tipu
-
సార్. నేను చనిపోయానా?
జనగామ: బతికి ఉన్న వ్యక్తిని చనిపోయినట్లుగా నిర్ధారించి మునిసిపల్ అధికారులు మరో తప్పు చేశారు. సర్వీసు బుక్కు వివాదం మరచిపోకముందే.. ‘డెత్’ సమస్య అధికారులకు తలనొప్పిగా మారింది. ‘నేను బతికే ఉన్నాను.. నేను చనిపోయినట్లుగా ధ్రువీకరించింది ఎవరు’ అంటూ బాధితుడు అధికారులను నిలదీసిన ఘటన గురువారం జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్ రఫత్ షాకాన్ అలియాస్ టిప్పు ప్రైవేట్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మునిసిపల్ పరిధిలోని గ్రంథాలయ సముదాయానికి సంబంధించి ఓ షెట్టర్‌ను అద్దెకు తీసుకున్నాడు. టిప్పు ప్రైవేట్‌గా పని చేస్తుండటంతో తన పేరిట ఉన్న షెట్టర్‌ను బంధువుకు అప్పగించాడు. షెట్టర్ల లీజు గడువు 2017 డిసెంబర్ 31న ముగిసిపోవడంతో మునిసిపల్ అధికారులు యజమానులకు నోటీసులు పంపారు. అద్దెకుంటున్న వారి వివరాలు, చనిపోయిన లీజుదారుల పేర్లను ఎజెండాలో పొందుపరిచారు. అం దులో టిప్పు పేరు కూడా ఉంది. విషయం తెలుసుకున్న టిప్పు.. మునిసిపల్ కార్యాలయానికి వెళ్లి ‘సార్.. నేను చనిపోయానా’ అంటూ ప్రశ్నించడంతో అధికారులు నీళ్లు నమిలారు. తప్పు జరిగింది వాస్తవమేనని, విచారణ జరుపుతామని మేనేజర్ రమాదేవి చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకోవా లని కౌన్సిలర్ ఎజాజ్ డిమాండ్ చేశారు. -
జీవితం నేర్పే పాఠాలు
ఆకాశవాణి, దూరదర్శన్లలో పనిచేసే రోజుల్లో ప్రైవేటు టీవీ ఛానెళ్ల చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు వచ్చినా ఆసక్తి చూపలేదు. పదవీ విరమణ అనంతరం మాత్రం పాల్గొంటూ వస్తున్నాను. వీటికోసం కొన్ని రోజులు తెల్లవారుఝామునే తయారు కావాల్సి వస్తోంది. నేనైతే మా ఆవిడ పొద్దున్నే లేచి ఇచ్చే కాఫీ తాగి వెడుతున్నా కాని, నన్ను స్టూడియోలకు తీసుకువెళ్లడానికి వచ్చే ఛానెల్ కారుడ్రైవర్ల సంగతి ఏమిటని ఆలోచించి, ‘టిప్పు’ ఇవ్వడం అలవాటు చేసుకున్నాను. వీళ్లలో రకరకాల వయస్సు వాళ్లు ఉంటారు. పొరుగుజిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చి, స్నేహితుల గదుల్లో తాత్కాలిక ఆవాసం ఏర్పరచుకుని, బతుకుబండి లాగించేవాళ్లే ఎక్కువ. వాళ్లకు టిప్పు ఇవ్వడం మెహర్బానీగా నేను అనుకోలేదు. వాళ్లు కూడా అపార్థం చేసుకోలేదు. కొందరు ‘‘ఎందుకు సార్, మా డ్యూటీ మేం చేస్తున్నాం’’ అని మృదువుగా అనేవారు. కొంతకాలం క్రితం ఓ స్టూడియో నుంచి తిరిగొస్తూ, కూడలి వద్ద సిగ్నల్ పడ్డప్పుడు పర్స్ తీసి డ్రైవర్‌కు పది నోటు తీసిచ్చాను. అతగాడు ఆ నోటు జేబులో పెట్టుకోకుండా, ఒకచోట కారు వేగం తగ్గించి, రోడ్డుపక్కన ముసలి బిచ్చగత్తె చేతిలో పెట్టాడు. అది చిత్రంగా అనిపించి నోరు తెరిచేలోగా ‘మాఫ్ కీజియే సాబ్’ అంటూ తన మనసులో మాట చెప్పాడు. ‘‘ఈ డ్రైవర్ ఉద్యోగం కోసం సిటీకి వస్తున్నప్పుడు మా అమ్మ ఓ మాట చెప్పింది. అవసరం అయితేనే ఎవరినుంచైనా డబ్బు తీసుకో. నీ దగ్గర డబ్బు ఉంటే నీకంటే అవసరం ఎక్కువ ఉన్నవాళ్లకు దాన్నివ్వు. తీసుకోవడం తేలిగ్గా అలవాటు అవుతుంది. ఇవ్వడమే కష్టం. అమ్మ మాట ప్రకారం మీరిచ్చిన డబ్బు ఆమెకు ఇచ్చాను. మీరు వేరే విధంగా అనుకో కండి’’ అన్నాడు. అనుకోవడానికి ఏముంది, ఓ కొత్త పాఠం నేర్చుకునే అవకాశం జీవితం నాకిచ్చిందనుకున్నాను. - భండారు శ్రీనివాసరావు హైదరాబాద్ -
టిప్పు ప్రేమకథకు శ్రీకారం
ప్రముఖ పంపిణీదారుడు డి.బి. సీతారామరాజు (‘వైజాగ్’ రాజు) తనయుడు కార్తీక్ హీరోగా పరిచయ మవుతున్న చిత్రం ‘టిప్పు’. సంస్కృతి, కనికా కపూర్ కథానాయికలు. జగదీశ్ దానేటి దర్శకుడు. ఈ చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో మొదలైంది. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు పూజా కార్యక్రమాలు నిర్వహించగా, ముహూర్తపు దృశ్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్-గ్రామీణ నీటిపారుదల శాఖామాత్యులు అయ్యన్న పాత్రుడు కెమెరా స్విచాన్ చేశారు. తెలంగాణ ఐటీ - పంచాయతీరాజ్ శాఖమంత్రి కె.తారకరామారావు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘చక్కని ప్రేమకథాచిత్రమిది. హైదరాబాద్, బెంగళూరు, మైసూరుల్లో చిత్రీకరణ జరుపుతాం. పాటలు విదేశాల్లో తీస్తాం’’ అని తెలిపారు. నటునిగా తన తొలి అడుగు ఓ మంచి కథతో పడటం ఆనందంగా ఉందని కార్తీక్ అన్నారు. యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మంత్రులూ సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఇరు ప్రాంతాల్లో సినిమా అభివృద్ధి కావాలి: కేటీఆర్ చెన్నై నుంచి తెలుగు సినిమాను హైదరాబాద్ తరలించడానికి ఎందరో మహానుభావులు శ్రమిం చారు. ప్రస్తుతం భాగ్యనగరంలో తెలుగు సినిమా కళకళలాడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండు నెలలు దాటింది. ఈ కారణంగా చిన్న చిన్న సమస్యలు రావడం సహజం. అవన్నీ పయనించే మేఘాల్లాంటివి. త్వరలో అన్నీ చక్కబడతాయి. భారతీయ సినిమా కేంద్రంగా హైదరాబాద్‌ని అభివృద్ధి చేయడమే మా తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు, వైజాగ్‌లో కూడా తెలుగు సినిమా అభివృద్ధి చెందాలి. వైజాగ్, అరకు ప్రాంతాలు సినిమాకు అనుకూలాలు. కళాకారుడికి ప్రాంతీయ భేదాలుండవ్ - అయ్యన్న పాత్రుడు రాష్ట్రం రెండుగా విడిపోయింది కాబట్టి, పరిశ్రమలో కూడా మార్పులొస్తాయని పలువురు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. వారికి చెప్పేదొక్కటే. కళాకారుడు ఏ ప్రాంతం వాడైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. వారికి ప్రాంతీయభేదాలుండవ్. సినిమాను నమ్ముకొని ఇక్కడ కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. వారందరికీ మరింత ఉపాధి లభించాలి. అలాగే... వైజాగ్‌లో కూడా తెలుగు సినిమాను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.