థానేలో ఫ్లైఓవర్ కింద నిర్మించిన కంటైనర్ స్కూల్
ఆదర్శం
ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పిల్లలు అడుక్కొనే దృశ్యం, ఏవో వస్తువులు అమ్ముకునే దృశ్యాలు చూస్తూనే ఉంటాం. మరోవైపు స్కూలు బస్సుల్లో టిప్‌టాప్‌గా బడికి వెళ్లే పిల్లల్ని కూడా చూస్తూనే ఉంటాం. ‘ఇది సహజమే’ అనుకుంటే సమస్య ఏమీ ఉండదు. సమస్య అనుకుంటే మాత్రం...సమాధానం ఎక్కడో ఒకచోట కనిపిస్తుంది. దారి చూపిస్తుంది. ముంబైలో ‘సిగ్నల్ శాల’ కూడా అలాంటిదే. ఇది మన దేశంలో తొలి రిజిస్టర్డ్ ట్రాఫిక్ సిగ్నల్ స్కూల్. సమర్థ్ భారత్ వ్యాసపీఠ్ (యస్బీవీ) అనే స్వచ్ఛంద సంస్థ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర యాచించే పిల్లలు, రకరకాల వస్తువులు అమ్ముకునే పిల్లల స్థితిగతులపై కొన్ని నెలల పాటు లోతైన అధ్యయనం నిర్వహించింది.
ముంబైలోని నాలుగు మేజర్ సిగ్నల్స్ దగ్గర సర్వేలు చేసింది. ఈ సర్వే వల్ల ‘ఎంత మంది పిల్లలు సిగ్నల్స్ దగ్గర గడుపుతున్నారు’... మొదలైన విషయాలపై స్పష్టత వచ్చింది. తరువాత పిల్లల తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు. అప్పుడు మరిన్ని వివరాలు తెలిశాయి.
అందులో చాలామంది కరువును తట్టుకోలేక మహారాష్ట్రలోని మారుమూల గ్రామాల నుంచి పొట్ట చేతబట్టుకొని వచ్చిన వారే. పల్లెల్లో కంటే పట్టణాల్లో మెరుగైన జీవితం గడుపుదామని వచ్చిన వారి జీవితం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరే తెల్లారిపోతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని... చదువుకోవడం ద్వారా పిల్లలకు కలిగే ప్రయోజనాలు ఏమిటో తల్లిదండ్రులకు చెప్పడం మొదలుపెట్టారు. వారు కూడా అనుకూలంగా స్పందించారు. షిప్పింగ్ కంటైనర్‌ను థానేలోని ఫ్లైవోవర్ కింద అందమైన క్లాస్‌రూమ్‌గా మలిచారు. ఇందులో టీచర్స్ రూమ్, టాయిలెట్‌లు కూడా ఉంటాయి. ఫ్యాన్, ప్రొటెక్టర్‌లు ఉంటాయి.
‘ఎయిర్ టైట్’ చేయడం వల్ల బయటి నుంచి వాహనాల రణగొణధ్వనులేవీ వినిపించవు. మొదట్లో ‘ప్లే స్కూలు’గానే దీన్ని ప్రారంభించారు. పిల్లలు తమ ఇష్టం ఉన్నంతసేపు క్లాసులో కూర్చోవచ్చు. తొలి రోజుల్లో పదిహేను నిమిషాల నుంచి అర్ధగంట వరకు కూర్చునేవారు. మొదట్లో సిగ్నల్స్ దగ్గర పిల్లల్ని వెదికి, వారిని బుజ్జగించి స్కూలుకు తీసుకువచ్చేవారు. ఆ తరువాత మాత్రం పిల్లలే ఉత్సాహంగా రావడం మొదలైంది. ‘సిగ్నల్ శాల’లో నలుగురు ఫుల్ టైం టీచర్లు, ఒక అటెండర్‌లతో పాటు ఇంకా చాలామంది వాటంటీర్లు ఈ స్కూలు కోసం పనిచేస్తున్నారు. కేవలం చదువు మాత్రమే కాదు...శుభ్రత, క్రమశిక్షణ... ఇలా జీవితానికి అవసరమైన అనేక విషయాలను బోధిస్తున్నారు.
ఈ స్కూల్లో చదువుకుంటున్న వాళ్లలో... చదువు రాని వాళ్లతో పాటు స్కూలు మధ్యలో మానేసిన పిల్లలు కూడా ఉన్నారు. 7వ తరగతి మధ్యలోనే చదువు ఆపేసిన పిల్లల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించి బోర్డ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ చేయిస్తున్నారు. ‘‘పిల్లలను డాక్టరో, ఇంజనీరో చేయాలనే పెద్ద పెద్ద కోరిలేవి మాకు లేవు. హుందాగా బతకడానికి అవసరమైన పునాదిని చదువు చెప్పడం ద్వారా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం’’ అంటున్నారు యస్బీవి సీయివో బటు సావంత్.
పిల్లల అభిరుచులను బట్టి వొకేషనల్ క్లాసులు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిత్రాలు, సంగీతంతో పిల్లలను ఆకట్టుకోవడానికి టాటా టెక్నాలజీని ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నారు. ఈ విధానం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. పాఠాలు చెప్పడం మాత్రమే కాదు...పిల్లల కోసం హెల్త్‌క్యాంప్‌లు కూడా నిర్వహిస్తున్నారు.
‘‘పిల్లల్లో మంచి అలవాట్లు పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నాం. తినే ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలని చెబుతుంటాం. ఇది మాత్రమే కాదు... వారికి సంబంధించి... ఇది మంచి అలవాటు కాదు... అని ఏది అనిపించినా వెంటనే చెబుతాం. ఇలా జాగ్రత్తలు చెప్పడం వల్ల... స్కూలు అనేది కేవలం పాఠాలు నేర్పేది మాత్రమే కాదు... తమ క్షేమం గురించి ఆలోచించేది అనే విషయం అర్థమవుతుంది’’ అంటున్నారు బటు సావంత్. పిల్లలకు శుభ్రమైన దుస్తులు సమకూర్చడం కోసం ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. యోగా క్లాసులు నిర్వహించడం, ఆటలు ఆడించడం, ఆర్ట్-క్రాఫ్ట్ పాఠాలు బోధిస్తున్నారు. ‘‘చదువుకోవడం ద్వారా తమ భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకం వారిలో కనిపిస్తుంది. తోటి పిల్లల్లో ఎవరైనా స్కూల్ తరువాత యాచన చేస్తే మరుసటి రోజు... ఫిర్యాదు చేస్తున్నారు’’ అని చెబుతున్నారు సావంత్. సిగ్నల్ అనేది దారి చూపుతుంది. మన క్షేమం కోరుతుంది. సిగ్నల్ దగ్గర ఉన్న ‘సిగ్నల్ శాల’ కూడా పిల్లల విషయంలో అదే చేస్తుంది.