oxygen demand
-
వ్యర్థానికి అర్థం.. పర్యావరణ హితం
సాక్షి, అమరావతి బ్యూరో: పర్యావరణానికి హానిలేకుండా ఉండేలా.. చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ పనులు గుంటూరు జిల్లాలో చురుగ్గా సాగుతున్నాయి. నెలరోజుల్లో ఈ ప్లాంటును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1,200 టన్నుల చెత్తను (నగరాలు, పట్టణాల్లో సేకరించే వ్యర్థాలను) ఉపయోగించి 15 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. జిందాల్ సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు, విశాఖపట్నంలలో రోజుకు 1,200 టన్నుల చెత్త సామర్థ్యం గల ప్లాంటులను ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు జిల్లా నాయుడుపేటలో దీన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడ డంప్ యార్డు కోసం 51.24 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. దీన్లో 15.50 ఎకరాల్లో రూ.340 కోట్లతో ఈ ప్లాంటు నిర్మిస్తున్నారు. 600 టన్నుల చెత్తను మండించే సామర్థ్యంగల రెండు బాయిలర్లు (మొత్తం 1,200 టన్నులు) ఏర్పాటు చేశారు. ఈ ప్లాంటు సామర్థ్యాన్ని 1,650 టన్నులకు విస్తరించే అవకాశం ఉంది. పబ్లిక్, ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలో నిర్మిస్తున్న ఈ ప్లాంటు కోసం 10 శాతం మార్కెట్ విలువతో భూమిని జిందాల్ సంస్థకు లీజుకు ఇచ్చారు. నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు, బయో కెమికల్ వ్యర్థాలు కలవకుండా చెత్తను వేరుచేసి ఉచితంగా ప్లాంటుకు సరఫరా చేయాల్సి ఉంది. ఈ ప్లాంటుకు మూడు నగరాలు, ఐదు మునిసిపాలిటీల నుంచి చెత్తను సరఫరా చేయనున్నారు. చెత్త నుంచి వచ్చే విద్యుత్తుకు ఒక యూనిట్‌కు రూ.6 చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అధునాతన యూరప్ సాంకేతికతతో చెత్తను మండించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. మండించేటప్పుడు వచ్చే పొగతో పర్యావరణానికి హానిలేకుండా ట్రీట్ చేస్తారు. 25 సంవత్సరాల తరువాత ఈ ప్లాంటును గుంటూరు నగరపాలక సంస్థకు అప్పజెప్పాల్సి ఉంటుంది. ఈ ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 70 మందికి, పరోక్షంగా 60 మందికి ఉపాధి కలుగుతుంది. పర్యావరణానికి ఎంతో మేలు ఈ ప్లాంటు నిర్మాణంతో పర్యావరణానికి ఎంతో మేలు కలగనుంది. ఒక టన్ను చెత్త నుంచి 2,250 కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. దీనికంటే 23 రెట్లు హానికలిగించే మిథేన్ 150 కిలోలు ఉత్పత్తి అవుతుంది. వీటితోపాటు లీచెడ్ ద్రావణం 50 లీటర్లు వస్తుంది. ఈ ద్రావణం భూమిలో ఇంకితే భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతోపాటు బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. ఈ ప్లాంటు నిర్మాణంతో ఈ సమస్యలు ఎదురవకుండా ఉంటాయి. ఈ ప్లాంటులో భాగంగా వెంగళాయపాలెం వద్ద నిర్మిస్తున్న విద్యుత్తు సబ్‌స్టేషన్ పనులు పూర్తికావాల్సి ఉంది. వెంగళాయపాలెం నుంచి ప్లాంటుకు నీటిని తరలించే పైపులైను పనులను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆగిపోయాయి. కొందరు కార్మికులు కరోనా బారినపడ్డారు. ప్రారంభించేందుకు సన్నాహాలు ప్లాంటు నిర్మాణ పనులు పూర్తికావడంతో ఒక బాయిలర్ ద్వారా 15 రోజులు ట్రయల్ రన్ నిర్వహించారు. చెత్తను 15 రోజుల పాటు గుంటూరు కార్పొరేషన్ నుంచి ప్లాంటుకు పంపాం. కోవిడ్ నుంచి ఉపశమనం కలుగగానే ప్లాంటును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తాం. ఈ ప్లాంటు పూర్తయితే గుంటూరుతో పాటు చుట్టుపక్కల నగరాలు, పట్టణాలకు ఉపయోగం. ప్రధానంగా పర్యావరణానికి మేలు కలుగుతుంది. – చల్లా అనురాధ,నగర కమిషనర్, గుంటూరు ప్లాంటు పనులు పూర్తయ్యాయి.. ప్లాంటు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వాటర్ పైపులైను, సబ్‌స్టేషన్ పనులు కొద్దిగా పూర్తికావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం లభిస్తోంది. పలువురు కార్మికులు కోవిడ్ బారిన పడ్డారు. కోవిడ్ పరిస్థితులు అనుకూలిస్తే నెలరోజుల్లోపు ప్లాంటును ప్రారంభిస్తాం. ఈ ప్లాంటు ప్రారంభమైతే పర్యావరణానికి హానికలగకుండా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. – ఎంవీ చారి, ప్రెసిడెంట్, ఏపీ ప్రాజెక్ట్స్ -
కోవిడ్ బాధితుల కోసం ఉచిత ఆక్సిజన్ హబ్‌లు..
సాక్షి, మియాపూర్: నగరంలో రోజు రోజుకు కరోనా రెండో దశ వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతోంది. దీంతో కరోనా బారిన పడిన వారికి ఆస్పత్రిలో బెడ్స్ దొరకక, ప్రాణవాయువు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో ఆక్సిజన్ పడకలు దొరకడం ఎంతో కష్టంగా మారింది. ఎంతో మంది ఆక్సిజన్ అందక ప్రాణాలు విడిచిన సంఘటనలు నగరంలో చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కొన్ని కార్పొరేట్ సంస్థల సహకారంతో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కరోనా లక్షణాలు లేకున్నా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే.. చందానగర్ సర్కిల్–21 పరిధిలో రెండు చోట్ల ఆక్సిజన్ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ హబ్‌లలో పడకలతో పాటు ఆక్సిజన్ కాన్సన్ట్రెటర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఇందులో శ్వాస సమస్య తో బాధపడేవారు ఈ హబ్‌లలో ఉచితంగా చికిత్స పొందవచ్చు. కరోనా లక్షణాలు లేకున్నా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినట్లయితే కూడా ఈ హబ్‌లలో చికిత్స అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఆక్సిజన్ హబ్‌లు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ► చందానగర్ సర్కిల్ పరిధిలో జీహెచ్ఎంసీ, ఐకియా సహకారంతో కోవిడ్ బాధితులకు ఉచితంగా ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఐకియా సంస్థ ఆక్సిజన్ హబ్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఐకియా సంస్థ సొంత నిధులతో ఆక్సిజన్ హబ్ ఏర్పాట్లకు కావాల్సిన యంత్రాలు, బెడ్స్‌ను సమకురుస్తోంది. ►మొదటి దశలో భాగంగా చందానగర్‌లోని హుడా కాలనీ కమ్యూనిటీ హాల్లో 30 పడకలతో ఆక్సిజన్ కాన్సన్ట్రెటర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ► అదే విధంగా త్వరలోనే మియాపూర్ డివిజన్ పరిధిలో కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రెటర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు సమయత్తం అవుతున్నారని అధికారులు తెలిపారు. ► హుడాకాలనీ కమ్యూనిటీహాల్ ఆక్సిజన్ హబ్‌లో టెలి మెడిసిన్ సౌకర్యాన్ని కూడా సమకురుస్తున్నారు. ► కరోనా లక్షణాలు లేకున్నా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడితే కూడా ఈ హబ్‌లలో ఉచితంగా చికిత్స పొందవచ్చని అధికారులు తెలిపారు. ఉచితంగా సేవలు పొందవచ్చు.. కరోనా లక్షణాలు లేకపోయిన శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఆక్సిజన్‌ను ఉచితంగా అందించేందుకు చందానగర్‌లోని హుడా కాలనీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాట్లు చేస్తు న్నారు. జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆక్సిజన్ హబ్‌ల పనులను వేగవంతం చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తాం. కరోనా రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో ఎంతో మంది బెడ్స్, ఆక్సిజన్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ఈ కేంద్రాలలో ఉచితంగా సేవలు పొందవచ్చు. – సుధాంశ్, డీసీ చందానగర్ సర్కిల్–21 -
ఆక్సిజన్ వృథాను అరికట్టండి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. వైరస్ ప్రభావంతో ఆరోగ్య పరిస్థితి విషమించి చాలామంది ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. దీంతో ప్రాణవాయువు(ఆక్సిజన్)కు డిమాండ్ పెరిగింది. చాలా ఆసుపత్రుల్లో సరిపడా ఆక్సిజన్ దొరక్క బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ వృథాను అరికట్టడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అభ్యర్థించింది. ఆసుపత్రుల్లో ప్రాణవాయువు వాడకంలో హేతుబద్ధత (రేషనల్) అవసరమని సూచించింది. దేశమంతటా సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆక్సిజన్ తయారీ యూనిట్లలో ఆక్సిజన్ ఉత్పత్తిని భారీగా పెంచినట్లు పేర్కొంది. దేశంలో ప్రస్తుతం రోజుకు 7,127 మిలియన్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని గుర్తుచేసింది. గత రెండు రోజులుగా పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించింది. త్వరలోనే అవసరానికి మించి ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. జిల్లా స్థాయి వరకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవడానికి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఆక్సిజన్ సరఫరా కోసం సిలిండర్లు, ట్యాంకర్ల కొరత లేకుండ చూడాలని పేర్కొంది. మెడికల్ ఆక్సిజన్‌ను ప్రస్తుతం మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, చత్తీస్‌గఢ్, పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో అధికంగా వినియోగిస్తున్నారు. -
‘కాలుష్య’ పరిశ్రమలపై న్యాయ పోరాటం
ఫిబ్రవరిలో విచారణకు పిల్! కేంద్ర అటవీ శాఖకు ‘ఫోరం ఫర్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్’ లేఖ సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జారీచేసిన నిబంధనలను తుంగలోకి తొక్కి గ్రేటర్ పర్యావరణాన్ని హననం చేస్తున్న కాలుష్య కారక పరిశ్రమలపై న్యాయపోరాటానికి పలు స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వేత్తలు సన్నద్ధమవుతున్నారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా 1999 నుంచి అమల్లో ఉన్న నిషేధానికి నిలువెల్లా తూట్లు పొడిచి పబ్బం గడుపుకుంటున్న వారిపై ఇటీవల రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కొందరు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఫిబ్రవరి మొదటి వారంలో విచారణకు రానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు తమ పరిశ్రమలను నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా విస్తరిస్తూ.. అపరిమిత ఉత్పత్తులకు పాల్పడుతున్న వారి నిర్వాకాలను కట్టడి చేయాలని కోరుతూ ఫోరం ఫర్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ సంస్థ ప్రతినిధి సజ్జల జీవానందరెడ్డి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు సమాచారం. నిబంధనలకు తూట్లు... నగర శివార్లలోని జీడిమెట్ల, పాశమైలారం, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని బల్క్ డ్రగ్, ఫార్మా పరిశ్రమలు వదులుతున్న జల, వాయు కాలుష్యంతో పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గతంలో స్పష్టంచేసింది. 2010లో దీనికి సంబంధించి పర్యావరణ కాలుష్య సూచీని విడుదల చేసింది. 2010లో పర్యావరణ కాలుష్య సూచీ ప్రమాదకర స్థాయిలో 70.7గా ఉంటే... 2011 నాటికి 74.58కు... 2013 నాటికి అత్యధికంగా 76.05కు చేరుతుందని పేర్కొంది. అయితే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించిన వాస్తవాలను పరిశ్రమల లాబీ మార్చేసింది. ఆయా ప్రాంతాల్లో పర్యావరణ కాలుష్య సూచీ కేవలం 47.33 శాతానికి తగ్గినట్లు చూపుతూ తప్పుడు నివేదికను సృష్టించింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, పీసీబీ అప్పిలేట్ అథారిటీ, రాష్ట్ర పరిశ్రమల శాఖలోని ఉన్నతాధికారులకు భారీగా ముడుపులు ముట్టజెప్పి తమ దారిలోకి తెచ్చుకుంది. అంతేకాదు ఆయాకంపెనీల నుంచి వెలువడుతున్న నీటిలో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ), వాయు కాలుష్యంలో నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ధూళిరేణువులు, సూక్ష్మ ధూలికణాల మోతాదును తక్కువగా చూపడం సంచలనం సృష్టించింది. సుప్రీం మార్గదర్శకాలూ బేఖాతరు సుప్రీం మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం 1999 ఏప్రిల్ 20న జారీచేసిన నిషేధ ఉత్తర్వుల (జి.ఓ.ఎం.ఎస్.నెం.62) ప్రకారం... నగర శివార్లు, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల పరిధిలోని బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచకూడదు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు కిలోమీటరు పరిధిలో ఎలాంటి విస్తరణ చర్యలు చేపట్టకూడదు. జల, వాయు కాలుష్య చట్టాలను ఉల్లంఘించే పనులకూ పాల్పడరాదు. కానీ..పరిశ్రమల లాబీ ఈ నిషేధానికి తెలివిగా తిలోదకాలిచ్చేలా చేసింది. ప్రభుత్వ పెద్దలను ఏడాదిగా అన్ని విధా లా ప్రసన్నం చేసుకొని 2013 జూలై 25న నిషేధం ఉత్తర్వులకు సవరణ చేస్తూ జి.ఓ.ఎం.ఎస్.నెం.64 జారీ అయ్యేలా చేసింది. దీని ప్రకారం జీరో లిక్విడ్ డిస్చార్జి (జల, వాయు, ఘన కాలుష్య ఉద్గారాలు పరిమితులకు లోబడి) ఉండే విధంగా ఉపకరణాలను ఏర్పాటు చేసుకున్న తరవాత... ఉత్పత్తి సామర్థ్యం, విస్తరణ చర్యలు చేపట్టుకోవచ్చన్న సాకు తో నిషేధాన్ని ఎత్తివేసేలా చేసింది. ఈ ఉత్తర్వులతో సుమారు 250 బడా కంపెనీలు తమ ఉత్పత్తులను అనూహ్యంగా పెంచుకునేందుకుగేట్లు బార్లా తెరిచినట్లైంది. దీంతో పరిశ్రమల లాబీ ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. చాలా పరిశ్రమలు తూతూ మంత్రం చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నాయి తప్ప ఎక్కడా కాలుష్య ఉద్గారాలను కట్టడి చేసే ఉపకరణాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసిన దాఖలాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.