ఆడుతు..పాడుతు
-
ఆకట్టుకుంటున్న ప్లేస్కూల్స్
-
ఆసక్తిచూపుతున్న తల్లిదండ్రులు
-
బుడిబుడి నడకలతో పాఠశాలకు
సప్తగిరికాలనీ : పోటీ ప్రపంచంతో మరింత పోటీ పడేందుకు తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు. తమ పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని మూడేళ్ల ప్రాయంలోపే ప్లేస్కూల్స్ బాట పట్టిస్తున్నారు. తల్లిదండ్రుల అభీష్టాలను గమనించిన స్కూల్స్ వివిధ రకాల ఆటవస్తువులను అందుబాటులో ఉంచుతున్నాయి. ఆటపాటలతో సరదాగా గడుపుతున్న చిన్నారులకు నిద్రవస్తే జోల పాట సైతం పాడుతున్నారు. ఇలాంటి పాఠశాలలు జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడు భారీగా పెరిగాయి. ఒక్క కరీంనగర్‌లోనే సుమారు 50కి పైగా ప్లేస్కూల్స్ ఉండగా, జిల్లా వ్యాప్తంగా 200కు పైగానే ఉండడం విశేషం.
పాఠశాలలో పేరు నమోదు చేసేందుకు గతంలో కనీసం ఐదేళ్లు నిండేలా చూసేవారు. ప్రస్తుతం ప్లే, క్రస్, ప్రీప్రైమరీ పాఠశాలల రాకతో నర్సరీ, ఎల్‌కేజీ, యుకేజీలో ఆ ఐదేళ్ల పరిమితి కాస్త రెండున్నర, మూడేళ్లకు తగ్గింది. మూడేళ్లు కూడా నిండకముందే చిన్నారులను ప్లేస్కూల్స్‌లో చేర్పిస్తున్నారు. విద్యార్థులకు మొదటగా పాఠశాల వాతావరణాన్ని అలావాటు చేస్తారు. రోజు స్కూల్‌కు మారాం చేయకుండా వచ్చేలా తయారు చేస్తారు. ఇంటి కంటే పాఠశాలే నయం అనేలా విద్యార్థులు మారేలా చేస్తారు. ఆటపాటలలో విజ్ఞానాన్ని పెంపొందిస్తారు. టాయ్ స్కూటర్, టాయ్‌బోట్, జారుడు బండ, బాల్‌గేమ్స్, ఆపిల్ ట్రీ, ఆల్ఫాబెట్, మినీ స్విమ్మింగ్‌ఫూల్, సాండ్‌జోన్, బెడ్స్ వంటివి పిల్లలను ఆడుకునేందుకు అందుబాటులో ఉంచుతున్నారు. ఎల్‌సీడీ, ప్రొజెక్టర్ల ద్వారా కార్టూన్ల ద్వారా వినోదం అందిస్తారు.
ఫీజులు సైతం అంతే మొత్తంలో
ప్లే స్కూల్స్ అంటే చిన్న పిల్లలవే కదా అంటే పొరపాటు. హైయ్యర్ క్లాస్‌లకు ఉన్నంత ఫీజులు వసూలు చేస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పరికరాలు తేవాల్సి ఉండడంతో ఫీజు సైతం అదే రేంజ్‌లో ఉంటుంది. ఒక్కో ఆట పరికరాన్ని తీసుకొంటే లక్షల్లో ఉంటున్నాయి. పాఠశాలలో సౌకర్యాలను బట్టి నెలకు రూ.1200 నుంచి రూ.2500 వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని పాఠశాలలు ఏడాదికి సుమారు రూ.15 వేల నుంచి రూ.50 వేలు వసూలు చేస్తున్నారు.
చిన్న వయస్సులోనే పంపించాలి
– సీహెచ్.స్వాతి
ప్రస్తుత కాలంలో విద్యకు చాలా ప్రాధాన్యత పెరిగింది. పోటీ కూడా అదే స్థాయిలో ఉంది. వీటన్నింటిని తట్టుకోవాలంటే చిన్న వయస్సులోనే బడికి పంపించాలి. ఆట వస్తువులు ఉంటుండడంతో త్వరగా రెడీ అవుతున్నారు. పాఠాలు కూడా ప్లే మెథడ్‌లో చెప్పేలా ఉండాలి.
రోజు వెళ్తున్న
– సన్విత
నేను డెయిలీ స్కూల్‌కు వెళ్తున్న. అక్కడ చాలా సేపు ఆడుకోవచ్చు. ఇంకా టీచర్‌లు పాఠాలు ఆటలాడుకుంటూ చెబుతున్నారు. ఆటవస్తువులు చాలా ఉన్నాయి. స్లైడింగ్ బార్, హార్స్, వీల్, ఎన్నో ఉన్నాయి. మేం అందరం రోజుకు రెండు పీరియడ్‌లు ఆడుకుంటున్నం.
పిల్లల అభిరుచికి అనుగుణంగా
నేటి కాలంలో విద్యకు ప్రాధాన్యత పెరిగింది. పిల్లలను ఎంత త్వరగా బడిలో చేర్పిస్తే బాగుండు అనే ఆలోచనలో తల్లిదండ్రులు ఉన్నారు.మరి పడి వయస్సులో స్కూల్‌కు రావాలంటే కష్టమే. అందుకే వారి కోసం పాఠశాలలో అధునాతన ఆట పరికరాలు ఏర్పాటు చేస్తున్నాం. రోజుకు ఒక గంట సేపు అందులో ఆడుకుంటే వారికి స్కూల్‌కు రావాలనే తపన కలుగుతుంది.
– సీహెచ్.శ్రీనివాసరావు, సాధనస్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్