదర్శన్ సీరియల్ కరమ్‌చంద్. సిల్లీ క్వెశ్చన్స్‌తో కిట్టీ, ఫన్నీ మ్యానరిజంతో కరమ్‌చంద్ చిన్నచిన్న ఆధారాలతో నేరస్తులను పట్టుకుంటూ చిన్నతెరమీద చేసిన హంగామాయే డిటెక్టివ్ ‘కరమ్‌చంద్.’
డిటెక్టివ్ అంటే నోట్లో పొడవాటి సిగార్ ఉండదు. ఎదుటివారి కళ్లలో వెతికే అనుమానపు జాడలు ఉండవు. అసలు, అప్పటి వరకు నవలల్లో చదివిన కథానాయకుడిలా ఈ డిటెక్టివ్ ఉండనే ఉండడు. ఈ డిటెక్టివ్ కరమ్‌చంద్ చాలా డిఫరెంట్. కేసులను క్యారెట్లలా కరకర నమిలేస్తూ నేరస్తులను అవలీలగా చట్టానికి పట్టిస్తుంటాడు.
షెల్ఫ్‌లో మిస్టరీ
భర్త చనిపోవడంతో మిసెస్ లోబో లాండ్రీ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు చెడు వ్యసనాల బారిన పడి తల్లిని డబ్బులివ్వమని వేధిస్తూ ఉంటాడు. ఓ రోజు లాండ్రీలో పని చేసే మోహన్ ఇంటికి వెళ్లిపోతానంటే ‘ఇంకా పని మిగిలి ఉంది. షట్టర్ కిందకు దించేసి వెళ్లిపొమ్మ’ని చెబుతుంది లోబో. మరుసటిరోజు ఉదయం మోహన్ వచ్చి చూసేసరికి షట్టర్ కిందకు అలాగే దించి ఉంటుంది, తాళం ఉండదు. ఆశ్చర్యపోయిన మోహన్ ‘మేడమ్, ముందే వచ్చి, బయటకు వెళ్లి ఉంటారు’ అనుకొని పనిలో నిమగ్నమవుతాడు.
లాండ్రీ బట్టలు ఇవ్వమని కస్టమర్ సంధ్య, తన కోటు ఇవ్వమని డిటెక్టివ్ కరమ్‌చంద్ అక్కడకు వస్తారు. వారి బట్టల కోసం వెతుకుతుండగా మిసెస్ లోబో షెల్ఫ్‌లో శవమై కనిపిస్తుంది. మిసెస్ లోబోను ఎవరు చంపారన్నది పెద్ద మిస్టరీగా మారుతుంది. కస్టమర్ సంధ్యకి ఆమె మాజీ ప్రియుడు రాసిన ఉత్తరం లాండ్రీ బట్టల్లో ఉండిపోతుంది. ఉత్తరం కోసమై వచ్చిన సంధ్య భర్త తనకేమీ తెలియదన్న లోబోను కొట్టడం వల్ల ఆమె చనిపోయిందన్న విషయాన్ని షోరూమ్‌లో దొరికిన మందుల డబ్బా ఆధారంగా నిరూపిస్తాడు డిటెక్టివ్ కరమ్^è ంద్.
నకిలీ పెయింటింగ్
రాజేష్–అంజు భార్యాభర్తలు. వారింటి అల్మారాలో డెడ్‌బాడీ ఉన్నట్టు తెలుస్తుంది. స్క్రూడ్రైవర్ ఆయుధంగా హంతకుడు ఈ ఘాతుకం చేశాడని తెలుసుకుంటాడు కరమ్‌చంద్. అక్కడ దొరికిన స్క్రూ ఆధారంగా కేసు స్టడీ చేస్తాడు. ఆ హాల్‌లో ఉన్న అత్యంత ఖరీదైన పెయింటింగ్‌ను దొంగిలించి, దాని ప్లేస్‌లో నకిలీ పెయింటింగ్‌ను ఉంచడానికి కబీర్‌చంద్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా అసలు విషయాన్ని బయటపెడతాడు కరమ్‌చంద్.
నేరమూ–శోధన
ఇలా అన్నీ నేర కథనాలే. అనుకోకుండా జరిగిన హత్యలు కొన్ని. కావాలని చేసిన హత్యలు మరికొన్ని. మనుషులను మనుషులు చంపుకుంటూ సమాజం నుంచి తప్పించుకు తిరగాలనుకునేవారిని డిటెక్టివ్ కరమచంద్ శోధించి సాధించి ప్రేక్షకుల ముందు నిలబెడతాడు. నేరస్తులను పట్టుకునేవిధానంలో చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ చూపిస్తారు. ఇది చూసిన ప్రేక్షకులు డిటెక్టివ్ తెలివిని మెచ్చుకుంటూ చప్పట్లతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ‘కరమ్‌చంద్’ పేరుతో 1985లో వచ్చిన ఈ డిటెక్టివ్ సీరియల్ దూరదర్శన్ ప్రేక్షకులలో ఆసక్తిని రేపింది. నేరాలను ఎలా శోధిస్తారో, నిందితులను చిన్న చిన్న ఆధారాల ద్వారా ఎలా పట్టుకుంటారో చూపించింది. మొత్తం 50 ఎపిసోడ్లు. కరమ్‌చంద్‌ను హీరోని చేసేసింది దూరదర్శన్. అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పంకజ్‌కపూర్ డిటెక్టివ్ పాత్ర పోషిస్తే, బాలీవుడ్ నటి సుస్మితా ముఖర్జీ కిట్టీ పేరుతో అతని సెక్రటరీగా నటించారు. ఈ ఇద్దరినీ ప్రేక్షకులు అమితంగా ప్రేమించారు. ఇలాంటి డిటెక్టివ్‌ను మళ్లీ ఇప్పుడు చూడలేం అంటారు అప్పటి ప్రేక్షకులను పలకరిస్తే.
– ఎన్.ఆర్
కరమ్‌చంద్ సీరియల్ ఎంత పెద్ద హిట్ సాధించిందో చెప్పడానికి రెండవ సీజన్‌నీ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మొదటి భాగం దూరదర్శన్‌లో 1985లో వస్తే, రెండవ సీజన్ 2007లో సోనీ టీవీలో వచ్చింది. సీజన్1లో ఎపిసోడ్ సమయం 25 నిమిషాలు ఉంటే, సీజన్ 2లో సీరియల్ నిడివిని 45 నిమిషాలకు పెంచారు. రెండవ సీజన్‌లోనూ కరమ్‌చంద్‌గా పంకజ్ కపూర్ నటించారు. కిట్టీగా సుచేత ఖన్నా అలరించారు.
‘షటప్ కిట్టీ..!’
డిటెక్టివ్ కరమ్‌చంద్‌కి ఒక ఫన్నీ అసిస్టెంట్ ఉంటుంది. ఆమె పేరు కిట్టీ. సిల్లీ క్వెశ్వన్స్‌తో కరమ్‌చంద్‌ను విసిగించడమే పనిగా ఉంటుంది. లేదంటే రహస్యాన్ని ముందే బయట పెట్టేస్తుంది. వర్క్ పట్ల ఆమెకున్న డెడికేషన్ వల్ల కరమ్‌చంద్ చాలా ఓపికగా భరిస్తూ ఉంటాడు. కేసులో కిట్టీ విచిత్రప్రశ్నలను సంధించిన ప్రతీసారి ‘షట్ అప్ కిట్టీ’ అనే మాటను ఈ డిటెక్టివ్ ఉపయోగిస్తుంటాడు.
క్యారెట్లు.. నల్లకళ్లద్దాలు
డిటెక్టివ్‌కు ఒక మ్యానరిజం ఉండాలని, అందుకు తనదైన మార్క్ ఉండాలని ఆలోచించారు దర్శకుడు పరాశర్. ఆ బాడీలాంగ్వేజ్ ప్రేక్షకుల మదిలో అలాగే నిలిచిపోవాలనీ అనుకున్నారు. అందుకు ఓ పద్ధతిని ఎంచుకున్నారు. కరమ్‌చంద్‌ను ‘కాఫీ తాగుతారా’ అని అడిగితే– ‘ఎసిడిటీ రావచ్చు’ అంటాడు. ‘సిగెరెట్..’ అంటూ ఆఫర్ చేస్తే ‘లంగ్స్‌కి ఎఫెక్ట్..’ అంటాడు. అదే సమయంలో నా దగ్గర గాజర్ ఉందిగా అంటూ క్యారెట్ తీసుకొని కరకర నములుతూ ఉంటాడు. కేసులను కూడా ఇలాగే నమిలేస్తా అంటూ క్యారెట్‌తో చూపుతుంటాడు. మిస్టరీ అని చెప్పడానికి సూచనగా కళ్లద్దాల పై నుంచి, పక్కగా చూపులను సారించడం నాటి టెలివిజన్‌కు కొత్త కళను తెచ్చింది. కరమ్‌చంద్ పాత్రకు పంకజ్ కపూర్ వన్నె తెచ్చారు అనేవారంతా. కరమ్‌చంద్ పుణ్యమా అని క్యారెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయేవట. నల్ల కళ్లద్దాల అమ్మకాలు వింటర్‌లోనూ విపరీతంగా ఉండేవట.
పరాశర్‌కి నచ్చిన పంకజ్ కపూర్
కరమ్‌చంద్ క్యారెక్టర్‌కి ముందు ‘హమ్‌లోగ్’ పాత్రధారి అలోక్‌నాథ్‌ని, కిట్టీగా సుధీర్ మిశ్రాను అనుకున్నారట. అలోక్‌నాథ్‌కి– దర్శకుడు పంకజ్ పరాశర్‌కి ఏవో మనస్పర్ధలు రావడంతో ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయారు. ‘పంకజ్‌కపూర్‌ని చూసినప్పుడు నాకు ముందు సినీ నటుడు దిలీప్‌కుమార్ గుర్తుకు వచ్చారు. నా అభిమాన నటుడు సీరియల్‌లో నటించడానికి వచ్చాడనుకున్నాను. వారానికి 1500 రూపాయలు ఇచ్చే అంగీకారం మీద పంకజ్ ముంబయ్‌కి వచ్చారు’ అని పరాశర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరో విచిత్రమేమంటే ఈ సీరియల్‌కి రచయితగా పంకజ్‌ప్రకాశ్, దర్శకుడిగా పంకజ్ పరాశర్, నటుడిగా పంకజ్ కపూర్.. ఈ ముగ్గురి పేర్లలో ముందు పంకజ్ అని ఉండడం యాదృచ్ఛికమే.
Comments
Please login to add a commentAdd a comment