మహ్మద్ రఫత్ షాకాన్
జనగామ: బతికి ఉన్న వ్యక్తిని చనిపోయినట్లుగా నిర్ధారించి మునిసిపల్ అధికారులు మరో తప్పు చేశారు. సర్వీసు బుక్కు వివాదం మరచిపోకముందే.. ‘డెత్’ సమస్య అధికారులకు తలనొప్పిగా మారింది. ‘నేను బతికే ఉన్నాను.. నేను చనిపోయినట్లుగా ధ్రువీకరించింది ఎవరు’ అంటూ బాధితుడు అధికారులను నిలదీసిన ఘటన గురువారం జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్ రఫత్ షాకాన్ అలియాస్ టిప్పు ప్రైవేట్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మునిసిపల్ పరిధిలోని గ్రంథాలయ సముదాయానికి సంబంధించి ఓ షెట్టర్‌ను అద్దెకు తీసుకున్నాడు. టిప్పు ప్రైవేట్‌గా పని చేస్తుండటంతో తన పేరిట ఉన్న షెట్టర్‌ను బంధువుకు అప్పగించాడు.
షెట్టర్ల లీజు గడువు 2017 డిసెంబర్ 31న ముగిసిపోవడంతో మునిసిపల్ అధికారులు యజమానులకు నోటీసులు పంపారు. అద్దెకుంటున్న వారి వివరాలు, చనిపోయిన లీజుదారుల పేర్లను ఎజెండాలో పొందుపరిచారు. అం దులో టిప్పు పేరు కూడా ఉంది. విషయం తెలుసుకున్న టిప్పు.. మునిసిపల్ కార్యాలయానికి వెళ్లి ‘సార్.. నేను చనిపోయానా’ అంటూ ప్రశ్నించడంతో అధికారులు నీళ్లు నమిలారు. తప్పు జరిగింది వాస్తవమేనని, విచారణ జరుపుతామని మేనేజర్ రమాదేవి చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకోవా లని కౌన్సిలర్ ఎజాజ్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment