జీవితం నేర్పే పాఠాలు | Teach life lessons | Sakshi

జీవితం నేర్పే పాఠాలు

Oct 12 2014 1:10 AM | Updated on Sep 29 2018 5:29 PM

ఆకాశవాణి, దూరదర్శన్‌లలో పనిచేసే రోజుల్లో ప్రైవేటు టీవీ ఛానెళ్ల చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు వచ్చినా ఆసక్తి చూపలేదు.

ఆకాశవాణి, దూరదర్శన్‌లలో పనిచేసే రోజుల్లో ప్రైవేటు టీవీ ఛానెళ్ల చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు వచ్చినా ఆసక్తి చూపలేదు. పదవీ విరమణ అనంతరం మాత్రం పాల్గొంటూ వస్తున్నాను. వీటికోసం కొన్ని రోజులు తెల్లవారుఝామునే తయారు కావాల్సి వస్తోంది. నేనైతే మా ఆవిడ పొద్దున్నే లేచి ఇచ్చే కాఫీ తాగి వెడుతున్నా కాని, నన్ను స్టూడియోలకు తీసుకువెళ్లడానికి వచ్చే ఛానెల్ కారుడ్రైవర్ల సంగతి ఏమిటని ఆలోచించి, ‘టిప్పు’ ఇవ్వడం అలవాటు చేసుకున్నాను.

వీళ్లలో  రకరకాల వయస్సు వాళ్లు ఉంటారు. పొరుగుజిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చి, స్నేహితుల గదుల్లో తాత్కాలిక ఆవాసం ఏర్పరచుకుని, బతుకుబండి లాగించేవాళ్లే ఎక్కువ. వాళ్లకు టిప్పు ఇవ్వడం మెహర్బానీగా నేను అనుకోలేదు. వాళ్లు కూడా అపార్థం చేసుకోలేదు. కొందరు ‘‘ఎందుకు సార్, మా డ్యూటీ మేం చేస్తున్నాం’’ అని మృదువుగా అనేవారు.
 
కొంతకాలం క్రితం ఓ స్టూడియో నుంచి తిరిగొస్తూ, కూడలి వద్ద సిగ్నల్ పడ్డప్పుడు పర్స్ తీసి డ్రైవర్‌కు పది నోటు తీసిచ్చాను. అతగాడు ఆ నోటు జేబులో పెట్టుకోకుండా, ఒకచోట కారు వేగం తగ్గించి, రోడ్డుపక్కన ముసలి బిచ్చగత్తె చేతిలో పెట్టాడు. అది చిత్రంగా అనిపించి నోరు తెరిచేలోగా ‘మాఫ్ కీజియే సాబ్’ అంటూ తన మనసులో మాట చెప్పాడు. ‘‘ఈ డ్రైవర్ ఉద్యోగం కోసం సిటీకి వస్తున్నప్పుడు మా అమ్మ ఓ మాట చెప్పింది. అవసరం అయితేనే ఎవరినుంచైనా డబ్బు తీసుకో. నీ దగ్గర డబ్బు ఉంటే నీకంటే అవసరం ఎక్కువ ఉన్నవాళ్లకు దాన్నివ్వు. తీసుకోవడం తేలిగ్గా అలవాటు అవుతుంది. ఇవ్వడమే కష్టం. అమ్మ మాట ప్రకారం మీరిచ్చిన డబ్బు ఆమెకు ఇచ్చాను. మీరు వేరే విధంగా అనుకో కండి’’ అన్నాడు. అనుకోవడానికి ఏముంది, ఓ కొత్త పాఠం నేర్చుకునే అవకాశం జీవితం నాకిచ్చిందనుకున్నాను.
 - భండారు శ్రీనివాసరావు హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement