
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అద్దె ప్రాతిపాదికన ఏర్పాటు చేసుకున్న డీజిల్, పెట్రోల్ కార్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ కార్లు రోడ్డెక్కనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్)’రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. అటు పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ఇటు నిర్వహణ సమస్యలను పరిష్కరించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం తోడ్పడుతుందని స్పష్టం చేస్తోంది.
పర్యావరణ హితం కోసం..
దేశంలో పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. చమురు దిగుమతులను తగ్గించడం, పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గించడం కోసం ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా కేంద్ర విద్యుత్ శాఖ నేతృత్వంలోని ఎన్టీపీసీ, ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ, పవర్‌గ్రిడ్‌ల సంస్థల జాయింట్ వెంచర్‌గా ‘ఈఈఎస్‌ఎల్’ఏర్పాటైంది. దేశంలో ఇంధన పొదుపు, ఇంధన భద్రత రంగాల్లో కీలక చర్యలు చేపడుతున్న ఈ సంస్థ.. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు అద్దె ప్రాతిపాదికన ఎలక్ట్రిక్ కార్ల సరఫరాకు ముందుకు వచ్చింది. ఇందుకోసం ఇప్పటికే టాటా మోటార్స్ కంపెనీ నుంచి 10 వేల ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసింది. రూ.40 వేల నెలవారీ అద్దెపై ఆరేళ్ల కాలానికి ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేస్తామని తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని ఏటా 10 శాతం అద్దె పెంపు ఉంటుందని తెలిపింది.
అద్దె కార్లతో పాటు అందించే సేవలివీ..
- ఎలక్ట్రిక్ కార్లకు చార్జింగ్ కోసం సంబంధిత కార్యాలయాల్లోనే చార్జింగ్ కేంద్రాలు.
- వీటిని నడిపేందుకు సుశిక్షితులైన డ్రైవర్ల సేవలు.
- ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు కోరిన మేరకు ‘పికప్ అండ్ డ్రాప్ సేవలు.
- ఎలక్ట్రిక్ కార్ల బుకింగ్ షెడ్యూల్, చార్జింగ్, మరమ్మతులు, ఇతర నిర్వహణ.
- డ్రైవర్లకు ఏటా శిక్షణ కార్యక్రమాలు.
- ఒకవేళ ఆ అద్దె కార్లను ప్రభుత్వ కార్యాలయాలే కొనుగోలు చేయవచ్చు. ఈ ఈఎస్‌ఎల్ బిడ్డింగ్‌లో కొన్న ధరకు అదనంగా 5 శాతం చెల్లిస్తే.. కారును, ఐదేళ్ల పాటు సర్వీస్ సేవలను అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment