సిగ్నల్ కష్టాలకు చెక్
- అల్ఫాన్యూమరికల్ టైమర్ల ఏర్పాటు
- దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో అమలు
- తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద ట్రైల్ రన్ సక్సెస్
- 221 జంక్షన్లలో ఏర్పాటు
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కష్టాలకు చెక్ పడనుంది. అల్ఫాన్యూమరికల్ టైమర్లు ఏర్పాటు ద్వారా వాహనదారుల అవస్థలు తప్పనున్నాయి. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఈ విధానాన్ని ప్రారంభించనున్నారు. తెలుగుతల్లి విగ్రహం వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అది సక్సెస్ కావడంతో నెలరోజుల్లో నగరంలోని 221 జంక్షన్ల వద్ద వీటిని అమర్చనున్నారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు కసరత్తు ప్రారంభించారు.
హెచ్‌ట్రీమ్స్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థలో కొత్త అధ్యాయానికి తెరలేవనుంది. సిగ్నల్ పాయింట్ల వద్ద భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) కంపెనీ తయారు చేసిన ఆల్ఫాన్యూమరికల్ లైట్లను ఏర్పాచేయనున్నారు. వీటి ద్వారా సిగ్నల్స్ దగ్గర నిరీక్షణ తప్పనుంది. వాహనాలు లేని వైపు రెడ్ సిగ్నల్.. రద్దీ ఉన్న వైపు గ్రీన్‌సిగ్నల్ పడనుంది.
నగరంలో అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థ హైదరాబాద్ ట్రాఫిక్ ఇంటిగ్రేడెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (హెచ్-ట్రిమ్స్)ను గతేడాది ఫిబ్రవరిలో అప్పటి ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. నగరంలో సుమారు 221 జంక్షన్లలో దీనిని ఏర్పాటు చేశారు. పాదచారుల కోసం ప్రత్యేకంగా సదుపాయం కల్పించారు. నాలుగు రూట్లలో ఉన్న ట్రాఫిక్‌ను ఒకేసారి ఆపేసి నాలుగు వైపుల ఉన్న పాదచారులు ఒకేసారి రోడ్డు దాటేందుకు అనువుగా సిగ్నలింగ్ వ్యవస్థను రూపొందించారు. సోలార్ పవర్‌తో ఇవి పనిచేస్తాయి. తాజాగా సిగ్నల్స్ వద్ద అల్ఫాన్యూమరికల్ టైమర్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఆల్ఫాన్యూమెరికల్ టైమర్లు....
రెడ్..గ్రీన్..ఎల్లో లైట్ల మాదిరిగానే అల్ఫాన్యూమరికల్ టైమర్‌కు కూడా ప్రత్యేక లైట్‌ను కేటాయించారు. ఈ లైట్‌లో ఇంగ్లిష్ పదాలతో పాటు అంకెలను కూడా చూపడం ప్రత్యేకం. ఉదాహరణకు పాదచారులు దాటేటప్పుడు ‘జీవో’ అనే ఇంగ్లిష్ అక్షరాన్ని చూసిస్తుంది. వాహనాలు ఆగాల్సి వస్తే ‘స్టాప్’ అనే పదం కనిపిస్తుంది. దీంతో పాటు వాహనాలు ఎప్పుడు వెళ్లాలి..ఎప్పుడు ఆపాలి అనేవి సెకన్లలో చూపిస్తుంది.
ఇలా పనిచేస్తుంది...
హెచ్-ట్రీమ్స్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఉన్న చోట అల్ఫా న్యూమరికల్ టైమర్లను అమర్చుతారు. టైమర్ల పక్కనే చిన్నపాటి కెమెరాను అమరుస్తారు. ఇది చౌరస్తాలోని నాలుగు వైపుల రహదారులను కనిపెడుతుంది. మూడు సెకన్లకు మించి వాహనం చౌరస్తా లైన్ (వర్చువల్) దాటక పోతే వెంటనే రెడ్ సిగ్నల్ పడుతుంది. అలాగే రద్దీ ఉన్న వైపు గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఇదంతా కెమెరా సహాయంతో జరుగుతుంది.
ట్రైల్న్ సక్సెస్
అల్ఫాన్యూమరికల్ టైమర్లను పదిరోజుల కిందట తెలుగుతల్లి జంక్షన్‌లో ఏర్పాటు చేశారు. పనితీరును నిశితంగా పరిశీలించారు. ఈ చౌరస్తాలో వాహనాల రద్దీ..టైమర్ పనిచేస్తున్న విధానంపై అధికారులు ఆరా తీశారు. మంచి ఫలితాలు వచ్చాయి. ఇది విజయవంతం కావడంతో నగరంలోని 221 చౌరస్తాల్లో వీటిని అమర్చాలని అధికారులు నిర్ణయించారు. ఈ టైమర్లను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) కంపెనీ తయారు చేసింది. దేశంలోనే తొలిసారిగా నగరంలో వీటిని ఏర్పాటు చేయడం, దాని పనితీరు విజయవంతం కావడంపై బీఈఎల్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.