విశాఖపట్నం: స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్‌ఐ సూర్యనారాయణ తెలిపిన వివరాలివీ.. మువ్వల అలేఖ్య(29), ఆమె భర్త నరేష్, వారి ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులతో కలసి ఎంవీపీకాలనీలో నివాసముండేవారు. ఏఆర్‌లో కానిస్టేబుల్ అయిన నరేష్ ప్రస్తుతం సీబీఐ విభాగంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. భార్యాభర్తల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. రెండేళ్ల కిందట అలేఖ్య తన ఇద్దరు పిల్లలతో కలసి ఆరిలోవ ప్రాంతం మయూరినగర్ వచ్చేశారు. ఓ ఇల్లు అద్దెకు తీసుకొని అందులోనే ప్లే స్కూల్ నిర్వహిస్తున్నారు.
11 ఏళ్ల వయసు గల కుమారుడిని విజయవాడలో ఓ హాస్టల్‌లో చేర్చించారు. తొమ్మిదేళ్ల కుమార్తెతో కలసి ఆమె ప్రస్తుతం ఆరిలోవలో ఉంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆమె గదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొంతసేపటికి తల్లి ఫ్యాన్‌కు వేలాడుతున్న దృశ్యాన్ని చూసిన ఆమె కుమార్తె ఏడుస్తూ సెల్‌లో ఉన్న నంబర్లకు ఫోన్ చేసింది. దీంతో వెంటనే ఎంవీపీకాలనీలోని బంధువులు, గాజువాకలో ఉన్న అలేఖ్య తల్లి, బంధువులు ఆరిలోవ చేరుకున్నారు.
అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. సోమవారం మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించి.. మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కాగా.. భర్త వేధింపులు తాళలేక తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని అలేఖ్య తల్లి భవాని ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు పిల్లలను తనకు అప్పగించాలని వేడుకున్నారు. సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment