స్మార్ట్ చేంజెస్
-
కూడళ్ల కుదింపుపై దృష్టి
-
తెరపైకి ట్రాఫిక్ సిగ్నల్స్
-
నో పోలీస్..నో సిగ్నల్ లేనట్లే
కరీంనగర్ కార్పొరేషన్ : నగరంలోని కూడళ్ల కుదింపుపై అధికారులు దృష్టిసారించారు. ఆర్‌అండ్‌బీ రహదారుల పునరుద్ధరణలో భాగంగా కూడళ్లను అభివృద్ధి చేశారు. అయితే వీటిని శాస్త్రీయంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ట్రాఫిక్ సమస్య నుంచి నగరానికి విముక్తి కలిగించేందుకు అప్పటి అధికారులు కూడళ్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. వాహనదారులు ఈ కూడళ్ల వద్దకు చేరుకున్నాక వేగం తగ్గించి వెళ్లేలా వెడల్పాటి ఐలాండ్‌లను నిర్మించి చుట్టూ డివైడర్లు ఏర్పాటు చేశారు. వాహనాలు చౌరస్తాల్లోకి రాగానే ఆటోమెటిక్‌గా స్లోకావడం ఒకటి తర్వాత ఒకటి వెళ్లడం జరగుతోంది.
సుందర కూడళ్లపై దృష్టి
ఆర్‌అండ్‌బీ రహదారులకు నిధుల వరద వస్తుండడంతో కూడళ్లను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కూడళ్ల చుట్టూ ఫెన్సింగ్, వాటర్ ఫౌంటేన్, పూలమొక్కల ఏర్పాట్లతోపాటు ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. కూడళ్లను కుదించి, చుట్టూ ఉన్న రోడ్లను వెడల్పు చేయాలన్నది ఈ ప్రతిపాదనల్లో భాగంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే మళ్లీ చుట్టూ పార్కింగ్‌లతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దాతల సహకారంతో జంక్షన్లు
‘మన నగరం... కరీంనగరం’ పేరుతో నాలుగేళ్ల క్రితం కూడళ్లను అభివృద్ధి చేశారు. అప్పటి ప్రభుత్వం, అధికార యంత్రాంగం ప్రజల సహకారంతో కూడళ్లను అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది. దాతలను వెతికి వారికి జంక్షన్ల సుందరీకరణ పనులు అప్పగించారు. కమాన్‌చౌరాస్తాకు రూ.10 లక్షలు, చొక్కారావు చౌరస్తాకు రూ.15 లక్షలు, బస్టాండ్ జంక్షన్‌కు రూ.25 లక్షలు, తెలంగాణచౌక్ జంక్షన్‌కు రూ.25 లక్షలు, కోర్టు జంక్షన్‌కు రూ.25 లక్షలు, మంచిర్యాలచౌరస్తాకు రూ.10 లక్షలు, ఐబీ జంక్షన్‌కు రూ.10 లక్షలు మొత్తం రూ.1.2 కోట్లు ఖర్చుపెట్టారు.
భవిష్యత్ ప్రణాళిక
నగంలో ట్రాఫిక్ సమస్య లేకుండా ఇన్నాళ్లు సజావుగానే సాగింది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా కూడళ్లు లేవని ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు నిర్మించిన ఈ ఐలాండ్‌లు మార్పు చేయాలనే ఆలోచన అధికారుల్లో మొదలైంది. ఇందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. దీంతో కూడళ్లు కొత్త రూపును సంతరించుకోనున్నాయి. ఇప్పటి వరకు ‘నో సిగ్నిల్... నో పోలీస్’ వ్యవస్థతో నడుస్తున్న విధానం సిగ్నల్ వ్యవస్థకు మారనుంది. ప్రధాన రహదారుల్లో ఉన్న అన్ని జంక్షన్ల కుదింపుతోపాటు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది.