- ఫిబ్రవరిలో విచారణకు పిల్!
- కేంద్ర అటవీ శాఖకు ‘ఫోరం ఫర్ సస్టైనబుల్ ఎన్విరాన్‌మెంట్’ లేఖ
సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జారీచేసిన నిబంధనలను తుంగలోకి తొక్కి గ్రేటర్ పర్యావరణాన్ని హననం చేస్తున్న కాలుష్య కారక పరిశ్రమలపై న్యాయపోరాటానికి పలు స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వేత్తలు సన్నద్ధమవుతున్నారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా 1999 నుంచి అమల్లో ఉన్న నిషేధానికి నిలువెల్లా తూట్లు పొడిచి పబ్బం గడుపుకుంటున్న వారిపై ఇటీవల రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కొందరు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఫిబ్రవరి మొదటి వారంలో విచారణకు రానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు తమ పరిశ్రమలను నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా విస్తరిస్తూ.. అపరిమిత ఉత్పత్తులకు పాల్పడుతున్న వారి నిర్వాకాలను కట్టడి చేయాలని కోరుతూ ఫోరం ఫర్ సస్టైనబుల్ ఎన్విరాన్‌మెంట్ సంస్థ ప్రతినిధి సజ్జల జీవానందరెడ్డి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు సమాచారం.
నిబంధనలకు తూట్లు...
నగర శివార్లలోని జీడిమెట్ల, పాశమైలారం, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని బల్క్ డ్రగ్, ఫార్మా పరిశ్రమలు వదులుతున్న జల, వాయు కాలుష్యంతో పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గతంలో స్పష్టంచేసింది. 2010లో దీనికి సంబంధించి పర్యావరణ కాలుష్య సూచీని విడుదల చేసింది. 2010లో పర్యావరణ కాలుష్య సూచీ ప్రమాదకర స్థాయిలో 70.7గా ఉంటే... 2011 నాటికి 74.58కు... 2013 నాటికి అత్యధికంగా 76.05కు చేరుతుందని పేర్కొంది.
అయితే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించిన వాస్తవాలను పరిశ్రమల లాబీ మార్చేసింది. ఆయా ప్రాంతాల్లో పర్యావరణ కాలుష్య సూచీ కేవలం 47.33 శాతానికి తగ్గినట్లు చూపుతూ తప్పుడు నివేదికను సృష్టించింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, పీసీబీ అప్పిలేట్ అథారిటీ, రాష్ట్ర పరిశ్రమల శాఖలోని ఉన్నతాధికారులకు భారీగా ముడుపులు ముట్టజెప్పి తమ దారిలోకి తెచ్చుకుంది. అంతేకాదు ఆయాకంపెనీల నుంచి వెలువడుతున్న నీటిలో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ), వాయు కాలుష్యంలో నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ధూళిరేణువులు, సూక్ష్మ ధూలికణాల మోతాదును తక్కువగా చూపడం సంచలనం సృష్టించింది.
సుప్రీం మార్గదర్శకాలూ బేఖాతరు
సుప్రీం మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం 1999 ఏప్రిల్ 20న జారీచేసిన నిషేధ ఉత్తర్వుల (జి.ఓ.ఎం.ఎస్.నెం.62) ప్రకారం... నగర శివార్లు, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల పరిధిలోని బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచకూడదు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు కిలోమీటరు పరిధిలో ఎలాంటి విస్తరణ చర్యలు చేపట్టకూడదు. జల, వాయు కాలుష్య చట్టాలను ఉల్లంఘించే పనులకూ పాల్పడరాదు. కానీ..పరిశ్రమల లాబీ ఈ నిషేధానికి తెలివిగా తిలోదకాలిచ్చేలా చేసింది. ప్రభుత్వ పెద్దలను ఏడాదిగా అన్ని విధా లా ప్రసన్నం చేసుకొని 2013 జూలై 25న నిషేధం ఉత్తర్వులకు సవరణ చేస్తూ జి.ఓ.ఎం.ఎస్.నెం.64 జారీ అయ్యేలా చేసింది.
దీని ప్రకారం జీరో లిక్విడ్ డిస్‌చార్జి (జల, వాయు, ఘన కాలుష్య ఉద్గారాలు పరిమితులకు లోబడి) ఉండే విధంగా ఉపకరణాలను ఏర్పాటు చేసుకున్న తరవాత... ఉత్పత్తి సామర్థ్యం, విస్తరణ చర్యలు చేపట్టుకోవచ్చన్న సాకు తో నిషేధాన్ని ఎత్తివేసేలా చేసింది. ఈ ఉత్తర్వులతో సుమారు 250 బడా కంపెనీలు తమ ఉత్పత్తులను అనూహ్యంగా పెంచుకునేందుకుగేట్లు బార్లా తెరిచినట్లైంది. దీంతో పరిశ్రమల లాబీ ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. చాలా పరిశ్రమలు తూతూ మంత్రం చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నాయి తప్ప ఎక్కడా కాలుష్య ఉద్గారాలను కట్టడి చేసే ఉపకరణాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసిన దాఖలాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.