వెంగళరావునగర్ (హైదరాబాద్): కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని, వాటిని ప్రజలు నమ్మేస్థితిలో లేరని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 163వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం టీఎస్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నేతృత్వంలో విద్యుత్ రంగంలో అనేక విజయాలు సాధించినట్టు పేర్కొన్నారు.
తెలంగాణకు తిరిగి చెల్లించే ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల అప్పులు నిలిపేశామని ఆర్‌కె సింగ్ అనడం శతాబ్దకాలంలోనే అతిపెద్ద అబద్ధమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా రుణాల చెల్లింపు ఆపిందిలేదని, ఏ రంగంలో అప్పు తీసుకున్నా సకాలంలో చెల్లించే రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. అందువల్లనే బ్యాంకులు ముందుకు వచ్చి అప్పులు ఇస్తామని క్యూ కడుతున్నాయన్నారు. కేంద్రం అబద్ధాలను మానుకోవాలని సూచించారు. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ చౌర్యాన్ని అరికట్టాలని అధికారులను కోరారు.
ఎక్కడైనా విద్యుత్ లైన్లు లూజుగా ఉన్నాయని ఫిర్యాదులు అందితే తక్షణమే స్పందించాలని సూచించారు. టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ సీఎండీ ఎ.గోపాల్‌రావు మాట్లాడుతూ సంస్థ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సజావుగా సాగాలంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని అన్నారు. సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో టీఎస్‌పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.రత్నాకర్‌రావు, పి.సదానందం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment