కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఎల్‌ఈడీ సిగ్నల్ లైట్లు
సాక్షి, సిటీబ్యూరో: ‘సైఫాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన ద్విచక్ర వాహనంపై మెహిదీపట్నం వైపు వెళ్తున్నాడు. మాసబ్‌ట్యాంక్ చౌరస్తా వద్ద ఓ బస్సు వెనుక ఉండి డ్రైవ్ చేస్తున్నాడు. దీంతో ఇతడికి సిగ్నల్ స్తంభం తప్ప దానికి ఉండే రెండు సిగ్నల్స్ కనిపించలేదు. అప్పటి వరకు ‘గ్రీన్’గా ఉన్న సిగ్నల్ హఠాత్తుగా ‘రెడ్’గా మారింది. ముందు బస్సుతో పాటే వెళ్తున్న ఇతడికి జంక్షన్ అవతల వైపు ఉన్న ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని చలానాతో పాటు పెనాల్టీ పాయింట్ సైతం విధించారు.’ సిటీలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్‌తో అనేక మంది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కచ్చితంగా నిబంధనలు పాటించే వారైనా, తమ తప్పు లేకపోయినా జరిమానాతో పాటుపెనాల్టీ పాయింట్ తప్పట్లేదు. దీన్ని పరిగణలోకి తీసుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ట్రాఫిక్ సిగ్నల్స్‌కు ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద అమలులోకి తీసుకువచ్చారు. కొన్నాళ్ల అధ్యయనం తర్వాత మార్పుచేర్పులు చేస్తూ అన్ని జంక్షన్లలోనూ అమలులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు.
ఆ ఉల్లంఘన ప్రమాదకరం కావడంతో...
సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు రహదారి నిబంధనల ఉల్లంఘనల్ని మూడు రకాలుగా విభజిస్తారు. వాహనచోదకుడికి ప్రాణాంతకమైనవి, ఎదుటి వ్యక్తికి ప్రాణాంతకమైనవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ప్రాణాంతకమైనవి. సిగ్నల్ జంపింగ్ అనేది ఈ మూడో కేటగిరీ కిందికి వస్తుందని పోలీసులు చెప్తున్నారు. ఓ వాహనచోదకుడు చేసిన తప్పువల్ల నిబంధనలు పాటించే ఎదుటి వ్యక్తి నష్టపోయే ప్రమాదం ఉందని, అందుకే ఇలాంటి నిబంధనల్ని కచ్చితంగా అమలు చేస్తామని అంటున్నారు. అయితే ప్రస్తుతం సిటీలో ఉన్న సిగ్నల్ స్తంభాల్లో రెండు చోట్ల మాత్రమే సిగ్నల్ లైట్లు ఉంటున్నాయి. రోడ్డుకు కుడి పక్కన ఉండే స్తంభం మధ్య భాగంలో, దానికి పైన రోడ్డు మధ్యలోకి వచ్చే విధంగా మరోటి (థర్సర్ సిగ్నల్) మాత్రమే ఉంటున్నాయి. దీంతో ముందు వరుసలో పెద్ద వాహనాలు ఉండే వెనుక వారికి ఆ సిగ్నల్స్ కనిపించవు. ఫలితంగా వారి తప్పు లేకుండానే ఉల్లంఘనులుగా మారిపోతున్నారు.
ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేసి...
ఈ తరహా ఉదంతాలను పరిగణలోకి తీసుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం సిగ్నల్ లైట్లు మాత్రమే కాకుండా స్తంభం కూడా ఏ రంగు సిగ్నల్ ఉందో చూపే విధంగా చేయాలని యోచించారు. ఇలా చేస్తే లైట్లు కనిపించకున్నా స్తంభాన్ని చూసైనా ముందుకు వెళ్లొచ్చా? లేదా? అనేది వాహన చోదకులు నిర్ధారించుకోవచ్చని ఓ ఆలోచన చేశారు. సిగ్నల్ స్తంభానికి రెండు ప్రాంతాల్లో ఉండే లైట్ల మధ్యలో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు వీటిని సిగ్నల్‌తో అనుసంధానిస్తున్నారు. ఫలితంగా రెడ్ సిగ్నల్ పడితే ఈ ఎల్‌ఈడీ లైట్లు ఆ రంగులో, గ్రీన్ పడితే ఆ రంగులోకి మారతాయి. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద ఆయకార్ భవన్ నుంచి కమిషనరేట్‌కు వెళ్లే సిగ్నల్‌కు ఏర్పాటు చేశారు. అధ్యయనం తర్వాత వీటిని విస్తరించనున్నారు. ఇలా చేయడంతో సుదూర ప్రాంతాల్లో ఉన్న వారికీ ఇక సిగ్నల్ కనిపిస్తుందని, పొరపాటున జరిగే ఉల్లంఘనులకు చెక్ చెప్పడం, ప్రమాదాలు తగ్గించడానికి ఇది ఉపకరిస్తుందని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment