న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. వైరస్ ప్రభావంతో ఆరోగ్య పరిస్థితి విషమించి చాలామంది ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. దీంతో ప్రాణవాయువు(ఆక్సిజన్)కు డిమాండ్ పెరిగింది. చాలా ఆసుపత్రుల్లో సరిపడా ఆక్సిజన్ దొరక్క బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ వృథాను అరికట్టడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అభ్యర్థించింది. ఆసుపత్రుల్లో ప్రాణవాయువు వాడకంలో హేతుబద్ధత (రేషనల్) అవసరమని సూచించింది. దేశమంతటా సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆక్సిజన్ తయారీ యూనిట్లలో ఆక్సిజన్ ఉత్పత్తిని భారీగా పెంచినట్లు పేర్కొంది. దేశంలో ప్రస్తుతం రోజుకు 7,127 మిలియన్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని గుర్తుచేసింది. గత రెండు రోజులుగా పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించింది. త్వరలోనే అవసరానికి మించి ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. జిల్లా స్థాయి వరకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవడానికి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఆక్సిజన్ సరఫరా కోసం సిలిండర్లు, ట్యాంకర్ల కొరత లేకుండ చూడాలని పేర్కొంది. మెడికల్ ఆక్సిజన్‌ను ప్రస్తుతం మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, చత్తీస్‌గఢ్, పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో అధికంగా వినియోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment