Play School
-
ఫీజుల ‘మోత’..‘నా కుమారుడి ప్లేస్కూల్ ఫీజు రూ.4.3 లక్షలు’
న్యూఢిల్లీ : అక్షరాల రూ.4.3లక్షల ఫీజు. ఇది ఎంబీబీఎస్ చదువుకో. ఇంజినీరింగ్ చదువుకో కాదు. ప్లేస్కూల్!! కోసం. అవును మీరు విన్నది కరెక్టే కొత్త విద్యా సంవత్సరం వస్తోంది. అప్పుడే దోపిడీ ప్రణాళిక కూడా మొదలైంది. గత ఏడాది కంటే 40 శాతం నుంచి 50 శాతం వసూలు చేసేందుకు ఢిల్లీ కార్పొరేట్ స్కూల్స్ రెడీ అయినట్లు తెలుస్తోంది. దీంతో పిల్లల్ని అష్టకష్టాలు పడుతున్న పేరెంట్స్ చివరికి ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ తమ పిల్లల స్కూల్ ఫీజు రసీదులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. My son's Playschool fee is more than my entire education expense :) I hope vo ache se khelna seekhle yaha! pic.twitter.com/PVgfvwQDuy — Akash Kumar (@AkashTrader) April 12, 2024 ఢిల్లీకి చెందిన ఆకాష్ కుమార్ చార్టర్డ్ అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే తన కుమారుడు ప్లేస్కూల్ ఫీజు గురించి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో నేను మొత్తం చదివిన చదువుకు ఎంత ఫీజు చెల్లించానో.. అంతకంటే ఎక్కువగా నా కుమారుడు ప్లేస్కూల్ కోసం చెల్లిస్తున్నాను. ఆ స్కూల్లో కనీసం ఆడటం నేర్చుకుంటాడని నేను ఆశిస్తున్నాను అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. ఫీజు రిసిప్ట్‌ను సైతం ట్వీట్లో చేశారు. అందులో ఏప్రిల్ 2024 - మార్చి 2025 విద్యా సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ఫీ - రూ.10వేలు ఏడాది ఫీజు - రూ.25వేలు టర్మ్-1 (ఏప్రిల్ - జూన్ 2024) - రూ.98,750 టర్మ్-2 (జులై- సెప్టెంబర్ 2024) - రూ.98,750 టర్మ్-3 ( అక్టోబర్ -డిసెంబర్ 2024) - రూ.98,750 టర్మ్ -4 ( జనవరి - మార్చ్ 2025) - రూ.98,750 టోటల్ ఫీజు - రూ.4,40,000 అంటూ స్కూల్ ఫీజు గురించి షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ స్టోరీ పోస్ట్ చేసే సమయానికి 2.3 మిలియన్ల మంది వీక్షించారు. ఈ ట్వీట్‌పై ఢిల్లీలోని అనేక మంది తల్లిదండ్రులు తమ అనుభవాల్ని షేర్ చేస్తున్నారు. గుర్గావ్లోని ఒక వ్యక్తి ఇటీవల తన 3వ తరగతి కుమారుడి స్కూల్ ఫీజు నెలకు రూ. 30,000 చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఆ లెక్కన అతను ఇంటర్ వచ్చేసరికి ఆ మొత్తం సంవత్సరానికి రూ. 9 లక్షలకు చేరుకోవచ్చని అంచనా వేశారు. -
ప్లీజ్ ఇలాంటి స్కూల్లో పిల్లలను చేర్పించకండి
-
ప్లే స్కూల్ లో అగ్ని ప్రమాదం
-
ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ బలవన్మరణం
విశాఖపట్నం: స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఐ సూర్యనారాయణ తెలిపిన వివరాలివీ.. మువ్వల అలేఖ్య(29), ఆమె భర్త నరేష్, వారి ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులతో కలసి ఎంవీపీకాలనీలో నివాసముండేవారు. ఏఆర్‌లో కానిస్టేబుల్ అయిన నరేష్ ప్రస్తుతం సీబీఐ విభాగంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. భార్యాభర్తల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. రెండేళ్ల కిందట అలేఖ్య తన ఇద్దరు పిల్లలతో కలసి ఆరిలోవ ప్రాంతం మయూరినగర్ వచ్చేశారు. ఓ ఇల్లు అద్దెకు తీసుకొని అందులోనే ప్లే స్కూల్ నిర్వహిస్తున్నారు. 11 ఏళ్ల వయసు గల కుమారుడిని విజయవాడలో ఓ హాస్టల్లో చేర్చించారు. తొమ్మిదేళ్ల కుమార్తెతో కలసి ఆమె ప్రస్తుతం ఆరిలోవలో ఉంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆమె గదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొంతసేపటికి తల్లి ఫ్యాన్‌కు వేలాడుతున్న దృశ్యాన్ని చూసిన ఆమె కుమార్తె ఏడుస్తూ సెల్లో ఉన్న నంబర్లకు ఫోన్ చేసింది. దీంతో వెంటనే ఎంవీపీకాలనీలోని బంధువులు, గాజువాకలో ఉన్న అలేఖ్య తల్లి, బంధువులు ఆరిలోవ చేరుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. సోమవారం మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించి.. మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కాగా.. భర్త వేధింపులు తాళలేక తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని అలేఖ్య తల్లి భవాని ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు పిల్లలను తనకు అప్పగించాలని వేడుకున్నారు. సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐ సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దారుణం : స్కేలుతో చేయి విరగ్గొట్టిన టీచర్
సాక్షి, హైదరాబాద్ : మీర్పేట్లోని సత్యం టెక్నో కిడ్స్ ప్లేస్కూల్లో బుధవారం దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలే విద్యార్థి పట్ల కర్కశంగా వ్యవహరించింది. 3వ తరగతి చదువుతున్న సాయితేజ అనే విద్యార్థిని క్లాస్ టీచర్ సుజాత ఐరన్‌స్కేల్‌తో చితకబాదడంతో ఆ బాలుడి ఎడమచేయి విరిగింది. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు సంఘటన గురించి ఆరా తీయడానికి స్కూల్‌కు వెళ్లగా యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
హీరో కొడుకుతో సెల్ఫీ.. అభిమానిపై ఆగ్రహం..!
బాలీవుడ్ నటి కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ తనయుడు తైమూర్ మరోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. ఈ బుడతడు పుట్టినప్పటి నుంచి తనకంటూ ఓ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకెళ్తున్నాడు. తైమూర్ ఏం చేసినా, ఎక్కడ కనిపించినా అభిమానులకు మాత్రం పండుగే. దీంతో అతగాడు కనిపించడం ఆలస్యం కెమెరాలు క్లిక్ మనిపిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ కావడం తెలిసిందే. తాజాగా.. తన మేనత్త (సోహా అలీ ఖాన్) కూతురు ఇనాయాతో కలిసి ఓ ప్లే స్కూల్ వద్ద ఉండగా తైమూర్‌తో ఫొటో దిగాలని ఓ అభిమాని ఉవ్విళ్లూరాడు. అయితే తైమూర్‌తో సెల్ఫీ దిగాలనే అభిమాని కోరికను ఆయా నిరాకరించారు. దీంతో ఎలాగైనా ఈ స్టార్ కిడ్తో సెల్ఫీ దిగాలని భావించిన ఆ అభిమాని ఆయా మాటల్ని పట్టించుకోకుండా బలవంతంగా సెల్ఫీ తీసుకున్నాడు. షాక్ తిన్న ఆయా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నెట్టింట్లో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. -
ప్లేస్కూల్లో రెండేళ్ల బాలుడిపై..
కోల్‌కతా : మహానగరం కోల్‌కతాలోని ఓ ప్లేస్కూల్లో రెండేళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన ఘటన కలకలం రేపింది. వైద్యపరీక్షలో లైంగిక వేధింపులు జరిగినట్టు నిర్ధారణ కావడంతో నిందితులపై పోస్కో చట్టం కింద కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన ఆరోపణలను స్కూల్ యాజమాన్యం తోసిపుచ్చింది. స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు జూన్ 26 నుంచి ఎలాంటి దృశ్యాలను రికార్డ్ చేయడం లేదని పోలీసులు తెలిపారు. తల్లితండ్రుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగుచూడాల్సి ఉందని పోలీసులు చెప్పారు. -
బొమ్మల బడి...అంగన్వాడీ
మేడ్చల్‌రూరల్: చిన్నారులు మనను అనుకరిస్తూ మనలా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటారు. పిల్లలు ఎదిగే దశలో మనను అనుసరిస్తూ నేర్చుకుంటారు. కానీ చాలా మంది పిల్లలు బొమ్మలతో ఆడుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు. ప్రైవేటు ప్లే స్కూల్లకు దీటుగా ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు ఆటపాటలను నేర్పుతున్నారు. పిల్లలకు ఆటపాటలతో మనోవికాసం కలిగిస్తూ అంగన్వాడీ కేంద్రాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఎటు చూసినా ఆట వస్తువులే... అంగన్వాడీ కేంద్రాలలో ఎక్కడ చూసినా పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు, గోడలకు బొమ్మల చిత్రాలే దర్శనమిస్తున్నాయి. అంగవాడీ కేంద్రం భవనం గోడలపై తెలుగు వర్ణమాల, కూరగాయలు, పండ్ల బొమ్మలు, మనిషి అవయవాల పటాలను ఏర్పాటు చేశారు. పండ్లు, కూరగాయలు, గుర్రం, వంటి వాహనాల నమూనా ప్లాస్టిక్ బొమ్మలతో చిన్నారులకు బోధన చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు చిన్నారుల మధ్యలో కూర్చోని ఆటపాటలతో విద్యనందిస్తున్నారు. అదే విధంగా అంగన్వాడీ కేంద్రాలు ఐసీడీఎస్ నినాదాలతో, తెలుగు వర్ణమాల, ఆరోగ్యలక్ష్మి పథకం ఉద్దేశం, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపే చార్టులతో కనిపిస్తున్నాయి. మెనూ ప్రకారం.. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు మెనూ ప్రకారం పోషకాహారాలను అందిస్తున్నారు. బాలామృతం, క్రమం తప్పకుండా ప్రతి రోజు భోజనంలో ఉడకబెట్టిన గుడ్లు, పోషకాహారాలను అందిస్తున్నారు. పిల్లలకు మంచి అలవాట్లు నేర్పుతూ వారి భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు. ఆటవస్తువులు పంపిణీ చేసిన భాస్కర్‌యాదవ్... సీఎం కేసీఆర్, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డిలజన్మదినం పురస్కరించుకుని ఇటీవలమేడ్చల్ జిల్లా గ్రంథాలయాల చైర్మన్ భాస్కర్‌యాదవ్ మండలంలోని 61 అంగన్వాడీ కేంద్రాలకు ఆట వస్తువులను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చేతుల మీదుగా ఉచితంగా అందజేశారు. -
ప్లే స్కూల్లో టీ పడితే?
చిన్న పిల్లలను ప్లే స్కూల్స్‌లో వేయడం మన దగ్గర కూడా ఉంది. రెండేళ్ల వయసు పిల్లల నుంచి ఐదేళ్ల పిల్లలను కాసేపు ప్లే స్కూల్లో వదిలి తీసుకురావడం మనకు తెలుసు. పిల్లలు అక్కడ ఆడుకుంటారు. కాని ఆడుకోవడంలో ఒక్కోసారి ప్రమాదం జరిగితే? మన దగ్గర కాసేపు గొడవ చేస్తాం... మన ఖర్మ అని ఊరుకుంటాం. కాని బ్రిటన్‌లో అలా కాదు. అక్కడ ఒక తల్లి తన రెండున్నర ఏళ్ల పిల్లవాణ్ణి ప్లే స్కూల్లో వేస్తే అక్కడ ఆ పిల్లవాడు గాయాల పాలు అయ్యాడు. ఆ తల్లి ఊరుకోక కోర్టుకెక్కింది. కోర్టు ఆమెకు పరిహారం ఇచ్చింది. ఎంతో తెలుసా? సుమారు నాలుగు లక్షలు. బ్రిటన్‌లోని తీరప్రాంత పట్టణమైన బోర్న్మెస్లో నివసించే ‘ట్రేసి’ అనే మహిళ తన రెండున్నరేళ్ల పిల్లవాణ్ణి ప్లే స్కూల్లో వేసింది. అది మంచి స్కూలే. కాని ఆ రోజు ప్లే టైమ్‌లో పిల్లలు ఆడుకుంటూ ఉండగా టీచరు టీ తెప్పించుకుంది. పొగలు గక్కే ఆ టీ టేబుల్ మీద ఉండగా ట్రేసి కుమారుడు రెండున్నరేళ్ల ‘బెకర్’ దానిని తన మీద ఒలకబోసుకున్నాడు. చిన్నపిల్లాడు కావడం వల్ల టీ వేడిగా ఉండటం వల్ల చేతి మీద బొబ్బలు వచ్చాయి. వెంటనే హాస్పిటల్‌కు తీసుకువెళితే చికిత్స చేస్తున్న వైద్యులు ఆ బొబ్బలు చూసి ప్లే స్కూల్ మీద కోర్టుకెళ్లమని ట్రేసీకి సూచించారు. ట్రేసి వెంటనే కోర్టుకెళ్లింది. ఇది జరిగింది 2015లో. కేసు రెండేళ్ల పాటు సాగింది. చివరకు కోర్టు ఈ జనవరిలో ఆ ప్లేస్కూల్ వారిని 4,300 పౌండ్లు (సుమారు నాలుగు లక్షలు) పరిహారం కట్టమని తీర్పు ఇచ్చింది. ఈ మొత్తంలో వైద్యం కోసం చేసిన ఖర్చు పోగా మిగిలిన దానిని పిల్లవాడి పేరు మీద ఫిక్స్డ్ చేయమని కూడా కోర్టు చెప్పింది. అయితే అందులో విశేషం లేదు. బెకర్ తల్లి ట్రేసి అప్పటి నుంచి స్కూళ్లలో కాలిన గాయాల బారిన పడే పిల్లల కోసం ఒక నిధిని సేకరించే పనిలో పడింది. పిల్లల వైద్యం కోసం కొన్ని డబ్బులు అందించే సంస్థలు ఏర్పడాలని భావిస్తోంది. ప్రచారం చేస్తోంది. బెకర్ ఆరోగ్యంగా ఉన్నాడు కానీ వేణ్ణిళ్లతో స్నానం చేయడానికి భయపడుతున్నాడు. వేడి టీ మీద పడటం వల్ల కలిగిన భయం తాలుకు ప్రభావం అది. ప్లే స్కూళ్లు మన దగ్గర తగిన జాగ్రత్తలతోనే నడుస్తున్నాయి. కాని నిర్వాహకులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఇలాంటి సంఘటన చెబుతోంది. టీ విలువ పది రూపాయలు. కాని దాని కారణంగా ఏ ఇరవై వేలో ఫైను పడటం కంటే జాగ్రత్తగా ఉండటం మేలు కదా. -
పాప ఏడుస్తోందని.. నేలకేసి కొట్టింది!
-
ఇది ఫ్లైఓవర్ బడి!
ఆదర్శం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పిల్లలు అడుక్కొనే దృశ్యం, ఏవో వస్తువులు అమ్ముకునే దృశ్యాలు చూస్తూనే ఉంటాం. మరోవైపు స్కూలు బస్సుల్లో టిప్‌టాప్‌గా బడికి వెళ్లే పిల్లల్ని కూడా చూస్తూనే ఉంటాం. ‘ఇది సహజమే’ అనుకుంటే సమస్య ఏమీ ఉండదు. సమస్య అనుకుంటే మాత్రం...సమాధానం ఎక్కడో ఒకచోట కనిపిస్తుంది. దారి చూపిస్తుంది. ముంబైలో ‘సిగ్నల్ శాల’ కూడా అలాంటిదే. ఇది మన దేశంలో తొలి రిజిస్టర్డ్ ట్రాఫిక్ సిగ్నల్ స్కూల్. సమర్థ్ భారత్ వ్యాసపీఠ్ (యస్బీవీ) అనే స్వచ్ఛంద సంస్థ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర యాచించే పిల్లలు, రకరకాల వస్తువులు అమ్ముకునే పిల్లల స్థితిగతులపై కొన్ని నెలల పాటు లోతైన అధ్యయనం నిర్వహించింది. ముంబైలోని నాలుగు మేజర్ సిగ్నల్స్ దగ్గర సర్వేలు చేసింది. ఈ సర్వే వల్ల ‘ఎంత మంది పిల్లలు సిగ్నల్స్ దగ్గర గడుపుతున్నారు’... మొదలైన విషయాలపై స్పష్టత వచ్చింది. తరువాత పిల్లల తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు. అప్పుడు మరిన్ని వివరాలు తెలిశాయి. అందులో చాలామంది కరువును తట్టుకోలేక మహారాష్ట్రలోని మారుమూల గ్రామాల నుంచి పొట్ట చేతబట్టుకొని వచ్చిన వారే. పల్లెల్లో కంటే పట్టణాల్లో మెరుగైన జీవితం గడుపుదామని వచ్చిన వారి జీవితం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరే తెల్లారిపోతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని... చదువుకోవడం ద్వారా పిల్లలకు కలిగే ప్రయోజనాలు ఏమిటో తల్లిదండ్రులకు చెప్పడం మొదలుపెట్టారు. వారు కూడా అనుకూలంగా స్పందించారు. షిప్పింగ్ కంటైనర్‌ను థానేలోని ఫ్లైవోవర్ కింద అందమైన క్లాస్‌రూమ్‌గా మలిచారు. ఇందులో టీచర్స్ రూమ్, టాయిలెట్లు కూడా ఉంటాయి. ఫ్యాన్, ప్రొటెక్టర్లు ఉంటాయి. ‘ఎయిర్ టైట్’ చేయడం వల్ల బయటి నుంచి వాహనాల రణగొణధ్వనులేవీ వినిపించవు. మొదట్లో ‘ప్లే స్కూలు’గానే దీన్ని ప్రారంభించారు. పిల్లలు తమ ఇష్టం ఉన్నంతసేపు క్లాసులో కూర్చోవచ్చు. తొలి రోజుల్లో పదిహేను నిమిషాల నుంచి అర్ధగంట వరకు కూర్చునేవారు. మొదట్లో సిగ్నల్స్ దగ్గర పిల్లల్ని వెదికి, వారిని బుజ్జగించి స్కూలుకు తీసుకువచ్చేవారు. ఆ తరువాత మాత్రం పిల్లలే ఉత్సాహంగా రావడం మొదలైంది. ‘సిగ్నల్ శాల’లో నలుగురు ఫుల్ టైం టీచర్లు, ఒక అటెండర్లతో పాటు ఇంకా చాలామంది వాటంటీర్లు ఈ స్కూలు కోసం పనిచేస్తున్నారు. కేవలం చదువు మాత్రమే కాదు...శుభ్రత, క్రమశిక్షణ... ఇలా జీవితానికి అవసరమైన అనేక విషయాలను బోధిస్తున్నారు. ఈ స్కూల్లో చదువుకుంటున్న వాళ్లలో... చదువు రాని వాళ్లతో పాటు స్కూలు మధ్యలో మానేసిన పిల్లలు కూడా ఉన్నారు. 7వ తరగతి మధ్యలోనే చదువు ఆపేసిన పిల్లల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించి బోర్డ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ చేయిస్తున్నారు. ‘‘పిల్లలను డాక్టరో, ఇంజనీరో చేయాలనే పెద్ద పెద్ద కోరిలేవి మాకు లేవు. హుందాగా బతకడానికి అవసరమైన పునాదిని చదువు చెప్పడం ద్వారా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం’’ అంటున్నారు యస్బీవి సీయివో బటు సావంత్. పిల్లల అభిరుచులను బట్టి వొకేషనల్ క్లాసులు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిత్రాలు, సంగీతంతో పిల్లలను ఆకట్టుకోవడానికి టాటా టెక్నాలజీని ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నారు. ఈ విధానం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. పాఠాలు చెప్పడం మాత్రమే కాదు...పిల్లల కోసం హెల్త్‌క్యాంప్‌లు కూడా నిర్వహిస్తున్నారు. ‘‘పిల్లల్లో మంచి అలవాట్లు పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నాం. తినే ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలని చెబుతుంటాం. ఇది మాత్రమే కాదు... వారికి సంబంధించి... ఇది మంచి అలవాటు కాదు... అని ఏది అనిపించినా వెంటనే చెబుతాం. ఇలా జాగ్రత్తలు చెప్పడం వల్ల... స్కూలు అనేది కేవలం పాఠాలు నేర్పేది మాత్రమే కాదు... తమ క్షేమం గురించి ఆలోచించేది అనే విషయం అర్థమవుతుంది’’ అంటున్నారు బటు సావంత్. పిల్లలకు శుభ్రమైన దుస్తులు సమకూర్చడం కోసం ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. యోగా క్లాసులు నిర్వహించడం, ఆటలు ఆడించడం, ఆర్ట్-క్రాఫ్ట్ పాఠాలు బోధిస్తున్నారు. ‘‘చదువుకోవడం ద్వారా తమ భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకం వారిలో కనిపిస్తుంది. తోటి పిల్లల్లో ఎవరైనా స్కూల్ తరువాత యాచన చేస్తే మరుసటి రోజు... ఫిర్యాదు చేస్తున్నారు’’ అని చెబుతున్నారు సావంత్. సిగ్నల్ అనేది దారి చూపుతుంది. మన క్షేమం కోరుతుంది. సిగ్నల్ దగ్గర ఉన్న ‘సిగ్నల్ శాల’ కూడా పిల్లల విషయంలో అదే చేస్తుంది. -
ఆడుతు..పాడుతు
ఆకట్టుకుంటున్న ప్లేస్కూల్స్ ఆసక్తిచూపుతున్న తల్లిదండ్రులు బుడిబుడి నడకలతో పాఠశాలకు సప్తగిరికాలనీ : పోటీ ప్రపంచంతో మరింత పోటీ పడేందుకు తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు. తమ పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని మూడేళ్ల ప్రాయంలోపే ప్లేస్కూల్స్ బాట పట్టిస్తున్నారు. తల్లిదండ్రుల అభీష్టాలను గమనించిన స్కూల్స్ వివిధ రకాల ఆటవస్తువులను అందుబాటులో ఉంచుతున్నాయి. ఆటపాటలతో సరదాగా గడుపుతున్న చిన్నారులకు నిద్రవస్తే జోల పాట సైతం పాడుతున్నారు. ఇలాంటి పాఠశాలలు జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడు భారీగా పెరిగాయి. ఒక్క కరీంనగర్‌లోనే సుమారు 50కి పైగా ప్లేస్కూల్స్ ఉండగా, జిల్లా వ్యాప్తంగా 200కు పైగానే ఉండడం విశేషం. పాఠశాలలో పేరు నమోదు చేసేందుకు గతంలో కనీసం ఐదేళ్లు నిండేలా చూసేవారు. ప్రస్తుతం ప్లే, క్రస్, ప్రీప్రైమరీ పాఠశాలల రాకతో నర్సరీ, ఎల్కేజీ, యుకేజీలో ఆ ఐదేళ్ల పరిమితి కాస్త రెండున్నర, మూడేళ్లకు తగ్గింది. మూడేళ్లు కూడా నిండకముందే చిన్నారులను ప్లేస్కూల్స్‌లో చేర్పిస్తున్నారు. విద్యార్థులకు మొదటగా పాఠశాల వాతావరణాన్ని అలావాటు చేస్తారు. రోజు స్కూల్‌కు మారాం చేయకుండా వచ్చేలా తయారు చేస్తారు. ఇంటి కంటే పాఠశాలే నయం అనేలా విద్యార్థులు మారేలా చేస్తారు. ఆటపాటలలో విజ్ఞానాన్ని పెంపొందిస్తారు. టాయ్ స్కూటర్, టాయ్బోట్, జారుడు బండ, బాల్‌గేమ్స్, ఆపిల్ ట్రీ, ఆల్ఫాబెట్, మినీ స్విమ్మింగ్‌ఫూల్, సాండ్జోన్, బెడ్స్ వంటివి పిల్లలను ఆడుకునేందుకు అందుబాటులో ఉంచుతున్నారు. ఎల్సీడీ, ప్రొజెక్టర్ల ద్వారా కార్టూన్ల ద్వారా వినోదం అందిస్తారు. ఫీజులు సైతం అంతే మొత్తంలో ప్లే స్కూల్స్ అంటే చిన్న పిల్లలవే కదా అంటే పొరపాటు. హైయ్యర్ క్లాస్‌లకు ఉన్నంత ఫీజులు వసూలు చేస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పరికరాలు తేవాల్సి ఉండడంతో ఫీజు సైతం అదే రేంజ్లో ఉంటుంది. ఒక్కో ఆట పరికరాన్ని తీసుకొంటే లక్షల్లో ఉంటున్నాయి. పాఠశాలలో సౌకర్యాలను బట్టి నెలకు రూ.1200 నుంచి రూ.2500 వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని పాఠశాలలు ఏడాదికి సుమారు రూ.15 వేల నుంచి రూ.50 వేలు వసూలు చేస్తున్నారు. చిన్న వయస్సులోనే పంపించాలి – సీహెచ్.స్వాతి ప్రస్తుత కాలంలో విద్యకు చాలా ప్రాధాన్యత పెరిగింది. పోటీ కూడా అదే స్థాయిలో ఉంది. వీటన్నింటిని తట్టుకోవాలంటే చిన్న వయస్సులోనే బడికి పంపించాలి. ఆట వస్తువులు ఉంటుండడంతో త్వరగా రెడీ అవుతున్నారు. పాఠాలు కూడా ప్లే మెథడ్‌లో చెప్పేలా ఉండాలి. రోజు వెళ్తున్న – సన్విత నేను డెయిలీ స్కూల్‌కు వెళ్తున్న. అక్కడ చాలా సేపు ఆడుకోవచ్చు. ఇంకా టీచర్లు పాఠాలు ఆటలాడుకుంటూ చెబుతున్నారు. ఆటవస్తువులు చాలా ఉన్నాయి. స్లైడింగ్ బార్, హార్స్, వీల్, ఎన్నో ఉన్నాయి. మేం అందరం రోజుకు రెండు పీరియడ్లు ఆడుకుంటున్నం. పిల్లల అభిరుచికి అనుగుణంగా నేటి కాలంలో విద్యకు ప్రాధాన్యత పెరిగింది. పిల్లలను ఎంత త్వరగా బడిలో చేర్పిస్తే బాగుండు అనే ఆలోచనలో తల్లిదండ్రులు ఉన్నారు.మరి పడి వయస్సులో స్కూల్‌కు రావాలంటే కష్టమే. అందుకే వారి కోసం పాఠశాలలో అధునాతన ఆట పరికరాలు ఏర్పాటు చేస్తున్నాం. రోజుకు ఒక గంట సేపు అందులో ఆడుకుంటే వారికి స్కూల్‌కు రావాలనే తపన కలుగుతుంది. – సీహెచ్.శ్రీనివాసరావు, సాధనస్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ -
ఆటకట్టిస్తాం
అనుమతిలేని ప్లే స్కూళ్లపై కఠిన చర్యలు జిల్లాలో 425 పాఠశాలలు కొనసాగుతున్నట్లు నిర్ధారణ ఒక్కదానికీ గుర్తింపు లేని వైనం షోకాజ్ నోటీసులు జారీచేసిన విద్యాశాఖవారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం సాక్షి, రంగారెడ్డి జిల్లా: అనుమతి లేని ప్లే స్కూళ్లపై విద్యాశాఖ చర్యలకు దిగింది. గతవారం దిల్సుఖ్నగర్ సమీపంలోని మూసారాంబాగ్‌లోని స్టార్ కిడ్స్ ప్రీమియం ప్లేస్కూల్లో ఓ చిన్నారి లిఫ్ట్‌లో ఇరుక్కుని మరణించింన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలోని ప్లే స్కూల్స్‌పై విద్యాశాఖ ఆరా తీస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 37 మండలాల్లో ఒక్క ప్లే స్కూల్‌కు కూడా అనుమతి లేదు. అనుమతి లేకుండా కొనసాగుతున్న వీటిపై కఠినంగా వ్యవహరించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా మండలాల వారీగా నడుస్తున్న ప్లేస్కూళ్లను గుర్తించేందుకు ఉపక్రమించింది. 425 స్కూళ్లకు షోకాజ్ నోటీసులు.. జిల్లాలో మండలాల వారీగా తనిఖీలు నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులు ఇప్పటిరకు 425 ప్లే స్కూళ్లున్నట్లు గుర్తించారు. వీటి పరిధిలో దాదాపు 13వేల మందికి పైగా పిల్లలున్నట్లు అధికారుల అంచనాలు చెబుతున్నాయి. అనుమతి లేకుండా కొనసాగుతున్న ప్లేస్కూళ్లను గుర్తించిన వెంటనే వాటికి షోకాజ్ నోటీసులు జారీచేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 425 స్కూల్ మేనే జ్మెంట్లకు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు. అక్రమంగా నడుస్తున్నవి మరో 750.. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ప్లే స్కూళ్లు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. రాజధాని చుట్టూ ఉన్న 9 మండలాల్లో ఇప్పటివరకు 425 పాఠశాలలను గుర్తించారు. ఇవేగాకుండా మిగతా మండలాల్లోనూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటివరకు గుర్తించిన ప్లేస్కూళ్లలో కేవలం చిన్నారులకు ఆటపాటలతోనే సరిపెడుతున్నారు. అయితే కొన్ని అనుమతి పొందిన ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో అక్రమంగా ప్లేస్కూళ్లను నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ పరిశీలనలో వెల్లడైంది. ఇలా దాదాపు 750 పాఠశాలల్లో ఇలా ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో వీటి సంఖ్యను తేల్చేందుకు విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా.. ప్లే స్కూళ్లకు అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులుంటే అధికారికంగా వీటిని నిర్వహించే అవకాశం ఉందని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.